పాకిస్తాన్ విజయంపై సంబరాలు చేసుకుంటే రాజద్రోహం కేసులు-యోగీ ఆదిత్యనాథ్ వార్నింగ్
తాజాగా టీ 20 ప్రపంచకప్ లో భారత్ పై దాయాది దేశం పాకిస్తాన్ పది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీనిపై దేశంలోని కొందరు అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. భారత్ పై పాకిస్తాన్ విజయంపై జరుగుతున్న ఈ సంబరాలపై కేంద్రంతో పాటు బీజేపీ ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి.
భారత్ పై పాకిస్తాన్ సాధించిన టీ 20 ప్రపంచకప్ విజయంపై సంబరాలు చేసుకుంటున్న వారిపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ మండిపడ్డారు. ఈ నెల 24న ప్రపంచకప్ మ్యాచ్ లో పాకిస్తాన్ విజయంపై సంబరాలు చేసుకుంటున్న వారికి యోగీ హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ విజయంపై సంబరాలు చేసుకునే వారిపై రాజద్రోహం కేసులు పెడతామని సీఎం యోగీ హెచ్చరించారు. ఓ మీడియా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగీ ఈ హెచ్చరికలు చేశారు. వీటి లింక్ ను సదరు వార్తా సంస్ధ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

భారత్ పై పాకిస్తాన్ విజయం సాధించిన వేళ సంబరాలు చేసుకున్న ముగ్గురు కశ్మీర్ కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్ధుల్ని ఆగ్రాలో పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. స్ధానిక బీజేపీ నేతల ఫిర్యాదుతో వీరిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారు చదువుతున్న కాలేజీ యాజమాన్యం కూడా వారిని సస్పెండ్ చేసింది. అయితే వీరికి వ్యతిరేకంగా పలువురు హిందూ సంస్ధల సభ్యులు కాలేజీలో నిరసనలు కూడా చేపట్టినట్లు కళాశాల వర్గాలు తెలిపాయి. దీంతో యూపీలో దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆదివారం మ్యాచ్ తర్వాత మొత్తం ఏడుగురిపై ఐదు కేసులు నమోదు చేసినట్లు యూపీ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే సీఎం యోగీ స్పందించారు.
మరోవైపు రాజస్తాన్, జమ్ముకశ్మీర్ లోనూ పోలీసులు దాదాపు ఇలాంటి కేసుల్నే నమోదు చేశారు. రాజస్తాన్ లో ఇలా సంబరాలు చేసుకున్న ఓ స్కూల్ టీచర్ ను పోలీసులు అరెస్టు చేశారు. జమ్ముకశ్మీర్ లోనూ ఇద్దరు మెడికల్ విద్యార్ధుల్ని అరెస్టు చేసి వారిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా కింద కేసులు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications