వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Ayahs' Home: బ్రిటిషర్ల ఇంటి నుంచి గెంటేసిన భారత ఆయాల కథ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
భారత ఆయాలు

బ్రిటిష్ వలస పాలన పతాక స్థాయిలో ఉండేటప్పుడు భారత్‌తోపాటు ఆసియాలోని చాలా ప్రాంతాల నుంచి మహిళలను లండన్‌కు తీసుకొచ్చేవారు. బ్రిటిషర్ల పిల్లలను చూసుకోవడమే ఈ మహిళల పని. అయితే, తర్వాత కాలంలో ఈ ఆయాలను బయటకు పంపించేసేవారు. అలా వెళ్లగొట్టిన ఆయాలకు ఒక భవనం ఆశ్రయమిచ్చింది.

ప్రముఖులతోపాటు చారిత్రక కట్టడాలకు గుర్తింపు ఇచ్చేందుకు యూకే చారిటీ ఇంగ్లిష్ హెరిటేజ్ సంస్థ ''బ్లూ ప్లాక్’’ స్కీమ్ నడిపిస్తోంది.

భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన మహాత్మా గాంధీ, భారత్ తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌లను బ్లూ ప్లాక్‌లతో సత్కరించారు.

2020లో రెండో ప్రపంచ యుద్ధంనాటి గూఢచారి నూర్ ఇనాయత్ ఖాన్‌కు కూడా బ్లూ ప్లాక్‌ అందించారు. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి భారత సంతతి మహిళ ఆమె కావడం విశేషం.

భారత ఆయాలు

తాజాగా తూర్పు లండన్ హెక్నీలోని కింగ్ ఎడ్వర్డ్ రోడ్‌లోని ఆయా’స్ హోమ్‌కు ఈ సత్కారం దక్కింది. దీని కోసం 30ఏళ్ల భారత సంతతి మహిళ ఫరానా మమూజీ చాలా కృషి చేశారు. బీబీసీ డాక్యుమెంటరీలో ఈ హోమ్ గురించి తొలిసారి ఆమె విన్నారు.

ఎలాంటి దిక్కూలేని వందల మంది ఆయా, ఆమా (చైనాలో ఆయాలను ఇలా పిలుస్తారు)లకు ఈ హోమ్ ఆశ్రయమిచ్చింది.

ఈ హోమ్‌తోపాటు ఇక్కడ గడిపిన ఆయాలు అందించే సేవలపై మమూజీ, మరికొంత మంది చరిత్రకారులు చాలా పరిశోధన చేపట్టారు. ఎవరికీ తెలియకుండా మరుగున పడిపోయిన ఈ ఆయాల కథలు తాజా గుర్తింపుతో ప్రపంచానికి పరిచయం అవుతాయని వారు ఆశిస్తున్నారు.

భారత ఆయాలు

ఎవరీ ఆయాలు?

ఇక్కడ ఆయాలుగా పనిచేసిన వారిలో చాలా మంది భారత్, చైనా, హాంకాంగ్, బ్రిటిష్ సిలోన్ (శ్రీలంక), బర్మా (మయన్మార్), మలేసియా, జావా (ఇండోనేసియా)ల నుంచి వచ్చారు.

''వీరంతా ఇళ్లలో పనిచేసే మహిళలు. భారత్‌లోని బ్రిటిష్ కుటుంబాలకు వీరు చాలా సాయం చేసేవారు. బ్రిటిషర్ల పిల్లలను వీరు చూసుకునేవారు. మంచి మంచి కథలు చెప్పేవారు’’అని ఆసియన్స్ ఇన్ బ్రిటన్: 400 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ పుస్తకాన్ని రాసిన రోజీనా విస్రమ్ చెప్పారు.

ఆ బ్రిటిషర్ల కుటుంబాలు తమ స్వస్థలాలకు వచ్చినప్పుడు కొంతమంది ఆయాలను కూడా తమ వెంట తీసుకొచ్చేవారు. ''సుదీర్ఘమైన ప్రయాణంలో వారిని వెంట పెట్టుకుని వచ్చేవారు. అయితే, కొంతమందిని కొన్ని రోజులకే పనిలో నుంచి తీసేసేవారు’’అని రోజీనా చెప్పారు.

''సాధారణంగా ఈ ఆయాలకు తిరిగి ఇంటికి వెళ్లేందుకు టికెట్లు ఇచ్చేవారు. ఆ ఖర్చును బ్రిటిషర్లే పెట్టుకునేవారు’’అని ఆమె వివరించారు.

కానీ, అందరూ అదృష్టవంతులు కాదు. కొంతమందికి ఎలాంటి టికెట్లు ఇవ్వకుండానే పని లోనుంచి తొలగించేవారు. కొంతమందికి ఇంటికి ఎలా వెళ్లాలో తెలియక ఇక్కడ ఉండిపోవాల్సిన పరిస్థితి.

''ఇలాంటి పరిస్థితుల్లో ఆయాలు ఆ హోమ్‌కు వచ్చేవారు’’అని బ్రిస్టల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫ్లోరియన్ స్టాట్లర్ చెప్పారు.

''కొంతమంది ఇంటికి వెళ్లేందుకు సాయం చేయాలంటూ స్థానిక పత్రికల్లో చిన్నచిన్న ప్రకటనలు కూడా ఇచ్చేవారు. మరికొంత మంది అద్దె చెల్లించి లాడ్జింగ్ హౌస్‌లలో ఉండేవారు. డబ్బులు అయిపోతే, ఆ లాడ్జింగ్ హౌస్‌లు కూడా వీరిని వెళ్లగొట్టేసేవి. దీంతో కొంతమంది వీధుల్లో అడుక్కునేవారు’’అని ఆయన వివరించారు.

భారత ఆయాలు

ద ఆయాస్ హోమ్

బ్రిస్టల్ యూనివర్సిటీ సమాచారం ప్రకారం.. ఎలిజబెత్ రోజర్స్‌గా పిలిచే ఓ మహిళ 1825లో ఈ ఆయాస్ హోమ్‌ను మొదలుపెట్టారు. ఆమె మరణం తర్వాత ఒక జంట దీన్ని నడిపించేది. ఆయాలకు లాడ్జింగ్ హౌస్‌గా ఇది ఉండేది.

దీన్ని ఒక ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్‌లా నడిపించేవారు. ఆయాల కోసం చాలా కుటుంబాలు ఇక్కడకు వచ్చేవి.

భారత ఆయాలు

19వ శతాబ్దం ద్వితీయార్ధంలో బ్రిటిష్ పాలన మరింత పటిష్టమైంది. దీంతో ఇంగ్లండ్, భారత్‌ మధ్య ప్రయాణాలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో బ్రిటన్‌కు వచ్చే ఆయాల సంఖ్య కూడా పెరిగింది.

''ఈ హోమ్‌లో 200 మంది వరకు ఆయాలు ఉండేవారు. కొంతమంది కొన్ని రోజులు ఉండి వెళ్లిపోతే. మరికొంతమంది నెలల తరబడి ఇక్కడే ఉండేవారు’’అని రోజీనా చెప్పారు.

''అయితే, ఆయాల దగ్గర నుంచి ఈ హోమ్ ఎలాంటి డబ్బులూ తీసుకునేది కాదు. స్థానిక చర్చల నుంచి విరాళాలను మాత్రం సేకరించేది’’అని ఆమె వివరించారు.

భారత ఆయాలు

కొంతమంది ఆయాల దగ్గర ఇంటికి వెళ్లడానికి డబ్బులు ఉండేవి కాదు. మరికొంతమందిని ఇంటికి తీసుకెళ్లడానికి తోడు దొరికేది కాదు. అలాంటప్పుడు ఆ టికెట్లను వేరేవారికి అమ్మేసేవారు. ఆ డబ్బులను కూడా హోమ్ నడపడానికి ఉపయోగించేవారు.

అయితే, ఈ ఆయా హోమ్ కేవలం హోస్టల్ లేదా శిబిరంలా చూడటానికి వీల్లేదు.

ఆయాలను క్రైస్తవంలోకి మత మార్పిడి చేయడంలో ఈ హోమ్ కూడా ప్రధాన పాత్ర పోషించిందని డాక్టర్ స్టాట్లర్ చెప్పారు.

భారత ఆయాలు

''ఎంత మంది ఆయాలు క్రైస్తవంలోకి మారారో స్పష్టంగా తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి రికార్డులూ ఉండేవి కాదు. అదే సమయంలో ఆయాలపై ఒత్తిడి చేసినట్లు కూడా ఆధారాలు లేవు’’అని ఆయన అన్నారు.

1900లో లండన్ సిటీ మిషన్ గ్రూప్ ఈ హోమ్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంది. అప్పుడే దీన్ని హెక్నీలోని 26 కింగ్ ఎడ్వర్డ్ రోడ్‌లోకి మార్చారు. ఆ తర్వాత 4 కింగ్ ఎడ్వర్డ్ రోడ్‌కు తరలించారు.

సత్కారం వరకూ..

20వ శతాబ్దంలో బ్రిటిష్ సామ్రాజ్యం కుప్పకూలిన తర్వాత, ఈ ఆయాల అవసరం తగ్గిపోయింది. దీంతో 4 కింగ్ ఎడ్వర్డ్ రోడ్‌లోని ప్రధాన భవనాన్ని ఒక ప్రైవేటు నివాసంగా మార్చేశారు.

2018లో ఈ ఆయా హోమ్ గురించి మమూజీ తొలిసారిగా విన్నారు. బీబీసీ డాక్యుమెంటరీ ''ఎ పాసేజ్ టు బ్రిటన్’’లో దీన్ని ఆమె చూశారు.

''తూర్పు లండన్‌లోనే నేనూ ఉంటాను. ఆయాలు వారి, కథల గురించి తెలుసుకోవాలని అనుకున్నాను. అందుకే అక్కడికి వెళ్లాను’’అని ఆమె చెప్పారు.

''చాలా మంది ఆసియా ఆయాలకు ఆశ్రయం ఇచ్చిన అంత గొప్ప భవనం వెలవెలబోతూ కనిపించింది. నాకు చాలా బాధనిపించింది’’అని ఆమె అన్నారు.

అప్పుడే ఆయాస్ హోమ్ ప్రాజెక్టును ఆమె మొదలుపెట్టారు. ఆయాల కథలను వెలుగులోకి తీసుకురావడమే దీని లక్ష్యం. ఆ తర్వాత బ్లూ ప్లాక్‌కు దరఖాస్తు చేశారు.

మార్చి 2020లో ఇంగ్లిష్ హెరిటేజ్ నుంచి ప్రత్యుత్తరం కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే ఆమె హెక్నే మ్యూజియం దగ్గర ఒక కార్యక్రమం ఏర్పాటుచేశారు. బ్రిటిష్ పాలనా కాలంలో ఆయాలు అందించిన సేవలను ఆమె దీని ద్వారా వెలుగులోకి తెచ్చారు.

ఈ ఆశ్రమంలో గడిపిన ఆయాలను రికార్డుల సాయంతో వెతికిపట్టుకునేందుకు ప్రయత్నించామని మ్యూజియం మేనేజర్ నీతి ఆచార్య చెప్పారు.

''చాలా రికార్డులను పరిశీలించి మొత్తానికి ఒక రిజిస్టర్ లాంటిది తయారుచేశాం. అయితే, ఈ పనిలో చాలా సవాళ్లు ఎదురయ్యాయి. ఎందుకంటే ఆ ఆయాల గురించి అందుబాటులోనున్న సమాచారం చాలా తక్కువ’’అని ఆమె అన్నారు.

''సాధారణంగా ఆయాలను పనిలోకి తీసుకున్న కుటుంబం వివరాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. మరోవైపు ఆ మహిళలను మతం మార్చడంతో వారి అసలు పేర్లు తెలిసేవి కాదు’’అని ఆమె వివరించారు.

తాజా సత్కారంతో ఆనాడు సేవలందించిన ఆయాల కథలు వెలుగులోకి వస్తాయని మమూజీ అన్నారు.

''ఆనాటి ఆయాలకు మనం సముచిత గౌరవం ఇవ్వాలి’’అని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Ayahs' Home: The story of the Indian ayas who were gentrified from the home of the British
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X