ఖాఠ్మండులో తెరుచుకున్న బ్యాంకులు: ఏటీఎంల వద్ద బారులు తీరిన ప్రజలు
న్యూఢిల్లీ: భూకంపానికి అతలాకుతలమైన నేపాల్ రాజధాని ఖాఠ్మండులో బుధవారం మధ్యాహ్నాం కొంత సేపు బ్యాంకులు, ఏటీఎంలను తెరిచి ఉంచారు. భూకంపంలో నేలమట్టంకాని బ్యాంకులు, ఏటీఎంలలో నగదుని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఖాఠ్మండులోని స్టాండర్డ్ ఛార్డెడ్ బ్యాంకు భవంతి భూకంప ప్రమాదానికి ధ్వంసం కాకపోవడంతో ఈ బ్యాంకు ఏటీఎమ్‌ని అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో బ్యాంకు వద్ద డబ్బుల కోసం ప్రజలు బారులు తీరారు.

ఖాఠ్మండు నుంచి తమ తమ కుటుంబాలను తీసుకొని బయట పడేందుకు గాను డబ్బులు కావాలని భూకంప బాధితులు వాపోతున్నారు. సూరజ్ శ్రేష్ట అనే వ్యక్తి మాట్లాడుతూ మృతదేహాలతో నేపాల్ రాజధాని ఖాఠ్మండు దుర్గంధం వస్తోన్న నేపథ్యంలో కొన్ని రోజులు తన కుటుంబాన్ని తీసుకొని బయట పడేందుకు యత్నిస్తున్నట్లు పేర్కొన్నాడు.
మూడు రోజులుగా భూకంప శిథిలాల కింద కుళ్లుతున్న మృతదేహాలతో నగర వీధుల్లో వ్యాపిస్తోన్న దుర్గంధాన్ని తట్టుకోలేక ఖాఠ్మండులో నివాసముంటున్న పలువురు వారి సొంత గ్రామాలకు పయనమయ్యారు.
కొందరు సరిహద్దు గ్రామాల్లోని తమ బంధువుల ఇళ్లకు చేరుకుంటున్నారు. ఖాఠ్మండులో సంభవించిన భూకంపం కారణంగా ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ప్రాణాలతో బయట పడిన వారు సర్వస్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో వారి సొంత గ్రామాలకు వెళ్తున్నారు.












Click it and Unblock the Notifications