వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఫ్గానిస్తాన్: తాలిబాన్లకు డబ్బులు ఎలా వస్తున్నాయి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అఫ్గానిస్తాన్

అఫ్గానిస్తాన్ మానవ హక్కుల ఉల్లంఘనపై చాలా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మహిళా హక్కులపై చాలా వార్తలు వస్తున్నాయి. అయితే, ఇక్కడ ఆర్థిక వ్యవస్థ కూడా నానాటికీ పతనం అవుతోంది.

జులై 2021లో ఇక్కడి నుంచి అమెరికా సేనలు వెళ్లిపోయాయి. దీంతో అప్పటికే పతనం అవుతున్న ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారింది.

ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం, అఫ్గానిస్తాన్‌లో ప్రజల వార్షిక తలసరి ఆదాయం 368 డాలర్లు (రూ.30,260)కి పడిపోయింది. దీంతో ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ఒకటిగా అఫ్గానిస్తాన్ మారింది.

దేశ జనాభా 4.2 కోట్లలోని సగం మందికిపైగా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. 86 శాతం మంది తరచూ ఆకలితో పడుకోవాల్సి వస్తోంది. దేశంలో ఎక్కువ శాతం జనాభా ఆకలితో జీవించే దేశాల సూచీలో అఫ్గాన్ గత ఏడాదితో పోలిస్తే 12 స్థానాలు కిందకు పడిపోయినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (డబ్ల్యూఎఫ్‌పీ) వెల్లడించింది.

విదేశీ సాయం తగ్గిపోవడం, ప్రకృతి విపత్తులు (భూకంపాలు, వరదలు), ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఇక్కడి పరిస్థితులను మరింత దిగజారుతున్నాయి.

మరోవైపు అఫ్గాన్ సెంట్రల్ బ్యాంకుకు చెందిన 9.5 బిలియన్ డాలర్ల(రూ.78,122 కోట్లను) విదేశీ ఆస్తులను అంతర్జాతీయ ఆంక్షల వల్ల స్తంభింపజేశారు.

తమ ప్రభుత్వాన్ని నడిపించేందుకు ప్రస్తుతం తాలిబాన్లు కొత్త ఆదాయ మార్గాలను ఎంచుకుంటున్నారు.

అఫ్గానిస్తాన్

''ట్యాక్స్ కలెక్షన్ వీక్’’

తాలిబాన్‌లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల నుంచి వసూలు చేసే పన్నులను పెంచారు.

''ప్రస్తుతం దాదాపు అఫ్గాన్ మొత్తం తాలిబాన్ సైన్యం నియంత్రణ కొనసాగుతోంది. గతంలో ఏ గ్రూపు ఇంతలా భారీ భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకోలేదు. ప్రస్తుతం చాలా ప్రాంతాలపై తాలిబాన్లకు గట్టిపట్టుంది. దీంతో పన్నులు పక్కాగా వసూలు చేస్తున్నారు’’అని కెనడాకు చెందిన పరిశోధకుడు గ్రేమ్ స్మిత్ చెప్పారు.

డిసెంబరు 2021 నుంచి అక్టోబరు 2022 మధ్య తాలిబాన్ ప్రభుత్వం మొత్తంగా 1.5 బిలియన్ డాలర్లు (రూ.12,335 కోట్లు) పన్నులను ప్రజల నుంచి సేకరించినట్లు ప్రపంచ బ్యాంకు డేటా చెబుతోంది. గత రెండేళ్లు సేకరించిన మొత్తం పన్నుల కంటే ఇది ఎక్కువ.

పన్నుల వసూలులో సరిహద్దులపై నియంత్రణ ప్రధాన పాత్ర పోషిస్తోంది. సరిహద్దుల ద్వారా దిగుమతులు, ఎగుమతుల నుంచి వచ్చే పన్నుల వాటా మొత్తం పన్నుల్లో 59 శాతం వరకూ ఉంది. అంతకుముందు ఏడాది ఈ వాటా 50 శాతం కూడా లేదు.

''తాలిబాన్ ప్రభుత్వానికి దిగుమతి, ఎగుమతులపై విధించే కస్టమ్స్ ప్రధాన ఆదాయ వనరుగా మారింది’’అని స్మిత్ వివరించారు.

''వారికి అన్ని సరిహద్దులపైనా, ప్రభుత్వ కార్యాలయాలపైనా పక్కా నియంత్రణ ఉంది. దీంతో చాలా పన్నులను వసూలు చేయడం తేలిక అవుతోంది’’అని అఫ్గానీ జర్నలిస్టు అలీ హొస్పైనీ బీబీసీతో చెప్పారు.

''పన్నుల వసూలు విషయంలో ఇతర ప్రభుత్వాల కంటే తాలిబాన్లు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇదివరకు చాలా పన్నులను మధ్యలో ఉండే అధికారులు తినేసేవారు. కానీ, ఇప్పుడు అవినీతి తగ్గింది. అందుకే ఎక్కువ పన్నులు ప్రభుత్వ ఖజానాకు వెళ్తున్నాయి’’అని అలీ వివరించారు.

పన్నులను మెరుగ్గా సేకరించేందుకు జాతీయ స్థాయిలో ''ట్యాక్స్ కలెక్షన్ వీక్’’ పేరుతో వారోత్సవాలు కూడా ఇటీవల నిర్వహించారు.

అఫ్గానిస్తాన్

మతపరమైన పన్నులు

సాధారణ పన్నులతోపాటు కొన్ని మతపరమైన పన్నులను కూడా తాలిబాన్లు విధిస్తున్నారు.

''అశర్, జఖాత్’’గా పిలిచే ఈ పన్నులను తాలిబాన్లు అధికారంలోకి రాకముందు కూడా, కొన్ని ప్రాంతాల్లో వసూలు చేసేవారు. ఇప్పుడు వీటిని అన్ని ప్రాంతాల్లోనూ వసూలు చేస్తున్నారు.

తాలిబాన్‌ల పన్నుల వ్యవస్థ ఎలా ఉంటుందో బీబీసీకి అలీ వివరించారు. ''ఏటా మొత్తం ఆదాయాన్ని మనం లెక్కించాల్సి ఉంటుంది. వీటిలో ఐదో వంతు ప్రభుత్వానికి పన్నుగా కట్టాలి’’అని ఆయన చెప్పారు.

''మతపరమైన పన్ను ఎంత మొత్తం వసూలు చేస్తోరో చెప్పడం కష్టం. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి లెక్కలూ ఉండవు. అయితే, 99 శాతం అఫ్గాన్‌లు ముస్లింలే, దీంతో దాదాపు అందరూ ఈ మతపరమైన పన్నులు కడతారు’’అని ఆయన వివరించారు.

మరోవైపు మొత్తం పన్నుల వసూలు దీని వాటా ఎంత ఉంటుందో చెప్పడం కష్టమని స్మిత్ కూడా అంగీకరించారు.

''పన్నుల విషయంలో తాలిబాన్లు అంత పారదర్శకంగా ఉండరు. దీంతో పన్నులు ఎంత విధించారో చెప్పడం కష్టం’’అని ఆయన అన్నారు.

అఫ్గానిస్తాన్

ఖనిజాల తవ్వకం..

అఫ్గాన్‌లో ఖనిజ నిక్షేపాలు కూడా పుష్కలంగా ఉంటాయి. బొగ్గు, చమురు, బంగారం, రాగి, అరుదైన, విలువైన రాళ్ల గనులు ఇక్కడ ఉన్నాయి.

వీటి మొత్తం విలువ ఒక ట్రిలియన్ డాలర్లు (82.23 లక్షల కోట్లు) వరకు ఉండొచ్చని అమెరికా రక్షణ రంగ నిపుణుల అంచనా.

అయితే, ఈ ఖనిజాలను వెలికి తీసేందుకు అధునాతన యంత్రాలు, రవాణా సదుపాయాలు కావాలి. దీని కోసం మొదటగా ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంటుంది.

''ఇక్కడి విలువైన ఖనిజ సంపదను భారీగా తవ్వి తీయడం భవిష్యత్‌లోనూ కష్టమే’’అని స్మిత్ వివరించారు.

''బంగారం, రాగి నిక్షేపాలను తవ్వి బయటకు తీసుకెళ్లాలంటే మొదట రైల్వే వ్యవస్థ కావాలి. దీని కోసం భారీగా పెట్టుబడులు పెట్టాలి. కానీ, ఇక్కడి మౌలిక సదుపాయాలపై మదుపరులను ఆకర్షించడం చాలా కష్టం’’అని ఆయన అన్నారు.

ఇక్కడ ప్రధానంగా బొగ్గును మాత్రమే ఎగుమతి చేస్తున్నారు. అది కూడా ప్రధానంగా పాకిస్తాన్‌కే వెళ్తుంది.

తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి ఏడాది, పాకిస్తాన్‌కు వెళ్లే బొగ్గులో 20 శాతం పెరుగుదల కనిపించింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, రోజుకు పది వేల టన్నుల బొగ్గు ఎగుమతి చేస్తున్నారు.

అఫ్గానిస్తాన్

ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక ప్రకారం, 1.7 బిలియన్ డాలర్ల (రూ.13,980 కోట్లు) విలువైన అఫ్గానిస్తాన్ మొత్తం ఎగుమతుల్లో బొగ్గు వాటా 90 శాతం వరకు ఉంది.

అఫ్గాన్ ఖనిజాలు, వస్త్రాలు, వ్యవసాయ ఉత్పత్తుల్లో 65 శాతం పాకిస్తాన్‌కే వెళ్తాయి. మరో 20 శాతం భారత్‌కు వస్తాయి.

2021కి మునుపటి రెండు దశాబ్దాల్లో 126 చిన్న గనుల్లో తవ్వకాలు మాత్రమే ప్రారంభించారు. అయితే, గత ఏడాదిలోనే 60 కొత్త గనుల్లో తవ్వకాలు మొదలుపెట్టినట్లు తాలిబాన్ చమురు మంత్రిత్వ శాఖ చెబుతోంది. మరోవైపు ఖనిజాల అన్వేషణపై కొత్త ఒప్పందాలను తాలిబాన్లు కుదుర్చుకుంటున్నట్లు అలీ చెప్పారు.

''దీనిపై కొన్ని చైనా కంపెనీలు చర్చలు జరుపుతున్నాయి. ముఖ్యంగా రాగి గనుల తవ్వకంపై చర్చలు జరుగుతున్నాయి’’అని ఆయన వివరించారు.

మరోవైపు ఇటీవల చమురు అన్వేషణపై ఓ చైనా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తాలిబాన్లు ప్రకటించారు. తాలిబాన్‌లు ఇప్పటివరకు కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఇదే అతిపెద్దదని మీడియాలో విశ్లేషణలు వచ్చాయి.

అఫ్గానిస్తాన్

మత్తుమందులు కూడా...

అధికారంలోకి రాకముందు, దోపిడీ, కిడ్నాప్ లాంటి నేరాల ద్వారా తాలిబాన్లు ఆదాయం సంపాదించేవారు. మరోవైపు నల్లమందు సాగు కూడా భారీగా చేసేవారు.

ప్రపంచంలో నల్లమందు అక్రమ సాగులో 80 శాతం అఫ్గాన్‌లోనే జరుగుతోందని ఐక్యరాజ్యసమితి డేటా చెబుతోంది.

అయితే, ఏప్రిల్ 2022లో నల్లమందు సాగుపై నిషేధం విధిస్తున్నట్లు తాలిబాన్లు ప్రకటించారు.

దశాబ్దాలుగా ఇక్కడి అవినీతి పాలకులు, అధికారులతోపాటు రైతులు కూడా నల్లమందు సాగులో ప్రధాన పాత్ర పోషించేవారు.

మరి తాలిబాన్లు ప్రకటించిన నల్లమందుపై నిషేధం అమలవుతోందా? అయితే, తాలిబాన్లు దీనికి కట్టుబడినట్లుగానే కనిపిస్తోందని గత జులైలో అమెరికా ప్రభుత్వం ఒక నివేదికలో వెల్లడించింది.

అయితే, మత్తుమందుల అక్రమ రవాణా నుంచి వచ్చే ఆదాయం తగ్గిందని, అయితే, ఇప్పటికీ ఇది కొనసాగుతోందని అలీ భావిస్తున్నారు.

''మత్తుమందుల సాగుపై నిషేధం విధించారు. అయినప్పటికీ కొన్ని చోట్ల వీటిని సాగు చేస్తున్నారు. ఇదివరకు ఇలాంటి సాగుపై ఆదాయంలో ఎక్కువ భాగం అవినీతి అధికారుల చేతికి అందేది. ఇప్పుడు మాత్రం నేరుగా తాలిబాన్ ఖజానాకు వెళ్తోంది’’అని ఆయన చెప్పారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో అఫ్గానిస్తాన్‌కు రూ.200 కోట్ల ఆర్థిక సాయం అందించబోతున్నట్లు భారత్ కూడా ప్రకటించింది. ఈ నిధులను రుణాలు, సాయం రూపంలో అందిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Afghanistan: How is the money coming to the Taliban?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X