ఇండియతో తాలిబన్ల చర్చలు -కండిషన్ ఇదే -మోదీ గిఫ్టును ముక్కలు చేశారు -అఫ్గానిస్థాన్ తాజా స్థితి ఇది..
దక్షిణాసియా దేశం అఫ్గానిస్థాన్ లో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నది. దేశం మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళిపోతున్నది. అఫ్గాన్ సైన్యాలు తలపుడుతున్నప్పటికీ తాలిబన్లదే పైచేయిగా ఉండటం, ఇప్పటికే ఎనిమిది ప్రాంతీయ రాజధానుల్ని కైవసం చేసుకున్న తాలిబన్లు కాబుల్ దిశగా పరుగులు తీస్తున్నారు. కచ్చితంగా మరో 90 రోజుల్లో తాలిబన్లు అఫ్గాన్ రాజధాని కాబూల్ సిటీని కైవసం చేసుకుంటారని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేశాయి. ఈ క్రమంలో పొరుగున ఉన్న భారత్ పాత్రపై చర్చ మరింత పెరిగింది..
రెండు దశాబ్దాల సుదీర్గ యుద్దం తర్వాత అమెరికా సేనలు అఫ్గాన్ నుంచి తిరిగి వెళ్లిపోయాక అక్కడ పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. తాలిబన్లు మళ్లీ దేశంపై పట్టు సాధిస్తున్నారు. అయితే, పొరుగున ఉన్న పాక్ నుంచి సహకారం తీసుకుంటోన్న తాలిబన్లు.. భారత్‌తో ఇప్పటివరకూ ఎటువంటి చర్చలూ జరపలేదని తాజాగా పేర్కొన్నారు. అంతేకాకుండా.. చర్చలు నిష్పాక్షికంగా జరుగుతాయంటేనే తాము భారత్‌తో చర్చలకు కూర్చుంటామని తేల్చి చెప్పారు. ఈ మేరకు తాలిబన్‌ల అధికార ప్రతినిధి మహ్మద్ సొహెయిల్ షాహీన్.. ఓ జాతీయ చానల్‌కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.

అఫ్గానిస్థాన్ గడ్డపై నుంచి మరో దేశంపై దాడులు చేసేందుకు ఏ వ్యక్తిని, లేదా సంస్థను అనుమతించబోమని కూడా సోహెయిల్ స్పష్టం చేశారు. అఫ్గానిస్థాన్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న అష్రాఫ్ ఘానీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని తేల్చి చెప్పిన ఆయన..ఘానీ ప్రభుత్వానికి తామెన్నటికీ లొంగబోమని పేర్కొన్నారు. పాక్థియా ప్రావిన్సులోని గురుద్వారాపై ఉన్న జెండాను తాలిబన్‌లు తొలగించారన్న వార్తలను కూడా ఆయన ఖండించారు.
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అరాచకం సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఆ దేశంలోని 75 శాతం భూభాగాన్ని ఆక్రమించుకున్న తాలిబన్లు.. తాజాగా మన దేశ ప్రధాని నరేంద్రమోదీ బహుమతిగా ఇచ్చిన హెలికాప్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కుందూజ్ ఎయిర్‌పోర్టులో ఎంఐ-35 హెలికాప్టర్‌ను వశపర్చుకున్నారు. రెండేండ్ల క్రితం (2019 అక్టోబర్‌లో) ఆఫ్ఘన్ సైన్యానికి భారత్ ఈ హెలికాప్టర్‌ను బహుమతిగా ఇచ్చింది. తాలిబన్లపై పోరుకు ఆఫ్ఘన్ సైన్యం దీన్ని వాడుతున్నది. ఇప్పుడా హెలికాప్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఒక వీడియో వైరల్ అవుతున్నది. కాగా, హెలికాప్టర్‌కు సంబంధించిన రోటర్ బ్లేడ్లు, కీలక విడిభాగాలు కనపించకపోవటం గమనార్హం. తాలిబన్లు ఈ హెలికాప్టర్‌ను వాడకుండా ఉండేందుకే ముందుజాగ్రత్తగా ఆఫ్ఘన్ సైన్యం వాటిని తొలగించినట్టు తెలుస్తున్నది.
ఇదిలా ఉండగా, తాలిబన్ల దాడిని తట్టుకోలేక వందలాది అఫ్గాన్ సైనికులు, పోలీస్ అధికారులు లొంగిపోతున్నారు. అటు.. తమ దేశాన్ని కాపాడాలంటూ ఆ దేశ క్రికెట్ ప్లేయర్ రషీద్ ఖాన్ ట్విట్టర్ వేదికగా ప్రపంచ దేశాలకు విన్నవించారు. పిల్లలు, మహిళలే కాకుండా వేలాది మంది అమాయకులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అఫ్గాన్ లో కొనసాగుతున్న తాలిబాన్ హింసను దృష్టిలో ఉంచుకుని అక్కడ ఉన్న భారతీయులను సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని పంపింది. ఈ విమానంలో 50 మంది భారతీయులను సురక్షితంగా తిరిగి తీసుకువచ్చారు.












Click it and Unblock the Notifications