ఘోర రోడ్డు ప్రమాదం: 10మంది భారతీయులు మృతి
అబుదాబి: దుబాయ్ దేశంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15మంది ఆసియా వాసులు మృతి చెందారు. వీరిలో 10మంది భారతీయులున్నారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు, రోడ్డు పక్కన ఆగివున్న ట్రక్కును వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలంలోనే 13 మంది భారతీయులు, బంగ్లాదేశీయులు మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది.
జెబెల్ అలీలోని పని స్థలానికి 27మంది కార్మికులను తీసుకెళుతున్న ఆ బస్సు బాగా రద్దీగా ఉండే ఎమిరేట్స్ రహదారిపై పక్కనే ఆగివున్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో బోల్తా కొట్టిన బస్సు 5 మీటర్ల దూరంలో పడిపోయింది. భారతీయ కార్మికులతోపాటు 13 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి, వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

మృతి చెందిన 10 కార్మికులు భారతదేశంలోని బీహార్ రాష్ట్రానికి చెందిన వారుగా ఇక్కడ భారత కాన్సలేట్ పిటిఐకి తెలిపారు. గాయపడిన మిగితా భారత, బంగ్లాదేశ్‌కు చెందిన కార్మికులను రషీద్, ఆల్ బరాహ ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదం ఈ ఏడాదిలో జరిగిన అతి పెద్ద ప్రమాదమని దుబాయ్ పోలీసులు తెలిపారు. చాలా మంది చనిపోయారు, మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications