బాటిల్ నుంచి భూతం బయటికొచ్చింది: బైడెన్‌పై పుతిన్ నిప్పులు..!!
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ఏడాది పూర్తి కావొస్తోంది. గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఈ యుద్ధం ఆరంభమైంది. ఈ పరిస్థితుల మధ్య అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ లో ఆకస్మికంగా పర్యటిస్తోన్నారు.
మాస్కో: రష్యా-ఉక్రెయిన్ మధ్య రోజుల తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. ఫిబ్రవరి 24వ తేదీతో ఈ యుద్ధానికి ఏడాది నిండుతుంది. ఇన్ని రోజులుగా నిరాటంకంగా ఈ రెండు దేశాలు తలపడుతూనే వస్తోన్నాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్‌లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు.

వరాల సునామీ..
కొద్దిసేపటి కిందటే జో బైడెన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు చేరుకున్నారు. వెంటనే ప్రత్యేక వాహనంలో ఆ దేశాధ్యక్షుడి అధికార నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ ఆయనను సాదరంగా ఆహ్వానించారు. జో బైడెన్ తో పాటు వచ్చిన అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు, ప్రతినిధులతో వొలొదిమిర్ జెలెన్ స్కీ సమావేశం అయ్యారు. ఉక్రెయిన్ కు 500 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అత్యాధునిక ఆయుధ సామాగ్రిని అందజేస్తామని హామీ ఇచ్చారు.

ఇదే తొలిసారి..
రష్యా గత ఏడాది ఇదే ఫిబ్రవరి 24వ తేదీన యుద్ధానికి దిగిన తరువాత జో బైడెన్ ఉక్రెయిన్ లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదివరకు ఆయన పోలెండ్ లో పర్యటించారు. ఉక్రెయిన్ కు ఆనుకునే ఉండే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సభ్యత్వ దేశం ఇది. పోలెండ్- ఉక్రెయిన్ సరిహద్దు నగరంలో కూర్చుని మరీ యుద్ధం స్థితిగతులను జో బైడెన్ సమీక్షించారు అప్పట్లో. ఇప్పుడు తాజాగా ఏకంగా ఉక్రెయిన్ లోనే ల్యాండ్ కావడం చర్చనీయాంశమౌతోంది.

బైడెన్ పర్యటనపై పుతిన్..
జో బైడెన్ ఉక్రెయిన్ పర్యటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ఘాటుగా రియాక్ట్ అయ్యారాయన. ఒకవంక యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉక్రెయిన్ తో నెలకొన్న సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోన్నామని, చర్చలకు ప్రాధాన్యత ఇస్తోన్నామని అన్నారు. ఉక్రెయిన్ తో చర్చల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామనీ వివరించారు. ఈ ప్రయత్నాల మధ్య తాము ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే- భిన్న దృశ్యాలు కనిపిస్తోన్నాయని వ్యాఖ్యానించారు.

బాటిల్ నుంచి భూతం..
ఉక్రెయిన్ తో పోరాటానికి ఏడాది నిండబోతోన్న నేపథ్యంలో- కొద్దిసేపటి కిందటే ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పాశ్చాత్య దేశాలు తమ బాటిల్ నుంచి జీనీ (భూతం)ని బయటికి వదిలాయని పుతిన్.. జో బైడెన్ ను దృష్టిలో ఉంచుకుని ఆరోపించారు. శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి తాము సాగిస్తోన్న ప్రయత్నాలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తోన్నాయని విమర్శించారు.

ఉక్రెయిన్ భుజంపై
ఉక్రెయిన్ భుజంపై తుపాకీ పెట్టిన పాశ్చాత్య దేశాలు తమతో యుద్ధం చేస్తోన్నాయని పుతిన్ ఆరోపించారు. పాశ్చాత్య దేశాలతో దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి, శాంతి మార్గాన్ని అనుసరించాలనుకుంటోన్నామని, తమ ఆలోచనకు భిన్నంగా ఆయా దేశాలు వ్యవహరిస్తోన్నాయని ధ్వజమెత్తారు. ఈ ప్రయత్నంలో పలు సమాధానాలు లభించినప్పటికీ.. వాటిల్లో నిజాయితీ లోపించిందని వ్యాఖ్యానించారు.

యుద్ధం ఆరంభానికి ముందే..
గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన తాము యుద్ధానికి దిగడానికి ముందే ఉక్రెయిన్ దీనికోసం సన్నద్ధమై ఉందని, పాశ్చాత్య దేశాలు ఆ దేశానికి ఆధునిక ఆయుధ సామాగ్రిని అందజేశాయని పుతిన్ పేర్కొన్నారు. తమపై యుద్ధం చేయడానికి ఉక్రెయిన్ ను ప్రోత్సహించాయని అన్నారు. ఈ యుద్ధం నుంచి ఉక్రెయిన్ ను వెనక్కి పిలిపించే ప్రయత్నాలకు బదులుగా మరింత ఆజ్యం పోస్తోన్నాయంటూ పుతిన్ ధ్వజమెత్తారు. ఫలితంగా వందలాది మంది ప్రాణాలు పోవడానికి కారణం అయ్యాయని ఆరోపించారు.

మరింత దూకుడు..
ఉక్రెయిన్ ను పాశ్చాత్య దేశాలు తమపై ఎంత ఎక్కువగా రెచ్చగొడుతుంటే తాము అంత దూకుడుగా వ్యవహరించాల్సి ఉంటుందని వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. తమ ముందున్న లక్ష్యాన్ని అందుకోవడానికి క్రమబద్ధంగా ప్రయత్నాలు సాగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా మించి పోయిందేమీ లేదని, ఉక్రెయిన్ తరఫున శాంతి చర్చలకు పాశ్చాత్య దేశాలకు పూనుకోవాలంటూ ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications