బాంబు పేలుడు.. 14 మంది దుర్మరణం
Bomb Blast in Pakistan: పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో మరోసారి హింస చెలరేగింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన బాంబు పేలుడులో కనీసం 14 మంది మరణించగా.. 35 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటన నగరం మొత్తాన్ని భయాందోళనలో నెట్టేసింది.
రాజకీయ ర్యాలీ లక్ష్యంగా దాడి
ఈ దాడి బలూచ్ నేషనల్ పార్టీ నిర్వహించిన ఓ రాజకీయ ర్యాలీ అనంతరం జరిగింది. బలూచ్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు సర్దార్ అత్తావుల్లా మెంగల్ నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని ఈ ర్యాలీని నిర్వహించారు. ర్యాలీ ముగింపు దశలో ప్రజలు షావానీ స్టేడియం సమీపంలో ఉన్న పార్కింగ్ ప్రాంతం నుంచి వెళ్తుండగా ఈ ఘోర పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పార్కింగ్ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఘటనాస్థలిలోనే 14 మంది ప్రాణాలు కోల్పోగా.. గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో మాజీ పాకిస్తానీ ఎంపీ అహ్మద్ నవాజ్, పార్టీ నాయకుడు మూసా బలూచ్ కూడా ఉన్నారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఆత్మాహుతి దాడి అనుమానాలు
ఈ దాడి బలూచ్ నేషనల్ పార్టీ నాయకుడు సర్దార్ అక్తర్ మెంగల్ ను లక్ష్యంగా చేసుకుని జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ దాడి నుంచి అక్తర్ మెంగల్ సురక్షితంగా బయటపడ్డారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని ధృవీకరించడానికి దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఈ దాడి నేపథ్యంలో క్వెట్టాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications