పాకిస్తాన్ నియంతగా ఆసిమ్ మునీర్..! ముషారఫ్ స్ధాయికి ప్రమోషన్..!
ఈ ఏడాది వేసవిలో కశ్మీర్లోని పహల్గాంలో 26 మంది పర్యాటకుల్ని పాకిస్తాన్ ముష్కరులు కాల్చిచంపిన తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. దీంతో పాకిస్తాన్ పూర్తిగా లొంగిపోవడం ఖాయమని అంతా భావించారు. కానీ నాలుగు రోజుల పోరాటం తర్వాత అమెరికా మాట విని భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణ ప్రకటించడంతో పొరుగుదేశం బతికిపోయింది. ఆ తర్వాతే అసలు సినిమా మొదలైంది. భారత్ పై యుద్దం గెలిచినట్లు ప్రకటించుకున్న పాకిస్తాన్.. ఇందుకు కారకుడిగా ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ ను గుర్తించి ఫీల్డ్ మార్షల్ గా ప్రమోషన్ ఇచ్చింది.
పాకిస్తాన్ లో షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని బలహీన ప్రభుత్వం ఆసిమ్ మునీర్ కు ఆ తర్వాత కూడా ప్రమోషన్లు ఇస్తూ వచ్చింది. అంతే కాదు ఇందుకోసం రాజ్యాంగ సవరణలు కూడా చేస్తోంది. తాజాగా చేసిన పాకిస్తాన్ రాజ్యాంగ సవరణ ద్వారా ఆసిమ్ మునీర్ ను ఏకంగా త్రివిధ దళాలకూ అధిపతిని చేసేసింది. ఇప్పుడు మునీర్ పాకిస్తాన్ కు సీడీఎఫ్ (ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ )గా మారిపోయారు. తద్వారా పాకిస్తాన్ తో ప్రభుత్వాన్ని మించిన అధికారాన్ని పొందినట్లయింది.

తాజాగా పాకిస్తాన్ లో ఆర్మీ చీఫ్‌ను ఇతర రెండు దళాల అధినేతల కంటే పైకి లేపి, దేశ అణ్వాయుధ వ్యవస్థల ఏకైక బాధ్యుడిగా ఉంచడంతో పాటు త్రివిధ దళాల మొత్తం నియంత్రణను కూడా అధ్యక్షుడు, కేబినెట్ నుండి అతనికే మార్చారు. తాజా సవరణలు మునీర్ పదవీకాలాన్ని కనీసం 2030 వరకు పొడిగించాయి. అలాగే ఈ మార్పులు మునీర్‌కు దేశ అధ్యక్షుడితో సమానమైన చట్టపరమైన రక్షణను కూడా ఇచ్చాయి. అధ్యక్షుడిలాగే ఫీల్డ్ మార్షల్‌కు కూడా ఏదైనా చట్టపరమైన విచారణ నుండి జీవితాంతం నిరోధక శక్తి ఇస్తుంది. మునీర్ పదవీకాలం ముగిసినా తిరిగి పొడిగింపు తీసుకోవచ్చు.

1999లో అధికారాన్ని చేజిక్కించుకున్న దివంగత సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ కు ఉన్నంత అధికారం మునీర్ కు ఇప్పుడు ఉంది. ముషారఫ్ లాగే ఆయనకు కూడా విధేయుడైన ప్రధాన మంత్రి, సైన్యం నిర్మాణాన్ని పునర్నిర్మించే అధికారం ఉంది.
అలాగే ఫీల్డ్ మార్షల్స్ పదవీ విరమణ చేయరు. వారు ఒక పదవిని వదిలివేయవచ్చు, కానీ వారు జీవితాంతం ఫీల్డ్ మార్షల్‌గా ఉంటారు. మునీర్ ఎదుగుదల ఇప్పుడు స్వదేశంలో చాలా మందికి గిట్టకపోయినా దౌత్యపరంగా ట్రంప్ వంటి వారితో ప్రైవేటు భోజనాలు చేసే స్దాయిలో సాధించిన విజయం అసాధారణమైనదిగానే భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications