మరో 800 మందికి ఫ్లైట్ రెడీ చేస్తున్న ట్రంప్-మోడీ డిమాండ్ ఒక్కటే.!
అమెరికాలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వలసలపై ఉరుముతున్న డొనాల్డ్ ట్రంప్ ఇదే క్రమంలో భారతీయులకూ చుక్కలు చూపిస్తున్నాడు. అమెరికాలో ఉన్న లక్షలాది మంది భారతీయులపై ఇప్పుడు ఏదో ఒక రూపంలో తనిఖీలు జరుగుతున్నాయి. వీటిలో దొరికిన అక్రమ వలసదారుల్ని వెంటనే మిలిటరీ విమానాలు ఎక్కించి మరీ స్వదేశానికి పంపేస్తున్నారు. ఇదే క్రమంలో 104 మంది భారతీయుల్ని స్వదేశానికి పంపిన ట్రంప్.. ఇప్పుడు మరో 800 మందిని పంపేందుకు సిద్దమవుతున్నారు.
భారత విదేశాంగ శాఖకు అందిన సమాచారం మేరకు మరో 487 మంది అక్రమ వలసదారుల్ని పంపుతున్నట్లు వెల్లడించారు. అయితే ఈ సంఖ్య 800 వరకూ ఉందని స్థానిక అధికారులు అందిస్తున్న వివరాలను బట్టి తెలుస్తోంది.అయితే వీరిని రేపు జరిగే ప్రధాని మోడీ-ట్రంప్ భేటీ తర్వాత భారత్ కు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే భారత ప్రధాని అమెరికాలో పర్యటిస్తున్న సమయంలోనే ఇలా వలసల్ని స్వదేశానికి పంపేస్తే ఇరు దేశాల్లోనూ విమర్శలు రావడం ఖాయం. అందుకే ట్రంప్ కాస్త శాంతించినట్లు పైకి కనిపిస్తున్నారు.

అయితే ఇలా అమెరికా నుంచి వలసల్ని స్వదేశానికి పంపడం కంటే కూడా వారిని పంపుతున్న తీరుపైనే స్వదేశంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వారిని అరెస్టు చేశాక వేసిన బేడీలతోనే విమానాలు ఎక్కించేసి పంపడంపై భారత్ లో విమర్శలు వస్తున్నాయి. ఇంత జరుగుతుంటే మోడీ సర్కార్ అడ్డుకోలేకపోతోందంటూ విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై పంపే వలసలను కాస్త గౌరవంగా, మానవతా దృక్పథంతో పంపాలనే డిమాండ్ ను మోడీ రేపు ట్రంప్ తో జరిగే భేటీలో ప్రస్తావించబోతున్నారు. దీనికి ట్రంప్ అంగీకరిస్తే త్వరలో స్వదేశానికి వచ్చే వారికి ఊరటగా మారనుంది.












Click it and Unblock the Notifications