వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఫ్గానిస్తాన్: తాలిబన్‌లు ఇంత వేగంగా ఎలా పట్టు సాధించారు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అఫ్గాన్ భద్రతా బలగాలు

అఫ్గానిస్తాన్‌లో తాలిబన్‌లు ఒక్కో ప్రాంతాన్నీ తమ అధీనంలోని తీసుకుంటున్న వేగం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఒక్కో ప్రాంతీయ రాజధాని వారి కైవసమవుతోంది.

అఫ్గాన్ ప్రభుత్వం తమ పట్టు నిలుపుకోవడానికి కష్టాలు పడుతుండగా తిరుగుబాటుదారులు మాత్రం వేగంగా పట్టు పెంచుకుంటున్నారు.

ఇటీవల లీకైన ఒక అమెరికా నిఘా నివేదిక ప్రకారం మరో కొద్ది రోజుల్లోనే కాబూల్‌పై తాలిబన్‌లు దాడి చేసే అవకాశం ఉంది. మరో 90 రోజుల్లో అఫ్గాన్ ప్రభుత్వం కూలిపోతుందని ఆ నివేదిక పేర్కొంది.

తాలిబన్‌లు ఇంత తొందరగా ఎలా పుంజుకోగలిగారు?

అమెరికా, దాని నాటో మిత్ర దేశాలు గత 20 ఏళ్ల కాలంలో అఫ్గాన్ బలగాలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆయుధ సంపత్తినీ సమకూర్చాయి.

అఫ్గాన్ సైన్యాన్ని శక్తిమంతంగా, సమర్థంగా మార్చినట్లు బ్రిటిష్, అమెరికా జనరల్‌లు ఎంతో మంది చెప్పుకున్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఆ మాటలన్నీ ఉత్తవేననిపిస్తోంది.

తాలిబన్‌ల బలమెంత?

ఆఫ్ఘన్ ప్రభుత్వం, సిద్ధాంతపరంగా, ఇప్పటికీ తన వద్ద ఒక పెద్ద శక్తితో పైచేయి సాధించాలి.

సైద్ధాంతికంగా చూస్తే భారీ సంఖ్యలో బలగాలు ఉన్న అఫ్గాన్ ప్రభుత్వమే ఇప్పటకీ బలంగా ఉన్నట్లు లెక్క.

అఫ్గాన్ భద్రతా దళాలు 3 లక్షలు కంటే ఎక్కువ ఉన్నట్లు కాగితాలపై లెక్కలు చెబుతున్నాయి.

అందులో అఫ్గాన్ సైన్యం, వైమానిక దళం, పోలీసులు అన్నీ కలిపి ఆఫ్ఘన్ భద్రతా దళాలు 300,000 కంటే ఎక్కువ ఉన్నట్లు కాగితాలపై లెక్కలు చెబుతున్నాయి.

అఫ్గాన్ బలగాలు

వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. సైనిక నియామకాల లక్ష్యాలు చేరుకునే విషయంలో అఫ్గానిస్తాన్ నిత్యం అమడ దూరంలో ఉంటోంది.

అఫ్గాన్ సైన్యం, పోలీసు విభాగాల చరిత్ర చూస్తే నిత్యం సమస్యలే. అధిక ప్రాణనష్టం, సిబ్బంది పలాయనం, అవినీతి వంటివి సైన్యం, పోలీసు విభాగాలను పీడిస్తున్నాయి.

లెక్కల్లో మాత్రమే ఉండి, వాస్తవంలో లేని సిబ్బంది జీతాలను కొందరు కమాండర్లు తమ జేబుల్లో వేసుకుంటుంటారు.

'స్పెషల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఫర్ అఫ్గానిస్తాన్' యూఎస్ కాంగ్రెస్‌కు సమర్పించిన తన తాజా నివేదికలో అఫ్గాన్ సైన్యం, పోలీసు విభాగాలలో అవినీతిపై ఆందోళన వ్యక్తంచేశారు. బలగాల వాస్తవ సంఖ్యపైనా అనుమానాలు వ్యక్తంచేశారు.

అఫ్గాన్ సైనిక అధికారులకు కూడా బలగాల వాస్తవ సంఖ్య ఎంతో కచ్చితంగా తెలియదని 'రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇనిస్టిట్యూట్'కు చెందిన జాక్ వాట్లింగ్ అన్నారు.

ఆయుధాలు, ధైర్యం కోల్పోకుండా నిలవడంలోనూ సమస్యలున్నాయి. చాలా సందర్భాలలో సంబంధం లేని ప్రాంతాలకు జవాన్లను పంపిస్తారు. దాంతో వారు ఏమాత్రం పోరాడకుండానే పోస్టులను వదిలి పారిపోతారు అన్నారు వాట్లింగ్.

తాలిబన్ల బలాన్ని అంచనా వేయడం ఇంకా కష్టం. 'యూఎస్ టెర్రరిజం కంబాటింగ్ సెంటర్' అంచనాల ప్రకారం తాలిబన్‌లకు 60 వేల మంది సాయుధులున్నారు. ఇతర మిలీషియా బృందాలు, మద్దతుదారులతో కలిపి వారి బలగం 2 లక్షలకు పైగా ఉంటుంది.

"స్వతంత్రంగా వ్యవహరించే కొన్ని శాఖల సంకీర్ణం తాలిబన్ గ్రూప్" అని మాజీ బ్రిటిష్ అధికారి డాక్టర్ మైక్ మార్టిన్ తన 'ఇంటిమేట్ వార్' పుస్తకంలో అభిప్రాయపడ్డారు. ఆ శాఖలు ఎప్పటికప్పుడు ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తాయని చెప్పారు మైక్.

అఫ్గాన్ ప్రభుత్వంలోనూ స్థానిక ఫ్యాక్షన్‌ల కారణంగా చీలికలున్నాయని మైక్ చెప్పారు.

తమ సొంత మనుగడ కోసం గిరిజన తెగలు, కుటుంబాలు, చివరికి ప్రభుత్వ అధికారులు కూడా అవతలి పక్షానికి మారిన సందర్భాలున్నాయని చరిత్ర చెబుతోంది.

వేలాది మంది తాత్కాలిక శిబిరాలలో నివసిస్తున్నారు

ఆయుధాల లభ్యత

ఆయుధాలు, నిధుల విషయానికొస్తే మళ్లీ అఫ్గానిస్తాన్ ప్రభుత్వానిదే పైచేయి అని చెప్పాలి.

సైనికుల జీతాలు, ఆయుధ సంపత్తి కోసం వందల కోట్ల డాలర్లు అఫ్గాన్‌కు అందాయి. అందులో అధిక భాగం అమెరికా నుంచే వచ్చింది.

'స్పెషల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఫర్ అఫ్గానిస్తాన్' ఈ ఏడాది జులైలో ఇచ్చిన నివేదిక ప్రకారం.. అఫ్గాన్ భద్రతా దళాలపై 8,800 కోట్ల డాలర్లకు పైగా ఖర్చు చేశారు.

అయితే, ఆ డబ్బు సక్రమంగా ఖర్చయిందా అనే ప్రశ్నకు యుద్ధ క్షేత్రంలో అంతిమంగా వచ్చే ఫలితమే సమాధానం చెప్పాలి.

యుద్ధంలో ప్రభుత్వం పైచేయి సాధించడానికి అఫ్గాన్ వైమానిక దళమే కీలకంగా నిలవాలి. కానీ, అఫ్గాన్ ఎయిర్‌ఫోర్స్‌కి ఉన్న 211 విమానాలకు సిబ్బందిని సమకూర్చుకోవడం, కాపాడుకోవడం వారికి సమస్య అవుతోంది. పైలట్లను తాలిబన్‌లు లక్ష్యంగా చేసుకుంటుండడంతో సమస్య తీవ్రమవుతోంది.

తాలిబన్‌ల దాడికి గురైన లష్కర్ గాహ్ వంటి నగరాల రక్షణకు అమెరికా వైమానిక సహకారం అందించినా అది ఎంతకాలం అనే విషయంలో స్పష్టత లేదు.

ఆదాయం కోసం తాలిబన్‌లు డ్రగ్స్ వ్యాపారంపై ఆధారపడతారు. అయితే, విదేశాల నుంచి కూడా వారికి ఆర్థిక సహకారం అందుతుంటుంది. ప్రధానంగా పాకిస్తాన్ నుంచి వారికి నిధులు వస్తుంటాయి.

తాలిబన్‌లు ఇటీవల అఫ్గాన్ భద్రతాబలగాల నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో అత్యధికం అమెరికా సమకూర్చిన ఆయుధాలే. హమ్వీస్, నైట్ సైట్స్, మెషీన్ గన్స్, మోర్టార్స్ వంటివి అందులో ఉన్నాయి.

సోవియట్ దండయాత్ర తరువాత అఫ్గానిస్తాన్ ఆయుధాలను భారీగా సమకూర్చుకుంది.

అయితే, ముతక పద్ధతుల్లో క్రూరంగా పోరాడి కూడా అధునాతన బలగాలను ఓడించవచ్చని తాలిబన్‌లు నిరూపించారు.

అమెరికా, బ్రిటిష్ సేనలపై తాలిబన్‌లు ఐఈడీలతో జరిపిన దాడులు చాలా క్రూరమైనవి.

అంతేకాదు, స్థానిక భౌగోళిక పరిస్థితులపై అవగాహన కూడా వారికి ఉన్న అదనపు బలం.

అఫ్గానిస్తాన్‌లో తాజా పరిస్థితి

ఉత్తర, పశ్చిమ ప్రాంతాలపై దృష్టి..

తాలిబన్‌లు తమకు గట్టి పట్టున్న దక్షిణ అఫ్గాన్ ప్రాంతంలో కాకుండా పశ్చిమ, ఉత్తర ప్రాంతాలలో వరుస దాడులు చేస్తున్నారని బ్రిటిష్ ఆర్మీకి చెందిన మాజీ బ్రిగేడియర్ బెన్ బారీ అంటున్నారు.

ఆదాయాన్ని అందించే కీలక చెక్ పాయింట్లు, సరిహద్దు మార్గాలనూ తాలిబన్‌లు తమ అధీనంలోకి తీసుకున్న విషయాన్ని బెన్ గుర్తు చేస్తున్నారు.

ముఖ్యమైన అధికారులు, మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులను హత్య చేస్తున్నారు.

తాలిబన్‌లు తమ వశం చేసుకున్న అన్ని ప్రాంతాలనూ తిరిగి కైవసం చేసుకుంటామంటున్న అఫ్గాన్ ప్రభుత్వం మాటలు గాలి మాటలుగానే కనిపిస్తున్నాయి.

పెద్ద నగరాలను చేజార్చుకోకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతున్నట్లుగా ఉందని బెన్ బారీ అన్నారు. లష్కర్ గాహ్ చేజారకుండా ఇప్పటికే భారీ ఎత్తున కమాండోలను మోహరించారు.

అయితే, అఫ్గాన్ స్పెషల్ ఫోర్సెస్ సంఖ్య చాలా తక్కువ. 10 వేల వరకు బలగాలుంటాయి. ఇప్పటికే వాటిని కూడా మోహరించారు.

ఒక్కటొక్కటిగా ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటుండడం తాలిబన్‌ల ధైర్యాన్ని మరింత పెంచుతుండగా అందుకు భిన్నంగా అఫ్గాన్ ప్రభుత్వం అడుగులు వెనక్కు వేస్తోంది. సైనిక జనరళ్లను తొలగించడం వంటి గందరగోళంలో ఉంది.

చివరకు ఏమవుతుంది?

పరిస్థితులు అఫ్గాన్ ప్రభుత్వానికి ఏమాత్రం అనుకూలంగా లేవని కచ్చితంగా చెప్పుకోవచ్చు.

అయితే, ప్రస్తుతం పరిస్థితి నిరాశాజనంగా ఉన్నప్పటికీ రాజకీయ కారణాలతో అఫ్గాన్ ప్రభుత్వం నిలబడొచ్చని జాక్ వాట్లింగ్ అన్నారు.

గిరిజన నాయకులపై ప్రభుత్వం గెలవగలిగితే యుద్ధంలో ప్రతిష్టంభన ఏర్పడే అవకాశం ఉందన్నారాయన.

మైక్ మార్టిన్ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తంచేశారు. మాజీ యుద్ధ వీరుడు 'అబ్దుల్ రషీద్ దోస్తుమ్ మజార్ ఇ షరీఫ్' తిరిగి రావడం కీలక పరిణామమంటున్నారు మైక్.

అయితే, అఫ్గానిస్తాన్‌లో చలికాలం ప్రారంభం కానుండంతో యుద్ధ క్షేత్రంలో దళాలకు మరింత కష్టమవుతుంది.

ఈ ఏడాది చివరి నాటికి యుద్ధంలో ప్రతిష్టంబనకు అవకాశం ఉంది. అఫ్గాన్ ప్రభుత్వం కూడా కాబూల్, ఇతర పెద్ద నగరాలను కాపాడుకునేందుకే మొత్తం శక్తి వెచ్చిస్తుందని, తాలిబన్‌లు వేగం తగ్గుతుందని మైక్ అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Afghanistan: How did the Taliban gain control so fast
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X