
Earthquake: వణికిన ఆఫ్ఘనిస్తాన్: 250 మందికి పైగా బలి: శిథిలాల్లో వందలమంది
కాబుల్: ఆఫ్ఘనిస్తాన్‌ను పెను భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా రికార్డయింది. ఈ ఘటనలో పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. 250 మంది మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందంటూ వార్తలొస్తున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే తాలిబన్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. సహాయక చర్యలను చేపట్టింది. శిథిలాల తొలగింపు పనులను ముమ్మరం చేసింది. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలిస్తోంది.
పాక్ సరిహద్దుల్లో..
ఆఫ్ఘనిస్తాన్ ఆగ్నేయదిశలో ఉన్న పక్టికా ప్రావిన్స్‌లో భూకంపం సంభవించంది. పాకిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉంటుందీ ప్రాంతం. ఈ ప్రావిన్స్ రాజధాని ఖోస్ట్ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న గయాన్ జిల్లాను భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యూఎస్ జియాలాజికల్ సర్వే తెలిపింది. ఉపరితలం నుంచి సుమారు 51 కిలోమీటర్ల లోతున చోటు చేసుకున్న భూఫలకాల కదలికల వల్ల ఈ ప్రకంపనలు సంభవించినట్లు పేర్కొంది.
పలు భవనాలు నేలమట్టం..
ఈ ఘటనలో వందకు పైగా భవనాలు నేలమట్టం అయ్యాయి. శిథిలాల మధ్య చిక్కుకుని ఇప్పటివరకు 250 మంది మరణించారు. 200 మందికి మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలిస్తున్నామని తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే భయాందోళనలు వ్యక్తమౌతోన్నాయి. భూ ప్రకంపనలు 500 చదరపు కిలోమీటర్ల వరకు కనిపించినట్లు స్థానిక మీడియా తెలిపింది.
హిందుకుష్ రీజియన్‌లో..
ఈ ప్రావిన్స్‌లో అత్యధికంగా మట్టితో చేసిన నివాసాలు ఉన్నాయని, భూకంపం ధాటికి అవన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయని స్థానిక మీడియా పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపాలు సంభవిస్తుండటం సాధారణమే అయినప్పటికీ.. ఈ స్థాయిలో ప్రాణాలను తీసిన సంఘటన మాత్రం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. హిందుకుష్ మౌంటెయిన్ రీజియన్‌లో తరచూ భూ ప్రకంపనలు నమోదవుతుంటాయని యూఎస్ జియాలాజికల్ సర్వే పేర్కొంది.
హెలికాప్టర్లతో..
కాగా- సహాయక చర్యల కోసం తాలిబన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున హెలికాప్టర్లను వినియోగిస్తోంది. క్షతగాత్రులను కాబుల్, కాందహార్ వంటి నగరాల్లో ఉన్న ఆసుపత్రులకు తరలిస్తున్నామని ప్రభుత్వ అధికార ప్రతినిధి చెప్పారు. మృతుల సంఖ్య పెరగకుండా అన్ని చర్యలు చేపట్టామని వివరించారు. గయాన్ జిల్లాలోని బర్మాలా, జిరుక్, నాకా పట్టణాలపై భూకంపం తీవ్రత పెద్ద ఎత్తున పడిందని, మృతుల సంఖ్య ఈ పట్టణాల్లోనే అధికంగా ఉన్నట్లు చెప్పారు.
At least 250 people have lost their lives after a powerful earthquake jolted #Afghanistan's Paktika province.
— Hamza Azhar Salam (@HamzaAzhrSalam) June 22, 2022
Prayers for the victims of this horrendous tragedy. Sadly, the world has been quick to forget about #Afghans. #paktika #AfghanWomen #earthquake pic.twitter.com/Rcygdaq2OR