‘మీ వీర్యం మన భవిష్యత్’: చైనా కొత్త నినాదం
బీజింగ్: చైనా మరో కొత్త నినాదానికి రూపమిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో అమల్లో ఉన్నా.. చైనా ఇప్పుడు అందుకు సిద్ధమైంది. అదేంటంటే..'దేశ భవిష్యత్ ప్రయోజనాల కోసం, దయచేసి వీర్యాన్ని దానమివ్వండి' అంటూ చైనాలోని 20 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్కులను అక్కడి ప్రభుత్వం వేడుకుంటోంది.
దేశంలోని స్పెర్మ్(వీర్యం) బ్యాంకుల్లో నిల్వలు అడుగంటిపోవడంతో నష్ట నివారణ చర్యలను చేపట్టింది చైనా ప్రభుత్వం. ప్రాచీన సంప్రదాయాలు, సంస్కృతిని అభిమానించే చైనీయులు వీర్యాన్ని దానం ఇవ్వడానికి సహజంగా ముందుకు రారు.

అయితే, ఇటీవలి కాలం వరకూ ఒక్క సంతానానికే పరిమితమైన చైనాలో.. ఇప్పుడు రెండో సంతానానికి అనుమతి లభించింది. దీంతో వయసు మళ్లినవారు స్పెర్మ్ బ్యాంకులను ఆశ్రయిస్తుండగా, వీర్య కొరత వారిని వేధిస్తోంది.
కాగా, సామాజిక మాధ్యమాల్లో వీర్య దానం చేయాలంటే 1000 డాలర్లు ఇవ్వాలని, లేకుంటే రోజ్ గోల్డ్ ఐ ఫోన్‌ను బహుమతిగా ఇవ్వాలని కొందరు యువకులు ప్రకటనలు ఇస్తుండటం గమనార్హం. దీనికి కూడా పలు స్పెర్మ్ బ్యాంకులు ముందుకు రావడం గమనార్హం.
ఈ క్రమంలో చైనా ప్రభుత్వం రంగంలోకి దిగింది. చైనాలో యువకుల సంఖ్య తగ్గి వృద్ధులు పెరిగిపోవడంతో, భవిష్యత్ అవసరాల నిమిత్తం ఇప్పటి నుంచే దేశభక్తిని చూపుతూ పిల్లల్ని కనే పనిలో ఉండాలని సూచించింది. అంతేగాక, వీర్యాన్ని దానం ఇవ్వాలని స్పెర్మ్ బ్యాంకులు ప్రత్యేక ప్రకటనలు ఇస్తున్నాయి. వీర్యాన్ని దానం చేయడం రక్తదానం చేసినంత గొప్పదని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది.












Click it and Unblock the Notifications