జీతం బదులు జున్ను... ఉద్యోగుల కాళ్లావేళ్లా పడుతున్న కంపెనీ
జున్ను తయారు చేసే ఓ కంపెనీ బోగస్ సర్వేలు నమ్మి నట్టేటా మునిగి జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో వేతనం కింద జున్ను తీసుకోమంటూ ఉద్యోగుల కాళ్లావేళ్లా పడుతోంది.
ఆర్మేనియా: పరిశ్రమ నిర్వహణ సులువైన వ్యవహారం ఏమీ కాదు. వ్యాపార సూత్రాలను, మార్కెట్లో కంపెనీ స్థాయిని ఎప్పటికప్పుడు సరిచూసుకోవడం ఎంతో ముఖ్యం. లేకుంటే అనవసర ఖర్చులు మీద పడి భారీగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
ఇటీవల జున్ను తయారు చేసే ఓ కంపెనీ బోగస్ సర్వేలు నమ్మి నట్టేటా మునిగిపోయింది. చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో వేతనం కింద జున్ను తీసుకోమంటూ ఉద్యోగుల కాళ్లావేళ్లా పడుతోంది. వివరాల్లోకి వెళ్తే...
యూరప్ ఖండాల మధ్యలో ఉన్న ఆర్మేనియా దేశంలో 'అస్తరక్ కాట్' అనే కంపెనీ జున్ను ఉత్పత్తి చేస్తోంది. గత ఏడాది ఈ కంపెనీ 'బ్లూ మోల్డ్ చీజ్' పేరుతో ప్రత్యేకంగా జున్నును మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఈ చీజ్ కి ఆ దేశంలోనే కాక విదేశాల్లో సైతం భారీ డిమాండు ఉన్నట్లు ఒక సర్వేలో తేలింది.

రెట్టించిన ఉత్సాహంతో ఏడాది పొడవునా భారీ మొత్తంలో టన్నుల కొద్దీ జున్నును ఉత్పత్తి చేసింది. తీరా చూస్తే మార్కెట్లో ఈ కంపెనీ ఉత్పత్తులను కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
దీంతో కంపెనీ నష్టాల పాలైంది. కొన్ని నెలలుగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు. ఉత్పత్తి చేసిన జున్ను మొత్తం కంపెనీలోనే ఉండిపోయింది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని కంపెనీ యాజమాన్యం జీతాల బదులు జున్ను తీసుకుని 'వస్తుమార్పిడి' చేసుకోవాలని ఉద్య్హోగులకు సూచించడంతోపాటు స్థానిక వ్యాపారులను కూడా అర్ధించింది.
కిలో జున్ను 2 వేల డ్రామ్ (రూ.280) విలువ చేస్తుందని, ఆర్ధిక పరిస్థితులు చక్కబడ్డాక మళ్ళీ ఎప్పటిలాగే వేతనం కింద నగదును సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ ఆలోచన బాగానే ఉందని కొంతమంది ఉద్యోగులు దాన్ని అమలులో పెట్టారు. కొంతమంది మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
జున్ను ఎక్కువకాలం నిల్వ ఉండదని, పాడైపోయిన జున్నును ఎవరూ తీసుకోరని, అలాంటప్పుడు దానిని ఎలా మార్పిడి చేసుకుని ఇతర సరుకులు తెచ్చుకోవాలనేది వారి బాధ. పరిస్థితి అర్థం చేసుకున్న స్థానిక మేయర్ అస్తరక్ కాట్ కంపెనీలో నిల్వ ఉన్న జున్నును రష్యా తదితర దేశాల్లోని వ్యాపారులకు అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications