మాట్లాడుతూనే కుప్పకూలిన బీఎండబ్ల్యు సీఈఓ
ఫ్రాంక్‌ఫర్ట్: బీఎండబ్ల్యు సీఈఓ హెరాల్డ్ క్రూయిజర్ ఓ న్యూస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ వెనక్కి పడిపోయారు. ఈ ఘటన జర్మనీలో మంగళవారం చోటు చేసుకుంది. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఆటో షోపై జరుగుతున్న సమావేశంలో స్టేజ్‌పై మాట్లాడుతుండగానే ఉన్నట్టుండి ఆయన వెనక్కి పడిపోయారు.
దీంతో ఆయన సహాయకులు, సిబ్బంది వెంటనే స్టేజ్‌పైకి వెళ్లి ఆయనను లేవదీశారు. క్రూయిజర్ తన చేతులతో తల వెనుకభాగంలో రుద్దుకుంటూ.. పైకి లేచారు. ఆయన తలకు స్వల్ప గాయమైనట్లు తెలుస్తోంది.
స్టేజ్‌పై నుంచి ఆయనను తీసుకువెళ్లి ఉపచర్యలు చేశారు. హెరాల్డ్ మాట్లాడటం ప్రారంభించిన ఐదు నిమిషాల తర్వాత ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే ఆయన కిందపడడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

కాగా, బిఎండబ్ల్యూ అధికార ప్రతినిధి మాక్సిమిలియన్ షియోబెరి మాట్లాడుతూ.. క్రూయిజర్(49) ఇటీవల కాలంలో అనేక ప్రాంతాలకు పర్యటనలు చేశారని చెప్పారు. ఆయన కొంత అసౌకర్యంగా ఉన్నప్పటికీ ఈ సమావేశంలో పాల్గొనాలని ఉద్దేశంతోనే ఇక్కడి వచ్చారని తెలిపారు.
అయితే ప్రసంగిస్తున్న సమయంలో కళ్లు తిరిగినట్లు అవడంతోనే క్రూయిజర్ పడిపోయి ఉంటారని చెప్పారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతనికి విశ్రాంతి అవసరమని, ఇతర కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని సూచించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం క్రూయిజర్ పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు.












Click it and Unblock the Notifications