Bab-el-Mandeb: ఎర్ర సముద్రంలో మరో హార్ముజ్- అదీ మూసేస్తే చమురుకు చుక్కలే..!
ఇరాన్ (iran) తమపై యుద్దానికి దిగిన అమెరికా-ఇజ్రాయెల్ తో పాటు వాటికి మద్దతిస్తున్న దేశాలపై ప్రతీకారంగా తమ ఆధీనంలో ఉన్న హార్ముజ్ (Hormuz)జలసంధిని మూసేసింది. దీంతో ప్రపంచ చమురు రవాణాలో ఐదో వంతుపై తీవ్ర ప్రభావం పడుతోంది. భారత్ సైతం ఈ జలసంధి గుండా తమ నౌకల్ని అనుమతించాలని ఇరాన్ ను కోరి సాధించుకుంది. హార్ముజ్ జలసంధి మూసివేత ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్నంటే పరిస్ధితులు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇలాంటిదే మరో జలసంధిని మూసేసేందుకు ఇరాన్ మద్దతున్న హౌతీ గ్రూపు సిద్దమవుతోంది.
ప్రపంచ చమురు రవాణాలో 10-12 శాతం వాటా కలిగి ఉన్న, కన్నీటి ద్వారంగా పిలిచే ఎర్ర సముద్రంలోని బాబ్-ఎల్-మాండెబ్ జలసంధిని మూసేసేందుకు యెమెన్ లోని హౌతీ గ్రూపు సిద్దమవుతోంది. హౌతీలు ఈ యుద్ధంలోకి ప్రవేశిస్తే ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన మరో మార్గం స్తంభించిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అప్పుడు ప్రపంచ చమురు రవాణాలో కీలక వాటాతో పాటు, ఆసియా-యూరప్ మధ్య జరిగే భారీ వాణిజ్యం కూడా నిలిచిపోనుంది. ఇరాన్ నుంచి దీర్ఘకాలంగా మద్దతు, ఆయుధాలు, శిక్షణ పొందుతున్న యెమెన్ ఆధారిత మిలిటెంట్ గ్రూపు అయిన హౌతీలు కనుక యుద్ధంలోకి దిగితే, అది బాబ్-ఎల్-మాండెబ్ జలసంధిని స్తంభింపజేయగలదని భావిస్తున్నారు.

ఇప్పటికే హార్ముజ్ జలసంధి మూసివేతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చమురు రంగం.. ఇప్పుడు బాబ్ ఎల్ మాండెబ్ కూడా మూసేస్తే పూర్తిగా సంక్షోభంలోకి జారుకోవడం ఖాయం. నిపుణుల విశ్లేషణ ప్రకారం హౌతీలు ఈ ప్రాంతంలో "ఇరాన్ అనుసరిస్తున్న మూడు దశల వ్యూహంలో భాగంగా ఉన్నారు. అరేబియన్ ద్వీపకల్పం దక్షిణ చివరన ఉన్న ఈ ఇరుకైన సముద్ర మార్గం ఎర్ర సముద్రం ద్వారా సూయజ్ కాలువకు వెళ్లే నౌకల రాకపోకలను నియంత్రిస్తుంది. ఇరాన్ అనేక సరుకు రవాణా నౌకలను అడ్డుకుంటున్న నివేదికల మధ్య హోర్ముజ్ జలసంధి స్తంభించినట్లే, బాబ్-ఎల్-మాండెబ్ కూడా అంతే కీలకమైన సముద్ర మార్గం.
బాబ్-ఎల్-మాండెబ్ ఎర్ర సముద్రాన్ని, ఆ తర్వాత హిందూ మహాసముద్రాన్ని మధ్యధరా సముద్రంతో, తదుపరి అట్లాంటిక్ మహాసముద్రంతో కలుపుతుంది. ఆసియా-యూరప్ వాణిజ్యానికి ఈ మార్గం చాలా ముఖ్యమైనది. దీర్ఘకాలంగా బాబ్-ఎల్-మాండెబ్‌ను అడ్డుకుంటామని బెదిరిస్తూ, గతంలో ప్రయత్నాలు కూడా చేసిన హౌతీలు ఇప్పుడు ఈ మార్గాన్ని నిరోధిస్తే, దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. ప్రత్యేకించి పర్షియన్ గల్ఫ్‌లోని హోర్ముజ్ జలసంధి యుద్ధం కారణంగా స్తంభించిన ప్రస్తుత తరుణంలో ఇది మరింత ప్రమాదకరం. ఈ రెండు మార్గాలు కలిసి ప్రపంచ సముద్ర చమురు రవాణాలో సుమారు 30% వాటాను కలిగి ఉండటంతో పాటు సూయజ్ కాలువ ద్వారా ఆసియా-యూరప్ సముద్ర వాణిజ్యాన్ని నియంత్రిస్తున్నాయి.

సూయజ్ కాలువ ద్వారా యూరప్-ఆసియా మధ్య ప్రయాణించే ఏ నౌక అయినా ఈ బాబ్ ఎల్ మాండెబ్ గుండా వెళ్ళాలి. అవి సూయజ్ కాలువ గుండా వెళ్ళలేకపోతే, కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ ప్రయాణించాల్సి వస్తుంది. అది సాధారణ 20-25 రోజుల ఆసియా-యూరప్ ప్రయాణాన్ని సుమారు 30-40 రోజులకు పెంచుతుంది. అంటే సుమారు 10-15 అదనపు రోజులు పడుతుంది. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 12%, సముద్ర చమురులో 10%, గణనీయమైన ఎల్ఎన్జీ ఈ మార్గం గుండా వెళ్తుంది. హౌతీలు బాబ్-ఎల్-మాండెబ్‌ను విజయవంతంగా అడ్డుకుంటే, ప్రపంచ వాణిజ్యానికి పర్యవసానాలు వినాశకరంగా ఉంటాయి. ఇది ఇంధన ధరలను విపరీతంగా పెంచుతుంది. హార్ముజ్ కు ఇరాన్ అడ్డుపడటంతో ముడి చమురు ధరలు 100 డాలర్ల మార్కుకు దగ్గరగా ఉన్నాయి. బాబ్-ఎల్-మాండెబ్ కూడా స్తంభిస్తే, ధరలు భారీగా పెరగవచ్చు.












Click it and Unblock the Notifications