అర్ధరాత్రి కశ్మీరులో పాక్ నరమేధ వ్యూహం! RDX బాంబులతో అసిమ్ మునీర్ క్రూరత్వం
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) రక్తాశ్రువుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న సామాన్య ప్రజలపై పాకిస్తాన్ సైన్యాధినేత అసిమ్ మునీర్ సైన్యం అత్యంత క్రూరమైన నరమేధానికి తెరలేపింది. శత్రు దేశాలపై ప్రయోగించే అత్యాధునిక డ్రోన్లను.. సొంత పౌరులపైకి పంపి, బాంబుల వర్షం కురిపించడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. జూన్ 28 అర్ధరాత్రి దాటిన తర్వాత 12 నుంచి 1 గంటల మధ్య.. రావలకోట్ (Rawalakot) నగరంలో ఊహించని ఒక భయంకరమైన డ్రామా స్క్రీన్ ప్లేలా ఆవిష్కృతమైంది.
అర్ధరాత్రి ఆకాశం నుంచి ఊడిపడ్డ మృత్యువు!
ఆ సమయంలో వేలాది మంది నిరసనకారులు ఒకచోట చేరి టెంట్లు వేసుకుని శాంతియుతంగా కూర్చున్నారు. గాఢాంధకారంలో అకస్మాత్తుగా ఆకాశం నుంచి కొన్ని డ్రోన్లు దూసుకొచ్చాయి. నిరసన స్థలమే లక్ష్యంగా ఆ డ్రోన్ల నుంచి భారీ పేలుడు పదార్థాలను కిందకు జారవిడిచారు.

అవామీ యాక్షన్ కమిటీ (Awami Action Committee) వెల్లడించిన వివరాల ప్రకారం.. కిందపడిన ఆ వస్తువులు సాధారణమైనవి కావు.. నిమిషాల వ్యవధిలో వేలాది మందిని బూడిద చేయగల భయంకరమైన 'RDX' టైమర్ బాంబులు! టైమర్లు టిక్ టిక్ మంటూ ప్రాణాలు తీసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, స్థానిక నిర్వాహకులు ప్రాణాలకు తెగించి ఆ బాంబులను గుర్తించారు. క్షణాల వ్యవధిలో వాటిని అక్కడి నుంచి తొలగించి, నిర్వీర్యం చేయడంతో ఊహించని ఒక మహా నరమేధం తృటిలో తప్పింది. దీనికి సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఫుటేజ్‌ను కమిటీ విడుదల చేయడంతో పాక్ ఆర్మీ బండారం ప్రపంచం ముందు బట్టబయలైంది.
కశ్మీరీల గొంతు నొక్కేందుకు ఇంటర్నెట్ బంద్.. ఆహార సరఫరా కట్!
PoK లో గత కొన్ని వారాలుగా నిప్పు కణికలాంటి నిరసనలు ఎగసిపడుతున్నాయి. ద్రవ్యోల్బణం, కరెంట్ బిల్లుల బాదుడు, హక్కుల కాలరాశే ధ్యేయంగా ఇస్లామాబాద్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై ప్రజలు తిరగబడ్డారు. ఈ తిరుగుబాటు ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు జూన్ 5 నుంచి అక్కడ ఇంటర్నెట్ సేవలను పూర్తిగా బంద్ చేశారు.
ఇంతటితో ఆగని పాక్ సైన్యం.. నిరసనకారులను లొంగదీసుకోవడానికి క్రూరమైన వ్యూహాన్ని అమలు చేసింది. పలు ప్రాంతాలకు వెళ్లే ఆహార సరఫరాను, నిత్యావసరాలను నిలిపివేసింది. ఆకలితోనైనా అలమటించి పోరాటాన్ని ఆపేస్తారన్నది పాక్ ఆర్మీ క్రూర ఆలోచన. గతంలో జరిగిన ఘర్షణల్లో ఇప్పటికే డజన్ల కొద్దీ అమాయక పౌరులను సైన్యం కాల్చి చంపిందని స్థానిక గ్రూపులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
లొంగేదే లే.. ఇస్లామాబాద్ సరిహద్దుల్లో హై టెన్షన్!
పాక్ ఆర్మీ ఎన్ని తుపాకులు గురిపెట్టినా, డ్రోన్లతో బాంబులు వేసినా కాశ్మీరీల పోరాట పటిమ తగ్గలేదు. ఆంక్షలను బద్దలు కొడుతూ రావలకోట్ లోని ఈద్గా మైదానంలో ఏకంగా 60,000 మందికి పైగా జనం రోడ్లపైకి వచ్చారు. "మా చావులైనా చూస్తాం కానీ.. ఇస్లామాబాద్ పాలకుల అరాచకాలకు లొంగేదే లేదు" అంటూ ఆకాశం బద్దలయ్యేలా నినాదాలు చేశారు. "మా సందేశం ఇస్లామాబాద్‌కు గట్టిగానే చేరింది.. ఈ యుద్ధంలో గెలిచేది ప్రజలే" అంటూ అవామీ యాక్షన్ కమిటీ నేత సర్దార్ లియాఖత్ హయత్ సింహనాదం చేశారు.
మరోవైపు, నిరసనకారులను కలిసి మద్దతు ఇచ్చేందుకు వెళ్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని షాహిద్ ఖాకాన్ అబ్బాసీ, సెనేట్ ప్రతిపక్ష నాయకుడు మహమూద్ అచక్జాయ్ ల ప్రతినిధి బృందాన్ని కహూటా వద్దే సైన్యం బలవంతంగా అడ్డుకోవడంతో రాజకీయం మరింత వేడెక్కింది.
లండన్ పార్లమెంట్ ముందు మార్చ్.. అంతర్జాతీయ స్థాయిలో దుమారం!
పాక్ సైన్యానికి వ్యతిరేకంగా PoK లో జరుగుతున్న ఈ పోరాటం ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపైకి చేరింది. పాక్ ఆర్మీ చేస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై గత వారం బ్రిటన్ పార్లమెంట్ వెలుపల భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి. అక్కడి నుంచి '10 డౌనింగ్ స్ట్రీట్' (బ్రిటన్ ప్రధాని నివాసం) వరకు బాధితులు భారీ మార్చ్ నిర్వహించారు. PoK లో పాక్ ఆర్మీ సాగిస్తున్న అరాచకాలపై అంతర్జాతీయ సమాజం తక్షణమే జోక్యం చేసుకోవాలని, మానవతా దృక్పథంతో సహాయం అందించాలని ప్రవాస కాశ్మీరీలు ప్రపంచ దేశాలను అర్థిస్తున్నారు.














Click it and Unblock the Notifications