వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా: 'జాక్ మా' లాంటి పారిశ్రామిక దిగ్గజాలను జిన్‌పింగ్ ప్రభుత్వం ఎందుకు ‘ఇబ్బంది పెడుతోంది’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
జాక్ మా

చైనా పారిశ్రామిక వేత్త జాక్ మాకు అప్పటివరకు అంతా సవ్యంగానే సాగింది. ఆయన కంపెనీ అలీబాబాకు చెందిన ఫైనాన్షియల్ యూనిట్ 'గ్రూపో హార్మిగా' 2020 నవంబర్‌లో హాంకాంగ్, షాంఘై షేర్ మార్కెట్‌లో లిస్టింగ్ కావాల్సి ఉంది.

'గ్రూపో హార్మినా' సంస్థ అంచనా విలువ దాదాపు 34,400 కోట్ల డాలర్లు. ఆ లిస్టింగ్‌ను అప్పట్లో అలీబాబా చరిత్రలోనే మైలురాయిగా వర్ణించారు. కానీ చివరి నిమిషంలో అంతా తారుమారైంది.

చైనా ఫైనాన్సియల్ రెగ్యులేటర్లు ఆ లిస్టింగ్ ప్రక్రియను ఆపేశారు. అంతే కాదు, ఆ లిస్టింగ్‌ సందర్భంగా నిర్వహించాలనుకున్న భారీ కార్యక్రమానికి విద్యుత్ సరఫరా కూడా కట్ చేశారు.

మ్యూజిక్ నిలివేయడంతోపాటూ ఈవెంట్‌కు వచ్చిన అతిథులు అందరినీ తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని చెప్పారు. ఆ తర్వాత కంపెనీని పునర్నిర్మించాలని ప్రభుత్వం అలీబాబాను కోరింది.

ఒకప్పుడు చైనా విజయానికి ప్రతీకగా ఉన్న జాక్ మా ఈ ఘటన తరువాత కొన్ని నెలల పాటు ఎవరికీ కనిపించకుండాపోయారు.

ఆ అనూహ్య నిర్ణయ ప్రభావం అంతర్జాతీయ స్థాయిలో కనిపించింది.

చైనాలోని షీ జిన్‌పింగ్ ప్రభుత్వం పెద్దపెద్ద టెక్నాలజీ కంపెనీలపై తీసుకోబోయే చర్యలకు అలీబాబా ఉదంతం ప్రారంభం మాత్రమేనని చాలా తక్కువ మంది అర్థం చేసుకున్నారు.

షీ జిన్‌పింగ్

అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నిర్ణయం

దేశంలోని టెక్నాలజీ కంపెనీలపై కఠిన నియంత్రణలు విధించాలనే తన నిర్ణయాన్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ సమావేశంలో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సమర్థించుకున్నారని ఆ దేశ అధికారిక మీడియా చెప్పింది.

అక్రమ పెట్టుబడుల విస్తరణను అడ్డుకోవడం, జవాబుదారీ లేని వృద్ధిని ఎదుర్కోవడమే తన లక్ష్యం అని చెప్పిన షీ జిన్ పింగ్, టెక్నాలజీ కంపెనీలకు వ్యతిరేకంగా తాను చేపట్టిన చర్యలను సమర్థించుకుంటూ వస్తున్నారు.

ఇలాంటి కంపెనీలపై మరిన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సోషలిస్టు మార్కెట్ ఎకానమీలో సవరణలు తీసుకురావడానికి, ప్రజల జీవితాలు మెరుగు పరచడానికి ఈ చర్యలు చాలా అవసరమని ఆయన అన్నారు.

'సామాన్యుల శ్రేయస్సు' నినాదం షీ జిన్‌పింగ్ ప్రభుత్వ కొత్త మంత్రం. వనరుల పునర్విభజన, కంపెనీల మధ్య పోటీ పెంచడానికి ఇది అవసరమని ఆయన భావిస్తున్నారు.

గ్రూపో హార్మినా ఐపీఓను అడ్డుకున్న తర్వాత షీ జిన్‌పింగ్ ప్రభుత్వం మిగతా టెక్నాలజీ కంపెనీలపైనా ఆంక్షలు విధించింది. వాటిలో ఈ-కామర్స్, ఫిన్‌టెక్, వీడియో గేమ్స్, ఆన్‌లైన్ ఎజెక్షన్ బిజినెస్‌కు సంబంధించినవి కంపెనీలు ఉన్నాయి.

టెన్సెంట్

అత్యధిక జరిమానా

పారిశ్రామికవేత్త జాక్ మా ఆర్థిక సామ్రాజ్యంలో ముఖ్యమైనది ఈ-కామర్స్ కంపెనీ 'అలీబాబా’. దీనికి ఈ ఏడాది ఏప్రిల్‌లో 2,800 కోట్ల డాలర్ల జరిమానా విధించారు. దేశ ఆర్థిక చరిత్రలో ఒక కంపెనీకి విధించిన అత్యధిక జరిమానా ఇదే.

మార్కెట్లో ఆధిపత్యం సాగిస్తున్న అలీబాబా కంపెనీ తన స్థానాన్ని దుర్వినియోగం చేయడం వల్లే జరిమానా విధించినట్లు చైనా ప్రభుత్వం చెబుతోంది.

కొత్తగా ప్రభుత్వ ఆంక్షలు ఎదుర్కొన్న కంపెనీల్లో టెన్సెంట్(ఇంటర్నెట్ కంపెనీ), మెయితువాన్(ఫుడ్ డెలివరీ), పింజ్యూఓయుఓ (ఈ-కామర్స్), దీదీ(యాప్ అధారిత కాబ్ సర్వీస్), ఫుల్ ట్రక్ అలయెన్స్, కాంఝుమ్(రిక్రూట్‌మెంట్), న్యూ ఓరియెంటల్ ఎడ్యుకేషన్(ఆన్ లైన్ ఎడ్యుకేషన్) ఉన్నాయి.

ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా సహకారం అందిస్తామని అలీబాబా, దీదీ, మెయితువాన్ వేరు వేరు ప్రకటనలు జారీ చేశాయి.

ఇందులో తాజాగా ఎలక్ట్రిక్ కార్ తయారీ కంపెనీ బీవైడీ కూడా చేరింది. ఈ కంపెనీ తన చిప్ మేకింగ్ యూనిట్‌లో వాటాలు విక్రయించాలనుకుంది. కానీ, ప్రభుత్వం దర్యాప్తు వల్ల ఆ ప్రక్రియను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది.

యాప్ ఆధారిత కాబ్ సేవలు అందించే దీదీ కంపెనీ

కంపెనీలపై నియంత్రణకు యత్నం

టెక్నాలజీ కంపెనీలకు వ్యతిరేకంగా చేపట్టిన చర్యల గురించి మాట్లాడిన షీ జిన్‌పింగ్ ప్రభుత్వం ఈ కేసులన్నీ దేనికవే భిన్నమని చెబుతోంది.

గుత్తాధిపత్యాన్ని అడ్డుకోవడం, యూజర్ల డేటాను సంరక్షించడం చాలా ముఖ్యం అని, అందుకే తాము ఇలాంటి చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం తన వాదనను సమర్థించుకుంటోంది.

ఇదే వరుసలో ఇటీవల ఒక చట్టం కూడా ఆమోదించారు. దాని ప్రకారం సున్నితమైన పర్సనల్ డేటాను అక్రమంగా సంపాదిస్తే, ఆ కంపెనీ కార్యకలాపాలనే నిలిపివేయవచ్చు, లేదా దానిని రద్దు కూడా చేయవచ్చు.

టెక్నాలజీ కంపెనీలను వెంటాడే చర్యల్లో భాగంగా డేటా సెక్యూరిటీ రివ్యూ కూడా చేస్తున్నారు. ఆ కంపెనీలపై నియంత్రణ కోసం 'అక్రమ పెట్టుబడుల విస్తరణ' అనే వాదనను ఉపయోగిస్తున్నారు.

గత ఏడాది డిసెంబర్‌లో ప్రభుత్వం ఈ పదాన్ని ఉపయోగించింది. ఇందులో ప్రజా ప్రయోజనాలను పణంగా పెట్టి కంపెనీలను అభివృద్ధి చెందనివ్వం అనే అర్థం ఉంది.

చైనా సైన్యం

ప్రభుత్వ అభిప్రాయం

"సాంకేతిక రంగ అభివృద్ధికి చైనా కమ్యూనిస్ట్ పార్టీ బ్రేకులు వేయాలని చూస్తోంది. ఆ సెక్టార్ అక్కడ అధికారం ఎవరి చేతిలో ఉందనే విషయమే మర్చిపోయినట్లు అనిపిస్తోంది" అని సింగపూర్ బిజినెస్ స్కూల్, ఇంటర్నేషనల్ బిజినెస్ ప్రొఫెసర్ మైకేల్ విట్ అన్నారు.

జాక్ మాకు కూడా అదే జరిగింది. ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆ తర్వాతే ఆయన కంపెనీకి సంబంధించిన ఐపీఓను అడ్డుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీదీ కంపెనీకి కూడా అదే జరిగింది. అది కూడా ప్రభుత్వ గైడ్‌లైన్స్ పాటించలేదు. ఈ కంపెనీలను శిక్షించకుండా వదలకూడదని ప్రభుత్వం భావించింది.

"ప్రభుత్వం కంపెనీలపై నియంత్రణ సాధించాలని కోరుకుంది. దానికి తగిన కారణాలు కూడా ఉండొచ్చు" అని అమెరికా థింక్‌టాంక్ పీటర్సన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ రీసెర్చర్ మార్టిన్ చోర్జెంపా అన్నారు.

"ప్రజల ప్రైవసీని కాపాడేలా డేటా సెక్యూరిటీ అమలయ్యేలా చూడడం, ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ వినియోగాన్ని పెరగడం వల్ల ముంచుకొచ్చే ముప్పుని నివారించడం వంటివి దీనికి కారణాలు కావచ్చు" అన్నారు.

చైనా

సాంకేతిక ఆధిపత్యం

"కానీ, మనం డేటా జాతీయీకరణ గురించి మాట్లాడుతున్నాం. కంపెనీలపై కఠిన నియమ నిబంధనలు అమలు చేయడం గురించి మాట్లాడుతున్నాం. అక్కడ ప్రైవేట్ కంపెనీల అభివృద్ధికి తక్కువ అవకాశం ఉంటే, అది అతిపెద్ద సమస్య కావచ్చు" అని మార్టిన్ అన్నారు

యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్‌, చైనీస్ లా సెంటర్ డైరెక్టర్ ఏంజెలా ఝాంగ్ దీనిని చారిత్రక కోణంలో వివరించే ప్రయత్నం చేశారు.

చైనా టెక్నాలజీ కంపెనీలు ఇప్పటివరకూ చాలా సౌకర్యవంతమైన వాతావరణంలో పనిచేస్తూ వచ్చాయి. కానీ, ఇప్పుడు ఆ కంపెనీలకు నియమ నిబంధనలు రూపొందించారు అన్నారామె.

"అమెరికా, యూరోపియన్ దేశాలు కూడా టెక్నాలజీ రంగంపై ఇలాగే తమ నియంత్రణను పెంచుకుంటున్నాయి" అని ఆమె చెప్పారు.

"కీలక రంగాల్లో ప్రపంచ ప్రమాణాలను నిర్దేశించేలా 'సాంకేతిక ఆధిపత్యం' సాధించడమే చైనా లక్ష్యం. అది సాధించడం వల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం పెరుగుతుంది" అని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నిపుణులు కేయూ జిన్ తెలిపారు.

ఫుడ్ డెలివరీ యాప్ కంపెనీ మెయితువాన్

విదేశీ కంపెనీలు చేరకుండా..

వినియోగదారులకు సేవలు అందించే ఈ-కామర్స్ లేదా టెక్నాలజీ కంపెనీలకు బదులు వ్యూహాత్మకంగా ఎక్కువ కీలకంగా భావిస్తున్న రంగాలు, అంటే క్వాంటమ్ కంప్యూటర్స్, సెమీ కండక్టర్, శాటిలైట్ సెక్టార్ అభివృద్ధికి ప్రభుత్వం ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది.

చైనా కంపెనీల్లో విదేశీ కంపెనీల చేరికను పరిమితం చేయాలని కూడా ప్రభుత్వం చూస్తోందని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు.

"చైనాలో జరుగుతున్న మార్పులను గమనిస్తే, టెక్నాలజీని అనుకరించే కాపీకాట్‌లు కూడా తమను తాము పులుల్లా చూపించుకోవాలనే కోరుకుంటున్నాయి" అని కన్సల్టెన్సీ ఫర్మ్ మార్కమ్ బర్న్‌స్టీన్ అండ్ పించక్(ఎంబీపీ) కో చైర్మన్ డ్రూ బర్న్‌స్టీన్ అన్నారు.

దీనితోపాటూ 2025 కోసం ప్రభుత్వ ప్రణాళిక కూడా ఒక అంశంగా మారింది. చైనా ప్రభుత్వం తమ ఆర్థికవ్యవస్థలో కీలక రంగాలపై నియమ నిబంధనలు అమలు చేయాలని కోరుకుంటోందని చెబుతున్నారు.

"కొత్త నియమ నిబంధనల పరిధి టెక్నాలజీ సెక్టార్‌ కంటే పెద్దదిగా ఉండబోతోంది. ఇందులో జాతీయ భద్రత, వాణిజ్య గుత్తాధిపత్యం లాంటి కోణాలు కూడా ఉంటాయి" అని సింగపూర్‌లో బీబీసీ బిజినెస్ ప్రతినిధి పీటర్ హాస్కిన్స్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
China: Why Jinping government is 'bothering' industrial giants like 'Jack Ma'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X