9 వేళ ఏళ్ల నాటి ‘ప్రేతాత్మల’ రహదారి! కాలం దాచిన అడుగుజాడలు..
మీరు నడుస్తున్న దారి కింద.. సరిగ్గా మీ అడుగులు పడుతున్న చోటే, తొమ్మిది వేల సంవత్సరాల క్రితం ఒక ఆదిమానవుడు చెప్పులు లేకుండా నడిచాడని తెలిస్తే? మీ పాదముద్ర పడిన చోటే, ఒకప్పుడు భారీ ఆకారపు అడవి మృగాలు, తోడేళ్లు సంచరించాయని తెలిస్తే? వినడానికే ఒళ్లు గగుర్పొడిచే ఈ అద్భుతం ఇంగ్లాండ్‌లోని ఫార్మ్‌బీ (Formby) తీరంలో నిజమైంది! కాల గమనంలో, ఇసుక పొరల కింద దాగివున్న వేలాది సంవత్సరాల నాటి 'చరిత్రపూర్వ రహదారి' (Prehistoric Highway) ఇప్పుడు బయటపడింది. సముద్రపు అలల ఉధృతికి, తీరకోత కారణంగా పైనున్న బురద పొరలు తొలగిపోవడంతో.. కాలం గడ్డకట్టేసిన ఒక వింత ప్రపంచం శాస్త్రవేత్తల కళ్లముందు సాక్షాత్కరించింది.
దాదాపు రెండు మైళ్ల మేర విస్తరించి ఉన్న ఈ తీర ప్రాంతంలో ఒకటో రెండో కాదు.. ఏకంగా వేలాది పురాతన పాదముద్రలు లభ్యమయ్యాయి. మన పూర్వీకులైన ఆదిమానవులు, అంతరించిపోయిన అడవి జంతువులు ఒకే దారిలో, ఒకరి పక్కన ఒకరు నడిచిన అరుదైన సహజీవన దృశ్యాన్ని ఈ అడుగుజాడలు పట్టిచూపుతున్నాయి. 'నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్' జర్నల్‌లో ప్రచురితమైన ఈ సరికొత్త అధ్యయనం అంతర్జాతీయంగా శాస్త్రవేత్తలను విస్మయానికి గురిచేస్తోంది.

మంచు యుగం ముగింపు.. ఒకే దారిలోకి జీవరాశి!
ఈ అడుగుజాడల వెనుక ఒక భారీ పర్యావరణ పరిణామం దాగి ఉంది. గత మంచుయుగం (Ice Age) ముగింపు దశకు వచ్చినప్పుడు భారీ హిమానీనదాలు కరిగి, సముద్ర మట్టాలు విపరీతంగా పెరిగాయి. ఈ పర్యావరణ ఒత్తిడి కారణంగా అడవుల్లో ఉన్న వన్యప్రాణులు, తీరంలో ఉన్న మానవులు తమ మనుగడ కోసం క్రమంగా లోపలి భూభాగాల్లోకి తరలిరావాల్సి వచ్చింది. అలా అందరినీ ప్రకృతి ఒకే చోటకు చేర్చింది. ఈ క్రమంలో ఏర్పడిన రద్దీ తీరప్రాంత పర్యావరణ వ్యవస్థే ఈ 'ఫార్మ్‌బీ' తీరం.
ఈ అధ్యయన ప్రధాన రచయిత్రి అలిసన్ బర్న్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రాంతం గతంలోని ఒక అద్భుతమైన చిత్రాన్ని మన కళ్లముందు ఉంచుతుంది. ఇక్కడి ఇసుక దిబ్బల కింద సుమారు 36 వేర్వేరు పాదముద్రల పొరలతో కూడిన ఒక భారీ భౌగోళిక నిధి దాగి ఉంది. మధ్యరాతియుగం (Mesolithic) నుండి మధ్యయుగం (Medieval) వరకు వేర్వేరు కాలాల్లో నడిచిన మనుషుల అడుగుజాడలు ఒకదానిపై ఒకటి పొరలుగా ఏర్పడి కాలక్రమాన్ని రికార్డు చేశాయి. పరిశోధకులు రేడియోకార్బన్ డేటింగ్ ద్వారా బురదలో చిక్కుకున్న పురాతన వృక్ష బీజాలను (ఆల్డర్, బిర్చ్, స్పృస్) పరీక్షించగా.. ఈ తీరం సుమారు క్రీస్తు పూర్వం 15,000 (15,000 BCE) నుండి క్రీస్తు శకం 1450 (1450 AD) వరకు నిరంతరం వినియోగంలో ఉన్న రహదారి అని తేలింది.
తోడేళ్లు, ఆదిమానవుల సహజీవనం!
ప్రపంచవ్యాప్తంగా లభించే పురాతన పాదముద్రలు కేవలం మానవులకో లేదా ఏదైనా ఒక జంతువుకో సంబంధించినవిగా ఉంటాయి. కానీ, ఫార్మ్‌బీ తీరం మాత్రం పూర్తి స్థాయి పర్యావరణ వ్యవస్థను చూపుతోంది. ఇక్కడి బురదలో శతాబ్దాల క్రితం అంతరించిపోయిన భారీ అడవి పశువులైన 'ఔరోచ్‌లు' (Aurochs), గొప్ప రెడ్ డీర్‌లు, శక్తివంతమైన అడవి పందులు, క్రేన్‌ల వంటి పక్షుల అడుగుజాడలు స్పష్టంగా ఉన్నాయి. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. భయంకరమైన గ్రే తోడేళ్లు (Grey Wolves), పిల్లి జాతికి చెందిన క్రూరమృగం 'లింక్స్' (Lynx) పాదముద్రలపైనే మానవ పాదముద్రలు కూడా కలిసిపోయి ఉన్నాయి. అంటే, నాటి మానవులు ఈ క్రూరమృగాలతో కలిసి ఒకే దారిని, వనరులను పంచుకుంటూ సర్దుబాటు చేసుకుని బతికారని దీని ద్వారా స్పష్టమవుతోంది.
పశువుల అడుగులని కొట్టేసారు.. కానీ!
నిజానికి ఈ పాదముద్రలు దశాబ్దాలుగా అక్కడి ప్రజల కళ్లముందే ఉన్నాయి. 1970లలో స్థానిక బీచ్‌కోంబర్‌లు వీటిని కనుగొన్నప్పటికీ, ఆధునిక కాలంలోని ఆవులు, పశువుల అడుగుజాడలుగా భావించి కొట్టిపారేశారు. కానీ, 1990లలో ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఈ ముద్రలను నిశితంగా పరిశీలించి, పరిశోధనలు చేయడంతోనే ఈ ప్రాంతం యొక్క అసలు వయస్సు, చరిత్ర ప్రపంచానికి తెలిసింది. ఇక్కడి పైపొరలు చాలా సున్నితంగా ఉండటం వల్ల ఒక బలమైన తుఫాను వస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కానీ, లోతైన బురదలో గాలి సోకకుండా పూడిపోయిన అడుగుజాడలు మాత్రం వేల సంవత్సరాలైనా చెక్కుచెదరకుండా భద్రంగా ఉన్నాయి.
ప్రకృతి నుంచి మనిషి విడిపోయి బతకడం అనేది ఇటీవలి కాలంలో వచ్చిన మార్పు మాత్రమేనని.. మానవ చరిత్రలో అత్యధిక భాగం మన దైనందిన అడుగులు అడవి జంతువుల, వన్యప్రాణుల ప్రపంచపు లయలలో భాగంగానే సాగాయని ఈ వెయ్యేళ్ల నాటి అడుగుజాడల రహదారి మనకు గుర్తుచేస్తోంది.














Click it and Unblock the Notifications