ఆఫ్గన్‌లో ప్రజా తిరుగుబాటు.. ఆ మూడు జిల్లాలు తాలిబన్ల చెర నుంచి విముక్తి.. ఆ కమాండర్ నాయకత్వంలో..
ఆఫ్గనిస్తాన్‌లో ప్రజా తిరుగుబాటు మొదలైంది. తాలిబన్ల చెర నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు అక్కడి ప్రజలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తాలిబన్లకు మెడలు వంచేది లేదని... సాయుధ పంథాలోనే వారికి బుద్ది చెబుతామని కదులుతున్నారు. యాంటీ తాలిబన్ కమాండర్ ఖైర్ మహమ్మద్ అందరబీ నేత్రుత్వంలో స్థానిక ప్రజలు జరిపిన తిరుగుబాటులో బాగ్లన్ ప్రావిన్స్‌లోని మూడు జిల్లాలను తాలిబన్ల నుంచి విముక్తి చేయగలిగారు. ఇందులో పొల్ ఇ హెసర్,దెహ్ సలహ్,బను జిల్లాలు ఉన్నాయి.
Recommended Video
ఆ మూడు జిల్లాల నుంచి తాలిబన్లను తరిమికొట్టి తాలిబన్ జెండా స్థానంలో ఆఫ్గనిస్తాన్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ తిరుగుబాటులో పలువురు తాలిబన్ ఫైటర్లు మృతి చెందగా.. మరికొందరు గాయపడినట్లు తెలుస్తోంది. ఇతర జిల్లాలను కూడా తాలిబన్ల చెర నుంచి విముక్తి చేయబోతున్నామని ఖైర్ మహమ్మద్ నేత్రుత్వం వహిస్తున్న ఆ తిరుగుబాటు సమూహం ప్రకటించింది.

ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల వశమయ్యాక అధ్యక్షుడు ఆష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. దేశ ప్రజల భద్రతను గాలికొదిలేసి తన దారి తాను చూసుకున్నారు. ఆష్రఫ్ ఘనీ చర్యను పిరికిపంద చర్యగా అంతర్జాతీయ సమాజం తూర్పార పట్టింది. ఘనీ పిరికిపందలా పారిపోతే ఆఫ్గన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ మాత్రం ధైర్యంగా నిలబడ్డారు. రాజ్యాంగం ప్రకారం ప్రస్తుతం తానే ఆఫ్గనిస్తాన్‌కు ఆపద్ధర్మ అధ్యక్షుడినని ప్రకటించుకున్నారు. అంతేకాదు,తాలిబన్ల ఆట కట్టించేందుకు వెంటనే వ్యూహ రచన ప్రారంభించారు.
పంజ్‌షేర్ కేంద్రంగా తాలిబన్లను అణచివేసే ప్లాన్‌పై సలేహ్ సమాలోచనలు జరుపుతున్నారు. ఇప్పటివరకూ ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల వశం కాని ప్రావిన్స్ ఇదొక్కటే.ఇక్కడ అడుగుపెట్టాలంటే తాలిబన్ల వెన్నులో వణుకు పుడుతుందని చెబుతారు. ఇప్పుడే కాదు,గతంలోనూ తాలిబన్లు ఇక్కడ అడుగుపెట్టలేకపోయారు. ఇందుకు కారణం ఇక్కడి ప్రజల తెగింపేనని చెబుతారు. ఉగ్రవాదులను అంతం చేయడమే తప్ప... వారికి మోకరిల్లేది లేదని ఇక్కడి స్థానికులు చెబుతుంటారు. ఆఫ్గనిస్తాన్‌పై అమెరికా బాంబు దాడి జరిపిన సమయంలోనూ... ఈ ప్రాంతం ప్రశాంతంగానే ఉంది. గతంలో ఎన్నో తిరుగుబాట్లకు ఈ ప్రాంతం వేదికగా నిలిచింది. ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్‌లో సేఫ్ జోన్ ఇదొక్కటే కావడంతో... అమృల్లా సలేహ్ ఇక్కడినుంచే పోరాట వ్యూహాలు రచిస్తున్నారు.
నార్తర్న్ కూటమి పేరిట తాలిబన్లపై సాయుధ పోరాటానికి సలేహ్ ప్రణాళికలు రచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే ఆర్మీతో పాటు ప్రజలు అక్కడక్కడా తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. సాయుధ పోరాటానికి సలేహ్ పిలుపునిస్తే ప్రజలంతా ఆ మార్గాన్ని అనుసరించవచ్చు. రక్తపాతం జరిగినా సరే... ప్రాణాలు కోల్పోయినా సరే... మాతృభూమి విముక్తే ధ్యేయంగా ఈ పోరాటం జరగవచ్చు.
దేశంలో ప్రజాస్వామ్యం ఉండదని ఇస్లామిక్ చట్టాలే అమలవుతాయని ఇప్పటికే తాలిబన్లు ప్రకటించారు. అగ్రరాజ్యం అమెరికా.. విముక్తి భారాన్ని ఆఫ్గన్లకే వదిలేసింది. తమది కాని పోరాటంలో ఇక తమ సైనికులను సమిదలు చేసేందుకు సిద్దంగా లేమని బైడెన్ ప్రకటించారు. ఇప్పటివరకూ ఇతర దేశాలేవీ ఆఫ్గన్ ప్రజల తరుపున పోరాటం చేసేందుకు ముందుకు రాలేదు.దీంతో ఆఫ్గన్ విముక్తి ఇక తమ చేతుల్లోనే ఆధారపడి ఉందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. అందుకే సాయుధ పోరాట పంథా వైపు అడుగులేస్తున్నారు.












Click it and Unblock the Notifications