లైఫ్ అండ్ డెత్ రేస్: పురుషులకు 18 ఏళ్లు నిండితే చాలు..దానికి అదే అర్హత: జో బిడెన్
వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో అగ్రరాజ్యం.. అగ్రరాజ్యంగానే కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల్లో..కరోనా మరణాల్లో ఇప్పటికీ అందనంత ఎత్తులో ఉంటోంది అమెరికా. పాజిటివ్ కేసుల వెల్లువ తగ్గట్లేదు. మరణాల్లోనూ అదే తీవ్రత కొనసాగుతూనే ఉంది. అమెరికాలో ఇప్పటిదాకా 5,70,247 మంది ప్రాణాలొదిలారు. 3,15,59,735 పాజిటివ్ కేసులక్కడ నమోదయ్యాయి. కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ.. కరోనాకు బ్రేకులు పడట్లేదు. అంతకంతకూ వేల సంఖ్యలో కొత్త కేసులు రికార్డవుతూనే వస్తున్నాయి. వైరస్ వ్యాప్తి చెందడాన్ని అరికట్టడానికి వంద రోజుల ప్రణాళిక అమల్లో ఉంటోంది.

ప్రతి పురుషుడికీ వ్యాక్సిన్..
ఈ పరిణామాల మధ్య అధ్యక్షుడు జో బిడెన్ సంచలన ప్రకటన చేశారు. అమెరికాలో నివసించే ప్రతి పురుషుడికీ కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని వెల్లడించారు. దీనికి 18 ఏళ్లు నిండి ఉండాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మగవాడూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి అర్హులని తెలిపారు. ఈ నెల 19వ తేదీ నాటికి దీన్ని అమలు చేస్తామని వెల్లడించారు. కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాక్సినేషన్‌ను మరింత ముమ్మరం చేయాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు.

90 శాతం లక్ష్యం.. పెంపు
అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం 75 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన తన అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో మాట్లాడారు. ఇదివరకు 90 శాతం మంది పురుషులకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశంలో వ్యాక్సిన్ స్టాక్స్ సంతృప్తికర స్థాయిలో ఉండటంతో ఆ లక్ష్యాన్ని సవరించామని చెప్పారు. 18 ఏళ్లు నిండిన ప్రతి పురుషుడికీ టీకా ఇస్తామని స్పష్టం చేశారు. ఫెడరల్ ఫార్మసీ వ్యాక్సినేషన్ కేంద్రాలను కూడా భారీగా పెంచబోతున్నామని స్పష్టం చేశారు. 17 వేల వ్యాక్సినేషన్ సెంటర్లు ఉన్నాయని, ఆ సంఖ్యను 40 వేలకు పెంచనున్నట్లు బిడెన్ పేర్కొన్నారు.

ముప్పు తొలగిపోలేదు.. జవన్మరణ పోరాటమే..
ఏప్రిల్ 19వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ విషయంలో గందరగోళానికి దారి తీసే ఎలాంటి నిబంధనలు ఉండబోవని స్పష్టం చేశారు. ఇంతా చేస్తోన్నప్పటికీ తాము ఇంకా లక్ష్యానికి దూరంగానే ఉన్నామని బిడెన్ చెప్పారు. కరోనా ముప్పు ఏ మాత్రం తొలగిపోలేదనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని అన్నారు. కరోనాను నిర్మూలించాలనే లక్ష్యాన్ని అందుకోవడానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని చెప్పారు. ఇంకా జీవన్మరణ పోరాటంలోనే ఉన్నామని అన్నారు. కరోనా కొత్త వేరియంట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని, కోవిడ్ ప్రొటోకాల్‌ను పాటించడం ద్వారా మాత్రమే దాన్ని అడ్డుకోగలమని స్పష్టం చేశారు.

కరోనా వ్యాక్సిన్ సెంటర్‌లో బిడెన్
తాను అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన జనవరి 20వ తేదీ నుంచి ఇప్పటిదాకా 150 మిలియన్ల డోసుల వ్యాక్సిన్లను పంపిణీ చేశామని, మరే దేశం కూడా ఈ ఘనతను సాధించలేదని బిడెన్ చెప్పారు. అంతకుముందు- వైట్‌హౌస్ నుంచి మాట్లాడటానికి ముందు ఆయన వర్జీనియా అలెగ్జాండ్రియాలోని ఓ కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్ వర్కర్లతో మాట్లాడారు. వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చిన స్థానికులతో ముచ్చటించారు. తన వంద రోజుల పరిపాలన పూర్తయ్యే సరికి దేశవ్యాప్తంగా 200 మిలియన్ మంది ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వాల్సిన కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి ఉంటుందంటూ ఇదివరకు జో బిడెన్ అధికార యంత్రాంగానికి నిర్దేశించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications