పరాజయం వేళ 41 నిమిషాల పాటు అదే ముచ్చట.. ట్రంప్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్!
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు విజయం సాధించి కాంగ్రెస్ నియంత్రణను చేజిక్కించుకున్న వేళ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల ఫలితాల అనంతరం బుధవారం మొదటి సారి మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఎలక్షన్ రిజల్ట్స్ కంటే కూడా తన వైట్‌హౌస్ నిర్మాణాలు, డిజైన్ల విశేషాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు. ఆయన రాజకీయ విశ్లేషణలకు బదులుగా వైట్‌హౌస్‌లో కొత్తగా నిర్మిస్తున్న బాల్‌రూమ్ బీమ్ అమర్చే కార్యక్రమంలో పాల్గొని 41 నిమిషాల పాటు భవన నిర్మాణ విశేషాలనే వివరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఇరాన్ యుద్ధమే ఓటమికి కారణమా?
ఈ ఓటమికి ఇరాన్ యుద్ధమే ప్రధాన కారణమని ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ గురించి జర్నలిస్టులు ప్రశ్నించగా.." ఆయన చెప్పింది నిజమే కావచ్చు" అని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒకవేళ కాలంలో వెనక్కి వెళ్లే అవకాశం వచ్చినా తాను తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. ఇరాన్ అణు ఆయుధాలు సాధించకుండా నిరోధించడానికే ఈ యుద్ధం అని, దేశ భద్రత దృష్ట్యా ఇది అత్యంత అవసరమని ఆయన సమర్థించుకున్నారు.

డెమోక్రాట్ల విజయభేరి.. హెచ్చరించిన ట్రంప్
మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు అద్భుత విజయాన్ని సాధించారు. సెనేట్‌లో 7 స్థానాలను కైవసం చేసుకోవడమే కాకుండా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో మెజారిటీకి కావాల్సిన 218 సీట్ల కంటే అదనంగా 229 సీట్లను గెలుచుకున్నారు. డమోక్రాట్ల నియంత్రణలోకి వెళ్లిన కాంగ్రెస్‌తో పనిచేయడంపై స్పందిస్తూ.. "వారు దేశాభివృద్ధికి సహకరిస్తే కలిసి పనిచేస్తాను. ఒకవేళ ధ్వంసకర రాజకీయాలకు పాల్పడితే నాకున్న వీటో అధికారాన్ని ఉపయోగిస్తాను" అని ట్రంప్ హెచ్చరించారు.
రాజకీయాల కన్నా నిర్మాణాల పైనే శ్రద్ధ
ఎన్నికల ఫలితాల ప్రకంపనలు కొనసాగుతుండగానే, ట్రంప్ మాత్రం వైట్‌హౌస్ బాల్‌రూమ్ ఎత్తులు, కారింథియన్ స్తంభాలు, ఇటాలియన్ మార్బుల్స్, ఐదంతస్తుల లోతులో నిర్మిస్తున్న అత్యంత సురక్షితమైన బంకర్ విశేషాలను ఉత్సాహంగా వివరించారు. ఇదొక అద్భుతమని, కార్మికుల కృషి వల్లే ఇది సాధ్యమైందని ఆయన కొనియాడారు. 2028 అధ్యక్ష ఎన్నికల రేసులో జేడీ వ్యాన్స్ ఉంటారా అని అడిగిన ప్రశ్నకు.."ఆయన పోటీ చేస్తారో లేదో ఇప్పుడు ఊహించలేం" అని బదులిచ్చారు. అనంతరం జర్నలిస్టుల ప్రశ్నలకు స్వస్తి చెప్పి.. బాల్ రూమ్ పనులను వీక్షిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.













Click it and Unblock the Notifications
