పాకిస్థాన్ కి బిగ్ షాక్.. పోలీస్ స్టేషన్ పైనే ఆత్మాహుతి దాడి !!

పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని బన్నూ జిల్లాలో శనివారం జరిగిన భారీ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఫతేఖేల్ పోలీస్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. భారీ పేలుడు శబ్దంతో ప్రాంతమంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురైంది.

పేలుడు పదార్థాలతో నింపిన వాహనం

భద్రతా వర్గాల సమాచారం ప్రకారం.. ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నింపిన వాహనాన్ని పోలీస్ స్టేషన్‌లోకి దూసుకెళ్లించి భారీ విధ్వంసం సృష్టించాలని యత్నించారు. అయితే, భద్రతా దళాలు ముందుగానే అప్రమత్తమై వాహనాన్ని లక్ష్యానికి చేరకముందే అడ్డుకుని పేల్చివేశాయి. దీంతో మరింత పెద్ద ప్రాణనష్టం తప్పిందని అధికారులు తెలిపారు.

bomb-blast-at-pakisthan-police-station-in-khyber-pakhtunkhwa-that-casualities-reported-as-three-dead

కాల్పులతో మార్మోగిన ప్రాంతం..

వాహనం పేలిన వెంటనే డజన్ల కొద్దీ సాయుధ ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టి కాల్పులు ప్రారంభించారు. భద్రతా దళాలు కూడా ఎదురు కాల్పులు జరపడంతో ప్రాంతమంతా యుద్ధ వాతావరణాన్ని తలపించింది. గంటల పాటు సాగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పోలీసులు వీరమరణం పొందారు. పలువురు సిబ్బంది గాయపడగా, వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.

ఇళ్లపైకప్పులు కూలి ఆస్తి నష్టం..

పేలుడు తీవ్రతకు సమీపంలోని ఇళ్ల పైకప్పులు కూలిపోయాయి. అనేక భవనాలు దెబ్బతిన్నాయి. ప్రజలు ప్రాణభయంతో ఇళ్లను వదిలి బయటకు పరుగులు తీశారు. చిన్నారులు, మహిళలు భయంతో కన్నీళ్లు పెట్టుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటన తర్వాత మొత్తం ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

ఉగ్రవాదుల కోసం గాలింపు..

దాడి అనంతరం ఉగ్రవాదుల్లో కొందరు సమీప ప్రాంతాలకు పారిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో భద్రతా దళాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. డ్రోన్లు, ప్రత్యేక దళాలతో అడవులు, కొండ ప్రాంతాలను జల్లెడ పడుతున్నట్లు సమాచారం. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ముఖ్యమంత్రి ముహమ్మద్ సోహైల్ అఫ్రిది ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

అఫ్రిది మాట్లాడుతూ.. "ఉగ్రవాదంపై పోరాటం కేవలం ఒక ప్రాంతానికి సంబంధించినది కాదు. ఇది మొత్తం దేశ భద్రతకు సంబంధించిన యుద్ధం. మన పోలీసుల త్యాగాలను ఎప్పటికీ వృథా కానివ్వం" అని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, బలోచిస్తాన్ ప్రాంతాల్లో ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లు, సైనిక శిబిరాలు, భద్రతా దళాల వాహనాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. ఈ తాజా ఘటనతో పాకిస్థాన్‌లో భద్రతా పరిస్థితులపై మళ్లీ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+