Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అఫ్గానిస్తాన్: రాజధాని కాబుల్‌ను చుట్టుముట్టిన తాలిబాన్లు

కాబుల్ నగరంలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు

అఫ్గానిస్తాన్‌ నుచి దశాబ్దానికి పైగా విస్తృతంగా వార్తలు అందిస్తున్న బీబీసీ ప్రతినిధి యాల్దా హకీమ్, రాజధాని కాబుల్ నగరంలో మిలిటెంట్లకు పెద్దగా ప్రతిఘటన కనిపించలేదని అన్నారు.

https://twitter.com/BBCYaldaHakim/status/1426805816531750912

అఫ్గానిస్తాన్ అధ్యక్ష కార్యాలయానికి చెందిన ట్విటర్ అకౌంట్‌లో కాసేపటి కిందట పోస్ట్ అయిన సమాచారం ప్రకారం, తాలిబాన్లు కాబుల్ నగరంలోకి ప్రవేశిస్తున్నారనే వార్తల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపింది.

కాబుల్‌లో అక్కడక్కడా కాల్పుల ఘటనలు జరిగాయని, కానీ, నగరం మీద దాడి జరగలదేని, దేశ రక్షణ దళాలు, అంతర్జాతీయ సేనల సమన్వయంతో నగరాన్ని సురక్షితంగా ఉంచే ప్రయత్నంలో ఉన్నారని ఆ సందేశంలో తెలిపారు. పరిస్థితి అదుపులో ఉందని కూడా ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

అఫ్గానిస్తాన్

ఇప్పటికే ప్రధాన నగరాలు తాలిబాన్ల చేతుల్లో...

ఉత్తర అఫ్గానిస్తాన్‌లో చాలా ప్రాంతాలు శనివారం నాటికే తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ప్రాంతీయ రాజధానుల్లో సగానికిపైగా వారి ఆధీనంలోనే ఉన్నాయి.

ప్రజలను ఉద్దేశించి అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ప్రసంగించారు. యుద్ధ ప్రభావం ప్రజలపై పడనివ్వమని, మరిన్ని మరణాలు సంభవించకుండా అడ్డుకుంటామని ఆయన అన్నారు. అయితే, తమ ప్రణాళికలు ఏమిటో వెల్లడించలేదు.

దేశ రాజధాని కాబూల్‌కు తాలిబన్లు సమీపంలోకి వచ్చేశారు. కాబూల్‌కు 40 కి.మీ. దూరంలోని మైదాన్ షార్ ప్రాంతంలో భీకర కాల్పులు కొనసాగుతున్నాయి.

తాలిబన్లు

మరోవైపు కాబూల్‌కు కేవలం ఏడు మైళ్ల దూరంలోని చార్ అస్యబ్ జిల్లాలోనూ తాలిబన్లు పోరాడుతున్నారని ఏపీ వార్తా సంస్థకు చట్టసభ సభ్యుడొకరు తెలిపారు.

ఉత్తర అఫ్గాన్‌లోని ప్రభుత్వ ఆధీనంలోనున్న ఏకైక ప్రధాన నగరం మజర్-ఏ-షరీఫ్‌లోనూ భీకర ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.

తమ దేశ పౌరులను తమ దౌత్య కార్యాలయాల నుంచి సురక్షితంగా తీసుకెళ్లేందుకు అమెరికా దళాలు వస్తున్నాయి. మరోవైపు 600 మంది బ్రిటిష్ సిబ్బంది కూడా తమ పౌరులను తీసుకెళ్లేందుకు వస్తున్నారు.

హెల్మాండ్‌లో తాలిబన్లు

కేవలం ఏడు మైళ్ల దూరంలో..

దేశ రాజధాని కాబూల్‌కు కేవలం ఏడు మైళ్ల దూరంలోని చార్ అస్యబ్ జిల్లాకు తాలిబన్ల చేరుకున్నారని స్థానిక చట్టసభ సభ్యుడు శనివారం నాడు వార్తా సంస్థ ఏపీతో చెప్పారు.

ఈ విషయాన్ని బీబీసీ ధ్రువీకరించలేదు.

ఒకవేళ ఇదే నిజమైతే, ప్రభుత్వానికి తాలిబన్లు అత్యంత సమీపంలోకి వచ్చినట్లే. అఫ్గాన్ భద్రతా బలగాలకు ఇది పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది.

తాలిబన్లు

గతంలో ఏమైంది?

1996లోనూ ఇలానే భద్రతా బలగాలతో పోరాడి కాబూల్‌ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నాలుగేళ్లపాటు అంతర్యుద్ధం కొనసాగిన అనంతరం దేశ రాజధాని తాలిబన్ల చేతుల్లోకి వెళ్లింది.

నగరంలోని దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాలను తాలిబన్లు ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలపై తాలిబన్ జెండాలు ఎగిరాయి.

ఆ తర్వాత అప్పటి అధ్యక్షుడు మహమ్మద్ నజీబుల్లాను తాలిబన్లు బహిరంగంగా ఉరితీశారు.

ఆ తర్వాత తాలిబన్లు తమ సొంత విధానాలతో పాలనను మొదలుపెట్టారు. బాలికలు పాఠశాలకు వెళ్లడంపై ఆంక్షలు విధించారు. ఇంటి నుంచి బయటకు వస్తే, మహిళలు బుర్ఖా తప్పకుండా వేసుకోవాలని, మగవారు పక్కన ఉంటేనే బయటకు రావాలనే నిబంధనలు తీసుకొచ్చారు.

మరణ శిక్షలు, చేతులు కాళ్లు నరికేయడం తదితర కఠిన శిక్షలను తాలిబన్లు అమలు చేసేవారు.

దేశ అధ్యక్షుడు ఏం అన్నారు?

అష్రాఫ్ ఘనీ

అఫ్గానిస్తాన్‌పై తాలిబన్ల పట్టు బిగుస్తున్న సమయంలో దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

''హింసతోపాటు పరిస్థితులు మరింత దిగజారకుండా అడ్డుకోవడమే అధ్యక్షుడిగా నా తొలి ప్రాధాన్యం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వలస పోతున్న ప్రజలకు అండగా నిలుస్తాం’’అని అఫ్గాన్ ప్రజలకు ఘనీ భరోసా ఇచ్చారు.

''ప్రస్తుత పరిస్థితుల్లో భద్రతా బలగాలను ఒక చోటకు సమీకరించడంపై మేం దృష్టి సారిస్తున్నాం. ఆ దిశగా చర్యలు కూడా తీసుకుంటున్నాం’’అని ఆయన చెప్పారు.

''ఈ యుద్ధం భారం ప్రజలపై పడినివ్వం. మరిన్ని మరణాలు సంభవించకుండా అడ్డుకుంటాం’’అని ఘనీ అన్నారు. నగరాల్లో తాలిబన్లతో ధైర్యంగా పోరాడుతున్న భద్రతా బలగాలను ఆయన ప్రశంసించారు.

రాజీనామా చేస్తారనే వార్తల నడుమ, ఘనీ ప్రజల ముందుకొచ్చి ప్రసంగించారు.

అఫ్గానిస్తాన్

కాబూల్‌కు ఎంత దూరంలో ఉన్నారు?

చాలా ప్రాంతాల్లో భీకర కాల్పుల నడుమ సురక్షితమైన రాజధాని నగరం కాబూల్‌కు ప్రజలు పరుగులు తీస్తున్నారు. మరోవైపు తాలిబన్లు ఒకటి తర్వాత ఒకటిగా అన్ని నగరాలపై పట్టు సాధిస్తున్నారు. ప్రస్తుతం కాబూల్‌కు కూడా వారు చేరువలోనే ఉన్నారు.

కాబూల్ ప్రావిన్స్‌ ప్రధాన గేట్ల దగ్గర తాలిబన్లపై అమెరికా సేనలు వైమానిక దాడులు చేస్తున్నాయని వార్తలు వస్తున్నాయి.

కాబూల్ నగరంపై మరో 30 రోజుల్లో తాలిబన్లు పట్టు సాధించే అవకాశముందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

గత వారంలో అఫ్గాన్‌లోని చాలా ప్రధాన నగరాలు వరసగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోతూ వచ్చాయి.

అఫ్గానిస్తాన్

శుక్రవారం రాత్రి కూడా లోఘార్ ప్రావిన్స్ రాజధాని పుల్-ఏ-ఆలం నగరాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇది కాబూల్‌కు కేవలం 80 కి.మీ. దూరంలో ఉంది.

కాబూల్‌కు 40 కిమీ. దూరంలోని మైదాన్ షార్‌ నగరంలోనూ విధ్వంసకర ఘర్షణలు చెలరేగుతున్నాయి.

సగానికిపైగా ప్రావిన్స్‌లలోని రాజధానులు ఇప్పటికే తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. దేశంలో రెండో అతిపెద్ద నగరమైన కాందహార్ కూడా తాలిబన్ నగరాల జాబితాలో చేరిపోయింది.

అఫ్గాన్‌లో పరిస్థితులు చేజారిపోతున్నాయని, దీని భారం ప్రజలపై పడుతోందని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు.

తాము అధికారంలోకి వస్తే మళ్లీ షరియా చట్టాన్ని అమలు చేస్తామని తాలిబన్ కమాండర్లు బీబీసీతో చెప్పారు. అక్రమ సంబంధాల జోలికి వెళ్తే రాళ్లతో కొట్టడం, దొంగతనం చేస్తే చేతులు నరికేయడం, 12ఏళ్లకుపైబడిన అమ్మాయిలను పాఠశాలలకు వెళ్లకుండా అడ్డుకోవడం తదితర నిబంధనలను వారు ఇదివరకు అమలు చేశారు.

తాలిబన్లు

''ఘనీ రాజీనామా చేయరు’’

తాజా ప్రసంగం అనంతరం ఘనీకి రాజీనామా చేసే ఆలోచన లేదని తెలుస్తోందని అఫ్గాన్‌లోని బీబీసీ ప్రతినిధి సికందర్ కిర్మానీ అన్నారు.

''తాలిబన్లపై పోరాటానికి భద్రతా బలగాలను మళ్లీ సమీకరించడంపై ఆయన మాట్లాడుతున్నారు. అయితే, ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందో ఎవరికీ అర్థంకావడం లేదు.’’

''కాబూల్‌లో చాలా మంది తాలిబన్లను వ్యతిరేకిస్తున్నారు. అయితే తాలిబన్ల చేతుల్లోకి కాబూల్ వెళ్లిపోవడం కంటే, ఇక్కడ జరిగే యుద్ధం గురించే ఎక్కువ మంది ఆందోళన చెందుతున్నారు’’అని కిర్మానీ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+