చైనాలో కుప్పకూలిన బొగ్గు గని: భారీ పేలుడు- 82 మందికి పైగా దుర్మరణం
చైనాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 82 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరో తొమ్మిది మంది గల్లంతు అయ్యారు. పేలుడు తర్వాత గని పాక్షికంగా కుప్పకూలింది. దీంతో మరికొందరు కార్మికులు చిక్కుకున్నట్లు చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే విపత్తు నిర్వహణ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
చైనాలోని షాన్ఝీ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి కిన్యువాన్ కౌంటీలోని లియూషెన్యు బొగ్గు గనిలో ఒక్కసారిగా ఈ పేలుడు సంభవించింది. ఈ విషయాన్ని చైనా అధికారిక వార్తా గ్ఝిన్ హువా తెలిపింది. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 247 మంది కార్మికులు గని లోపల విధుల్లో ఉన్నారని పేర్కొంది. కార్బన్ మొనాక్సైడ్ భారీ పరిమాణంలో విడుదల కావడమే ఈ పేలుడుకు ప్రధాన కారణమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్‌పింగ్ తక్షణమే స్పందించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. క్షతగాత్రులకు అత్యుత్తమ చికిత్స అందించాలని సూచించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపాలని, చట్ట ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని సకాలంలో, పారదర్శకంగా విడుదల చేయాలని జిన్ పింగ్ ఆదేశించినట్లు షిన్హువా నివేదించింది.
చైనా ప్రధాని లీ కియాంగ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కిన్యువాన్‌లోని స్థానిక అత్యవసర నిర్వహణ అథారిటీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. సమగ్ర నివేదికను అందజేయాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది. 2000ల ప్రారంభం నుండి చైనా బొగ్గు గనులలో మరణాలను గణనీయంగా తగ్గించడంలో విజయం సాధించింది. కఠినమైన నిబంధనలు, మెరుగైన భద్రతా పద్ధతులను అమలు చేయడం ద్వారా తరచుగా సంభవించే గ్యాస్ పేలుళ్లు లేదా వరదల వంటి ప్రమాదాలను నియంత్రించింది.












Click it and Unblock the Notifications