న్యూజిలాండ్‌లో 6.9 తీవ్రతతో భూకంపం: భయంతో జనం పరుగులు
న్యూజిలాండ్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. శనివారం న్యూజిలాండ్‌లోని కెర్మాడెక్ దీవుల కేంద్రంగా భూకంపం సంభవించింది.
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం.. మార్చి 4వ తేదీ శనివారం మధ్యాహ్నం న్యూజిలాండ్‌లోని కెర్మాడెక్ దీవుల కేంద్రంగా భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. భూమి కంపించడంతో భయంతో ప్రజలు తమ నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు.
252 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని.. భూకంప తీవ్రత 500 కిలోమీటర్ల వరకు ఉందని పేర్కొంది. అయితే, ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదని.. స్థానిక అధికారులను అప్రమత్తం చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. సునామీ హెచ్చరికలు కూడా ఏమీ లేవని పేర్కొంది.

కాగా, నెల రోజులుగా న్యూజిలాండ్ దేశాన్ని భూకంపాలు, తుఫాన్లు భయపెడుతున్నాయి. వారం క్రితమే గిస్బోర్న్ నగరంలో భూకంపం సంభించింది. భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. అంతకుముందు 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. నెల రోజుల వ్యవధిలోనే మూడుసార్లు భూకంపాలు రావడంతో న్యూజిలాండ్ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
ఇటీవల వచ్చిన గాబ్రిల్లా తుఫాను న్యూజిలాండ్ దేశంలో పెను బీభత్సమే సృష్టించింది. ఇది ఇలావుండగా, ఇటీవల టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భారీ భూకంపంతో 50 వేల మంది వరకు మరణించారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications