ప్రధాని మోడీతో భేటీ కానున్న యోగీ ఆదిత్యనాథ్-రామాలయ ప్రారంభానికి ఆహ్వానం,జమిలి చర్చ..
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఇవాళ ఢిల్లీ వెళ్లబోతున్నారు. సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న యోగీ ఆదిత్యనాథ్.. ప్రధాని మోడీతో భేటీ కాబోతున్నారు. ఈ మేరకు అపాయింట్ మెంట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీతో భేటీలో యోగీ ఆదిత్యనాథ్ యూపీకి సంబంధించిన పలు రాజకీయ, అభివృద్ధి అంశాలపై చర్చిస్తారు. అలాగే వచ్చే ఏడాది జనవరిలో జరిగే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తారు.
సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్న యోగీ ఆదిత్యనాథ్.. 6 గంటలకు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. ఇరువురు నేతల మధ్య జరిగే సమావేశానికి సంబంధించి ఎటువంటి అజెండాను వెల్లడించలేదు. అయితే యోగి తన పర్యటనలో కేంద్రం యొక్క ఒకే దేశం-ఒకే ఎన్నికల వ్యూహంపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అయోధ్య రామ మందిర నిర్మాణం పురోగతిపై ప్రధానికి యోగీ వివరించనున్నారు.

వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని యోగి ఆదిత్యనాథ్ ప్రధానిని కోరే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 10 నుండి 12వ తేదీ వరకూ లక్నోలో జరిగిన ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలను అమలు చేయడానికి పండుగ సీజన్‌లో అంటే అక్టోబర్ లేదా నవంబర్ లో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పుడు యోగీ ఆదిత్యనాథ్ ప్రధాని మోడీతో భేటీలో దీనికీ ఆహ్వానం అందించే అవకాశం ఉంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి రావాలంటూ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీ కీలకంగా మారింది. ఈసారి అయోధ్య రామాలయం అంశం అయినా, జమిలి ఎన్నికల నిర్ణయమైనా యూపీని దృష్టిలో ఉంచుకునే బీజేపీ అజెండా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. దీంతో ఇవాళ ప్రధాని మోడీతో సీఎం యోగీ ఆదిత్యనాథ్ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.












Click it and Unblock the Notifications