ఆ భారత్ వ్యతిరేక కూటమిలో చేరాల్సిందే..! బంగ్లాదేశ్ లో తీవ్ర ఒత్తిడి..!
భారత్ పై పహల్గాం దాడులు, పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్, ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ వార్, ప్రతిగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు .. ఇలా వరుస పరిణామాలు అంతర్జాతీయంగా సమీకరణాలను మార్చేశాయి. దీంతో ఇక ఎంతో కాలం అమెరికాపై ఆధారపడలేమనే నిర్ణయానికి వచ్చేసిన గల్ఫ్ దేశాలు, పాకిస్తాన్, నాటో సభ్యదేశమైన టర్కీ కలిసి కొత్త ఇస్లామిక్ నాటో కూటమిని ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ కలిసి మక్కా రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. ఈ మూడు దేశాలూ తమలో ఎవరిపై ప్రత్యర్థి దాడి చేసినా ముగ్గురిపై జరిగిన దాడిగా భావించి ప్రతిదాడులు చేయాలనేది ఈ ఒప్పందం సారాంశం.
ఇప్పుడు ఈ కూటమిని మరింత విస్తరించి ముస్లిం దేశాలను ఒక్కొక్కటిగా ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ దేశాల్లో అత్యధికులు ముప్పుగా భావిస్తున్న ఇజ్రాయెల్ తో భారత్ స్నేహం చేస్తుండటం ఇప్పుడు మనకు ముప్పుగా మారబోతోంది. ఇప్పటికే భారత్ పొరుగున ఉన్న పాకిస్తాన్ ఈ కూటమిలో చేరగా.. ఇప్పుడు మరో దేశం బంగ్లాదేశ్ (Bangladesh) కూడా ఇందులో చేరేందుకు సిద్దమవుతోంది. అదే సమయంలో తక్షణం నిర్ణయం తీసుకుని ఈ కూటమిలో చేరిపోవాలంటూ అంతర్గతంగా బంగ్లాదేశ్ సర్కార్ పై ఒత్తిడి పెరుగుతోంది.

ఇదే క్రమంలో బంగ్లాదేశ్ ప్రతిపక్ష నేత, జమాతే ఇస్లామీ పార్టీ ఛీఫ్ షఫీకుర్ రెహ్మాన్ భారత్ ను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. మక్కా ఒప్పందంలో చేరడం అనేది బంగ్లాదేశ్‌కు సంబంధించిన పూర్తిగా సార్వభౌమ, అంతర్గత విషయమని ఆయన తెలిపారు. దేశం, ప్రజల అవసరాలు, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బంగ్లాదేశ్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే, దానివల్ల ఇతరులు ఎవరూ ఆందోళన చెందాల్సిన లేదా అసహనానికి గురవ్వాల్సిన అవసరం లేదని భారత్ ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. బంగ్లా ఈ కూటమిలో చేరితే భారత్ కు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్న ఆందోళనల నేపథ్యంలో జమాతే ఛీఫ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.














Click it and Unblock the Notifications