కెనడాలో కలకలం.. ఒకేసారి 17 మంది భారత సంతతి యువకులు అరెస్ట్ !!!
కెనడాలో స్థిరపడిన దక్షిణాసియా వ్యాపారులను, వలసదారులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు, దోపిడీలకు పాల్పడుతున్న భారీ అంతర్జాతీయ నేర ముఠా ఆట కట్టించారు అక్కడి పోలీసులు. భారత సంతతికి చెందినట్లు భావిస్తున్న 17 మంది పురుషులను కెనడా రక్షక దళాలు మంగళవారం అరెస్టు చేశాయి. ఈ ముఠా అరెస్టుతో ఒక పెద్ద క్రిమినల్ నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చిందని అధికారులు వెల్లడించారు.
పీల్ రీజియన్ పరిధిలో వ్యాపార సంస్థలపై హింసాత్మక ఘటనలు, బెదిరింపులు పెరగడంతో, పీల్ రీజినల్ పోలీసులు 'ఎక్స్‌టార్షన్ టాస్క్ ఫోర్స్’ను రంగంలోకి దించారు. ఈ ప్రత్యేక దళం తమ అధికారిక వెబ్‌సైట్‌లో సోమవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో, స్థానిక వ్యాపారులను లొంగదీసుకునేందుకు సాగుతున్న ఒక సమన్వయపూర్వక నేర నెట్‌వర్క్‌ను విజయవంతంగా ఛేదించినట్లు స్పష్టం చేశారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. అరెస్ట్ అయిన వారిలో ఎక్కువమందికి 'ఫోర్ బ్రదర్స్' అనే అంతర్జాతీయ నేర ముఠాతో సంబంధాలున్నట్లు నిర్ధారణైంది. ఈ ముఠా కెనడాతోపాటు అమెరికాలో కూడా విస్తరించి, దక్షిణాసియా ముఖ్యంగా భారతీయ వ్యాపార యజమానులను లక్ష్యంగా చేసుకుంది. వీరి నుంచి లక్షలాది డాలర్లు వసూలు చేయడమే కాకుండా, డబ్బులు ఇవ్వని వారిపై భౌతిక దాడులకు కూడా పాల్పడినట్లు విచారణలో తేలింది.
కనడాలో భారత సంతతి ముఠాలు గ్యాంగ్ వార్స్, దోపిడీలకు పాల్పడటం ప్రవాస భారతీయులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అరెస్టయిన నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి, ఈ ముఠా వెనుక ఉన్న కీలక సూత్రధారులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఆపరేషన్ స్థానిక వ్యాపార వర్గాలకు గొప్ప ఊరటనిచ్చిందని అధికారులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications