వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Angkor Wat: అంకోర్ సామ్రాజ్యం అభివృద్ధి, అంతం రెండిటికీ నీరే కారణమా.. ఆసియాలోనే అత్యంత ప్రాచీన నీటి పారుదల వ్యవస్థ ఎలా ఉండేది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఆంగ్‌కోర్ వాట్

ఏటా అంకోర్‌వాట్‌కు లక్షలాది మంది సందర్శకులు వెళ్తూ ఉంటారు. కానీ, ఆ సామ్రాజ్య విస్తరణకు, పతనానికి కారణమైన విస్తృతమైన నీటి పారుదల వ్యవస్థ గురించి మాత్రం వారిలో చాలామందికి తెలియదు.

సోఫీ పెంగ్ తన కుటుంబంతో కలిసి ఏటా ఏప్రిల్‌లో నూతన సంవత్సర సంబరాలు జరుపుకోవడానికి కంబోడియాలోని పవిత్రమైన నోమ్ కులేన్ పర్వతానికి వెళ్తారు. అంకోర్‌ను పాలించిన చక్రవర్తి జన్మస్థలంగా ఆ ప్రాంతానికి స్థానికుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది.

క్రీస్తు శకం 802లో చక్రవర్తుల పట్టాభిషేక సమయంలో అభిషేకించిన జలాలతో ఆశీర్వాదం అందుకోవాలని పండుగల సమయంలో కంబోడియా ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్తారు.

అంకోర్ సామ్రాజ్యాన్ని స్థాపించిన రెండో జయవర్మన్ పట్టాభిషేక సమయంలో ఈ పవిత్ర జలాలతో తొలుత అభిషేకించి.. ఆ తరువాత ఆయనను దేవరాజుగా ప్రకటించారు. దీంతో అంకోర్ సామ్రాజ్య స్థాపనకు అంకురార్పణ పడింది.

అనంతరం ఈ సామ్రాజ్యం నేటి కంబోడియా, లావోస్, థాయిలాండ్, వియత్నాం వరకూ విస్తరించింది. పారిశ్రామికీకరణకు ముందు అంకోర్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద నగరంగా పేరు పొందింది.

సీమ్ రీప్ సిటీకి 50 కిలోమీటర్ల ఉత్తరాన ఉన్న ఈ పవిత్రమైన నగరాన్ని చరిత్రలో సజీవంగా నిలిపేందుకు 1000 శివలింగాలను ప్రతిష్టించారు. బాల్ స్పీన్ నదీ తీరంలో వీటిని ప్రతిష్టించారు. అక్కడ నుంచి అంకోర్ భూభాగానికి, టోన్‌లే శాప్ సరస్సుకు నీరు ప్రవహిస్తుంది. ఇప్పటికీ ఈ నీటిని పవిత్రంగా భావిస్తారు. ఈ నీటికున్న శక్తి రోగాలను దూరం చేసి అదృష్టం కలుగచేస్తుందని కొందరు నమ్ముతారు.

"కంబోడియా ప్రజలకు ఇది చాలా ప్రత్యేకమైన స్థలం. ఇది మా చరిత్రలో ముఖ్యమైన భాగం" అని పెంగ్ చెప్పారు.

"ఏటా మేం కొత్త సంవత్సరం సంబరాలు జరుపుకొనేందుకు మౌంట్ కులేన్ వస్తాం. మేం గుడిలో నైవేద్యం సమర్పించి బాల్ స్పీన్ నది నీటిని మాపై చల్లుకుంటాం. ఇది మాకు అదృష్టాన్ని కలిగిస్తుందని నమ్ముతాం" అని చెప్పారు.

ఆంగ్‌కోర్

రెండో జయవర్మన్‌కు చేసిన అభిషేకంతో ఈ నీటికి, అంకోర్ సామ్రాజ్యానికి అవినాభావ సంబంధం ఏర్పడింది.

కానీ, అంకోర్‌లో ఇంజినీర్లు అభివృద్ధి చేసిన సమగ్రమైన నీటి పారుదల విధానాలు మాత్రం ఈ సామ్రాజ్య విస్తరణకు, అలాగే.. పతనానికీ దారితీశాయి.

"అంకోర్ భూభాగం ఒక సామ్రాజ్యంగా విలసిల్లేందుకు అనువుగా ఉంటుంది" అని సిడ్నీ యూనివర్సిటీలో జియో సైన్సెస్ విభాగంలో పరిశోధకులుగా పని చేస్తున్న డాన్ పెన్నీ వివరించారు.

"ఇక్కడ అపారమైన వనరులున్నాయి. వరి పండించేందుకు తగిన భూమి ఉంది. టోన్ లే శాప్ సరస్సు మత్స్య సంపద విరివిగా పెంచేందుకు అనువుగా ఉంటుంది. ఈ సరస్సుకు ఉత్తరదిశగా అంకోర్ ఉంది. ఈ వనరుల వల్లే అంకోర్ విజయవంతమైన సామ్రాజ్యంగా ఎదిగింది" అని చెప్పారు.

అంకోర్ ప్రాచీన నగరాల లేఅవుట్‌ను పునర్నించేందుకు ఫ్రెంచ్ పురావస్తు శాస్త్రవేత్త బెర్నార్డ్ ఫిలిప్ గ్రాస్‌లియర్ 1950, 60లలో ఏరియల్ టెక్నాలజీని ఉపయోగించారు.

అప్పుడే ఈ సామ్రాజ్య పరిధి, నీటి పారుదల నిర్వహణ తీరు వెలుగులోకి వచ్చాయి. దీంతో గ్రాస్ లియర్ అంకోర్‌ను "హైడ్రాలిక్ సిటీ" అని పిలవడం మొదలుపెట్టారు.

అప్పటి నుంచి అక్కడ నెలకొన్న నీటి పారుదల విధానాల గురించి పురావస్తు శాస్త్రవేత్తలు విస్తృతంగా అధ్యయనాలు చేపట్టారు.

2012లో ఇక్కడ 1,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నీటి పారుదల విధానం బయటపడింది. లేజర్ స్కానింగ్ టెక్నాలజీ ద్వారా ఈ విషయం తెలిసింది. ఈ పరిశోధనకు 'ఎకోల్ ఫ్రాన్‌సైస్ డి ఎక్స్ట్రీమ్ ఓరియంట్‌’లో రీసెర్చ్ ఫెలోగా ఉన్న పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ డామియన్ ఎవాన్స్ నేతృత్వం వహించారు.

"ఈ నిర్మాణంలో సంక్లిష్టంగా కనిపించిన వాటి విషయం తేటతెల్లమైంది" అని డాక్టర్ ఎవాన్స్ చెప్పారు.

"అంకోర్ సామ్రాజ్యపు ఫైనల్ మ్యాప్‌పై పని చేస్తున్నాం. ఈ సామ్రాజ్యం విజయానికి ఇక్కడున్న నీటి సంపద ముఖ్యమైన కారణం" అని అన్నారు.

ఆంగ్‌కోర్

అంకోర్ అంత విస్తీర్ణం ఉన్న నగరం నిర్మించేందుకు, నోమ్ కులేన్ నుంచి అంకోర్ భూభాగానికి నీటిని తీసుకుని వచ్చేందుకు నిర్మించిన కృత్రిమ సరస్సులు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సరస్సుల ద్వారా అంకోర్ నిర్మాణానికి అవసరమైన సుమారు కోటి భారీ రాతి ఇటుకలను రవాణా చేశారు. ఒక్కో ఇటుక బరువు 1500 కేజీలు ఉండవచ్చని అంచనా.

అంకోర్ జనాభాకు, వ్యవసాయానికి, పశువులకు ఏడాది పొడవునా సరిపోయేలా నీరు అందించడంతో పాటు ఇక్కడ ఆలయాలు కొన్ని శతాబ్దాల పాటు పటిష్టంగా నిలిచి ఉండటానికి కూడా ఇక్కడ నిర్మించిన నీటి పారుదల వ్యవస్థ ఉపయోగపడింది.

అయితే, ఈ రాళ్ల బరువును తట్టుకునేందుకు ఇక్కడున్న ఇసుక భూములు కొంత కారణం. ఇసుకను, నీటితో కలపడం వల్ల పునాదులు దృఢంగా ఉంటాయని ఇంజినీర్లు భావించారు.

దాంతో, ఆలయాల చుట్టూ భూగర్భ జలాలు నిరంతరం సరఫరా అయ్యేలా కందకాలు నిర్మించారు. ఇవి ఆలయాల పునాదులు దృఢంగా ఉండి కొన్ని శతాబ్ధాలు గడిచినా పగుళ్లు రాకుండా కాపాడాయి.

సామ్రాజ్య చరిత్రను మొత్తం పరిశీలిస్తే, ఇక్కడ పరిపాలించిన చక్రవర్తులు అందరూ సామ్రాజ్యంలో ఉన్న నీటి పారుదల వ్యవస్థను విస్తరించి, పునరుద్ధరించి మరింత అభివృద్ధి చేశారు. సరస్సులు, ఆనకట్టలు, కందకాలు, రిజర్వాయర్‌లను నిర్మించారు.

అంతరిక్షంలోంచి చూస్తే, పశ్చిమం వైపున మానవ నిర్మితమైన అత్యంత భారీ రిజర్వాయిర్ కనిపించింది. ఇది 7.8 కిలోమీటర్ల పొడవు, 2.1 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి కూడా అద్భుతమైన నిర్మాణాలు చేపట్టారు.

విస్తృతమైన నీటి పారుదల వ్యవస్థలున్న చాలా చారిత్రక నగరాలున్నాయి. కానీ, అంకోర్ నీటి పారుదల వ్యవస్థ, పరిథి, విస్తీర్ణం మాత్రం చాలా విభిన్నమైనది. అందుకు ఉదాహరణ ఇక్కడున్న రిజర్వాయిర్‌లు.

అంకోర్ సామ్రాజ్యం విస్తీర్ణానికి నీరు ఎలా సహాయపడిందో, దాని పతనానికీ అదే కారణమైంది. ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది.

"ఇక్కడున్న నీటి పారుదల వ్యవస్థ సామ్రాజ్య సంపద, శక్తి పెరిగేందుకు దోహదం చేశాయి" అని పెన్నీ చెప్పారు.

కానీ, ఇది పెరుగుతున్న కొలదీ, అది నగరానికి కాలిలో ముల్లులా మారింది.

14వ శతాబ్దం చివర్లో, 15వ శతాబ్దం మొదట్లో, వాతావరణంలో ఏర్పడిన మార్పులతో వర్షాలు కురవడం ఎక్కువైంది. విపరీతమైన కరవు కూడా సంభవించింది. ఈ వాతావరణ మార్పులు నీటి పారుదల వ్యవస్థ పని తీరుపై ప్రభావం చూపించాయి. ఇదే ఈ సామ్రాజ్య పతనానికి కూడా దారి తీసింది.

"అనూహ్యంగా ఏర్పడిన వాతావరణ మార్పులతో నగరం అంతా దెబ్బ తినడం మొదలైంది" అని పెన్నీ చెప్పారు. ఈ నీటి పారుదల విధానం విస్తీర్ణం, కరవులు కారణంగా మొత్తం వ్యవస్థ దెబ్బతింది. దీంతో, మొత్తం వ్యవస్థ పనికిరాకుండా పోయింది.

వాతావరణ మార్పులు, నీటి పారుదల వ్యవస్థ వైఫల్యం, పొరుగు దేశాల నుంచి దాడులతో రాజధానిని ఔడోంగ్‌కు మార్చాల్సి వచ్చింది.

"సియా‌మీస్ 1431లో ఆక్రమించడం వల్ల అంకోర్ సామ్రాజ్య పాలన ముగిసినట్లు చరిత్ర పుస్తకాలు చెబుతాయి" అని డాక్టర్ డామియన్ అన్నారు.

"కానీ, అలా జరిగి ఉంటుందని అనుకోను. దీర్ఘకాలం పాటు కొనసాగిన కరవులు, నీటి పారుదల విధానం, అది విచ్ఛిన్నమవడం, సియామీస్ నుంచి నిరంతర దాడులు, సముద్ర మార్గాల విస్తరణ కూడా ఈ రాజ్యం పతనానికి దారి తీసి ఉండవచ్చు" అని అన్నారు.

అంకోర్ పట్టణాన్ని వదిలిపెట్టిన తర్వాత దానిని ప్రకృతి పునరుద్ధరించింది.

ఇక్కడ ప్రాచీన కట్టడాల గురించి స్థానికులకు తెలిసినప్పటికీ, 1860వరకు వాటి చుట్టూ ఉన్న అడవులు మిగిలిన ప్రపంచానికి వాటిని కనిపించనివ్వకుండా చేశాయి.

ఫ్రెంచ్ పరిశోధకుడు హెన్రీ మౌ‌హోట్ వాటిని కనిపెట్టారు. దాంతో, ఈ రోజుకీ ఈ ప్రాంతంలో అనేక పునరుద్ధరణ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి.

అంకోర్ వాట్‌లో ఉన్న ఆర్కియలాజికల్ పార్క్‌కు వెళ్లి ఆంగ్‌కోర్‌వాట్, టా‌ప్రోహ్మ్ , బేయాన్ మందిరాల నీడలో నిలబడేందుకు కంబోడియాకు వెళ్లే సందర్శకుల సంఖ్య గత రెండు దశాబ్దాల నుంచి పెరుగుతోంది.

2019లో 22లక్షల మంది ఈ ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ పెరిగిన హోటళ్లు, రెస్టారెంట్లు, నీటి డిమాండ్‌ను పెంచాయి. దాంతో, ఇక్కడ తిరిగి నీటి ఎద్దడి ఏర్పడింది. ఇక్కడి దేవాలయాలు భూగర్భ జలాలపైనే ఆధారపడటంతో యునెస్కో పరిరక్షక ప్రాంతంగా గుర్తించిన ఈ ప్రాంతం గురించి ఆందోళన మొదలైంది.

2019లో 22లక్షల మంది ఆంగ్‌కోర్‌కి విచ్చేసారు

అయితే, 2019-2011 వరకు కురిసిన వర్షాలు, వరదలతో ఇక్కడ నీటి కొరత కొంతవరకు తీరి ప్రాచీన నీటి పారుదల విధానాన్ని కొంత వరకు పునరుద్ధరించింది.

సీమ్ రీప్‌కు దగ్గరగా ఉన్న ఒక గెస్ట్ హౌస్ యజమాని సోచీటా హెంగ్ 2011లో వచ్చిన వరదలను గుర్తు చేసుకున్నారు.

"అవి ఆ ప్రాంతంలో గత 50 ఏళ్లలో ఎన్నడూ రాలేనంత దారుణంగా ఉన్నాయని చెప్పారు.

ఇది ఈ ప్రాంతానికి చాలా నష్టం కలిగించింది" అని ఆమె చెప్పారు.

"పంటలు నాశనమయ్యాయి. ప్రజలను ఇక్కడ నుంచి తరలించాల్సి వచ్చింది. నా ఇంట్లోకి కూడా నీరు వచ్చింది. అది చాలా వినాశనకరంగా అనిపించింది" అని చెప్పారు.

ఆంగ్‌కోర్ ఆర్కియలాజికల్ పార్క్‌ను సంరక్షించే బాధ్యతలను చేపట్టిన అప్సర నేషనల్ అథారిటీ ఇక్కడ నీటి పారుదల విధానంలో ఉన్న చాలా రిజర్వాయిర్‌లు, నీటి మార్గాలను పునరుద్ధరించింది.

దీంతో పాటు, 12 కిలోమీటర్ల పొడవున్న ఆంగ్‌కోర్ థోమ్ కందకాన్ని కూడా పునరుద్ధరించారు. దీంతో, ఇక్కడ నెలకొన్న నీటి కొరత తీరింది. దీంతో పాటు 2009-2011 మధ్యలో వచ్చిన లాంటి వరదలు రాకుండా ఆపగలిగింది.

కొన్ని శతాబ్దాల పురాతనమైన నీటి పారుదల విధానం సీమ్ రీప్‌కు నిరంతరం నీటిని సరఫరా చేస్తూ దాహార్తిని తీరుస్తోంది. వరదలు రాకుండా కాపాడుతోంది. ఆంగ్‌కోర్ దేవాలయాల గోడలు భవిష్యత్తులో కూడా పటిష్టంగా ఉండేందుకు సహాయపడుతుంది.

"ఇక్కడ రిజర్వాయర్లు, నీటి పారుదల విధానాలను పునరుద్ధరించడం ద్వారా, అవి నేటి వ్యవసాయ భూభాగంలో భాగం కావడం మాత్రమే కాకుండా, దేవాలయాలు దృఢంగా నిలబడేందుకు కూడా సహాయపడుతున్నాయి" అని డాక్టర్ ఎవాన్స్ అన్నారు.

"కొన్ని శతాబ్ధాల పురాతనమైన నీటి పారుదల విధానం నేటికీ సీమ్ రీప్‌కు సేవలందించడం నిజంగా గొప్ప విషయం" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Angkor Wat: Is water the cause of both the development and the end of the Angkor Empire? What was the oldest irrigation system in Asia?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X