జాలర్లను కాపాడేందుకు వెళ్లి.. 11 మంది ఎస్ డీఆర్ ఎఫ్ సిబ్బంది గల్లంతు
ఖమ్మం జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా చెరువులో చిక్కుకుపోయిన జాలర్లను కాపాడేందుకు వెళ్లిన 11 మంది ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది గల్లంతయ్యారు. వారు ప్రయాణిస్తున్న పడవలు వరద కారణంగా బోల్తా కొట్టడంతో సిబ్బంది గల్లంతైనట్లు సమాచారం అందుతోంది. ఈ క్రమంలో వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక విషయం తెలుసుకున్న కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎమ్మెల్యే మట్టా రాగమయి ఘటనాస్థలికి వెళ్లి సిబ్బందితో కలిసి సహాయ చర్యలను చేపట్టారు.
భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో చిక్కుకున్న జాలర్లను కాపాడేందుకు వెళ్లిన 11 మంది ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది గల్లంతయ్యారు. భారీ వర్షాలు కురుస్తూ చెరువు అలుగు పారుతున్న తరుణంలో చెరువులో నెట్స్ ను ఏర్పాటు చేసేందుకు వెళ్లిన ఐదుగురు మత్స్య కారులు గల్లంతయ్యారు. అయితే గ్రామస్థులు అందించిన సమాచారం మేరకు వారిని కాపాడేందుకు తొలుత ముగ్గురు ఫైర్ సిబ్బంది చెరువులోకి బోటు సాయంతో వెళ్లగా వారు చెరువులో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో కొత్తగూడెం ఎస్డీఆర్ ఎఫ్ కు చెందిన ఆరుగురు.. మరో ఐదుగురు ఫైర్ సిబ్బంది రెండు పడవల్లో వారిని కాపాడేందుకు వెళ్లారు. అయితే చెరువులో చిక్కుకుపోయిన ముగ్గురు ఫైర్ సిబ్బందిని వెనక్కు తీసుకొచ్చారు. ఆ తర్వాత జాలర్లను కాపాడేందుకు మరోసారి వాళ్లు వెళ్లారు. ఈ క్రమంలో పడవలు తిరగబడి వాళ్లు గల్లంతయ్యారు.

ఇక సమాచారం అందుకున్న వెంటనే భద్రాచలం నుంచి ఎన్ డీఆర్ ఎఫ్ సిబ్బందిని రప్పించి చెరువులో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేపట్టారు. మరోవైపు బేతుపల్లి చెరువులో బోట్ల గల్లంతుపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని వీలైనంత త్వరగా సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిందిగా సీఎస్ కు సూచనలు చేశారు. ఇక ప్రస్తతుం ఘటనాస్థలిలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.












Click it and Unblock the Notifications
