నిద్రలో ఉండగానే కంపించిన భూమి.. ప్రజల్లో ఒక్కసారిగా భయాందోళనలు!
చైనాలో గురువారం ఉదయం ఆకస్మికంగా భూమి ప్రకంపించింది. తీవ్రమైన కుదుపులతో భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భారత కాలమానం ప్రకారం గురువారం(నవంబర్ 5) ఉదయం 6.19 గంటల ప్రాంతంలో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం.. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది.
10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం
భూకంప శాస్త్రవేత్తల ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఈ భూకంప కేంద్రం 32.592 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 94.291 డిగ్రీల తూర్పు రేఖాంశంలో కేంద్రీకృతమైంది. భూఉపరితలానికి దాదాపు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు ఉద్భవించినట్లు అధికారులు ధ్రువీకరించారు. భూకంపం వచ్చిన సమయంలో ప్రజలు నిద్రలో ఉండటంతో ఒక్కసారిగా వచ్చిన కుదుపులకు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే భూకంప తీవ్రత స్వల్పంగా ఉండటంతో ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి నష్టం గానీ, ప్రాణనష్టం గానీ జరిగినట్లు నివేదికలు అందలేదని స్థానిక యంత్రాంగం వెల్లడించింది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో అత్యవసర సహాయక బృందాలు పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తున్నాయి.

భూకంపాలు ఎలా సంభవిస్తాయంటే?
భూమి ఉపరితలం బయటకు ఘనంగా కనిపించినప్పటికీ.. దీని అంతర్భాగం 4 ప్రధాన పొరలుగా(ఇన్నర్ కోర్, ఔటర్ కోర్, మాంటిల్, క్రస్ట్) విభజించబడి ఉంటుంది. భూమి పైపొర అయిన క్రస్ట్, మాంటిల్ పైభాగాన్ని కలిపి 'లిథోస్పియర్' అంటారు. ఈ భాగం అనేక పెద్ద, చిన్న 'టెక్టోనిక్ ప్లేట్లు'గా విడిపోయి ఉంటుంది. ఈ టెక్టోనిక్ ప్లేట్లు అత్యంత నెమ్మదిగా కదులుతుంటాయి. ఈ క్రమంలో రెండు ప్లేట్లు ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు, రాపిడికి గురైనప్పుడు లేదా ఒకదాని కిందకు మరొకటి తోసుకుపోయినప్పుడు వాటి మధ్య తీవ్రమైన ఒత్తిడి, శక్తి హఠాత్తుగా బయటకు విడుదలైనప్పుడు భూమి ఉపరితలం కంపించి భూకంపం సంభవిస్తుంది.
భూకంపం వల్ల విడుదలయ్యే శక్తి పరిణామాన్ని కొలవడానికి రిక్టర్ స్కేలును ఉపయోగిస్తారు. తీవ్రత పెరిగేకొద్దీ నష్టం స్థాయి కూడా పెరుగుతుంది. భూమి అంతర్భాగంలో సరిగ్గా ఏ ప్రదేశంలోనైతే శక్తి విడుదలవుతుందో దానిని 'హైపోసెంటర్(ఫోకస్)' అంటారు. ఈ హైపోసెంటర్ కు సరిగ్గా నిలువుగా పైన భూఉపరితలంపై ఉండే ప్రదేశాన్ని 'ఎపిసెంటర్(భూకంప కేంద్రం)' అని పిలుస్తారు. ఎపిసెంటర్ వద్ద భూకంప తీవ్రత అత్యధికంగా ఉంటుంది.













Click it and Unblock the Notifications
