ఒబామా భద్రతకు ఇచ్చే ప్రాధాన్యం భారత పౌరులకివ్వరా?: హైకోర్టు
న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ వస్తున్న సందర్భంగా స్వల్ప వ్యవధిలోని న్యూఢిల్లీలో సుమారు 15వేల సిసిటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న విషయంపై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టింది.
ఇదే వేగాన్ని దేశంలోని పౌరుల భద్రత విషయంలో కనబర్చడంలో మాత్రం ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టింది. మన పౌరుల అవసరాలు తీరాలంటే ‘ఆకాశం నుంచి ఎవరో ఒక వ్యక్తికి తీసుకురావాల్సి ఉంటుంది' అని జస్టిస్ బాదర్ దుర్రేజ్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

‘నిర్భయ అత్యాచార ఘటన సహా పలు అత్యాచార సంఘటనలు చోటు చేసుకుంటున్నందున.. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న సిసి కెమెరాలను ఒబామా పర్యటన అనంతరం కూడా కొనసాగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కోర్టు పై వ్యాఖ్యలు చేసింది.
‘ఒక విదేశీ అధ్యక్షుడి పర్యటన పురస్కరించుకుని స్వల్ప వ్యవధిలోనే ప్రభుత్వం వేలాది సిసి కెమెరాలను ఏర్పాటు చేసింది. భారతీయుల భద్రతకు సంబంధించి మేము ఆదేశిస్తే మాత్రం నెలలు, సంవత్సరాలపాటు సమయం తీసుకుంటారు' అని కోర్టు ఘాటుగా స్పందించింది.
కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు, స్థానిక పోలీసులు కెమెరాల ఏర్పాటు, తొలగింపుపై తమ స్పందనను తెలియజేయాలంటూ కోర్టు నోటీసులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications