నైజీరియాలో ఆత్మాహుతి దాడి: 48 మంది విద్యార్థుల బలి
డమాటురు: నైజీరియాలోని ఒక పాఠశాలపై ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు చేసిన దాడిలో 48 మంది విద్యార్థులు చనిపోయారు. దాదాపు 80 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో అనేక మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.
యోబ్ రాష్ట్రంలోని పొటిస్కిం పట్టణంలోని ఒక ప్రభుత్వ పాఠశాలపై విద్యార్థిలా వచ్చిన ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు ఈ దురాగతానికి పాల్పడ్డాడు. దాడి జరిగినపుడు పాఠశాలలో దాదాపు 2,000 మంది విద్యార్థులు ఉన్నారు. దేశంలో ఇస్లామిక్ పాలన కోసం పోరాడుతున్న బొకో హరాం ఉగ్రవాదులే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.

అయితే ఆ ఉగ్రవాద సంస్థ ఇంత వరకు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మానవ బాంబు దాడితో ఆ ప్రాంతమంతా హహాకారాలతో నిండి పోయింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. పేలుడు జరిగిన వెంటనే సైనికులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టేందుకు వచ్చారు. అయితే స్థానికులు ఆగ్రహంతో దాడి చేయడంతో వారు వెనుదిరిగారు.
వారం రోజుల క్రితం కూడా ఇదే పట్టణంలోని ఒక స్కూల్‌పై జరిగిన దాడిలో 30 మంది చనిపోయారు. బాలికల విద్యను వ్యతిరేకిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ బొకో హరాం సంస్థే ఈ దాడుల చేస్తోందని అనుమానిస్తున్నారు. బొకో హరాం గతంలో కూడా పాఠశాలలపై దాడి చేసి వందల సంఖ్యలో బాలికల్ని ఆపహరించుకు పోయింది.












Click it and Unblock the Notifications