వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా: 'మాకు తినడానికి కూడా లేదు' - కంబోడియా రాజధానిలోని రెడ్ జోన్లలో ఇదీ పరిస్థితి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కంబోడియా రాజధానిలో ఓ రెడ్ జోన్లోని మహిళ

ఆగ్నేయాసియా దేశం కంబోడియా రాజధానిలో కోవిడ్ వ్యాప్తి అత్యంత తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో తమకు ఆహారం, సహాయం కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని అక్కడ నివసించే ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

రాజధాని పనమ్ పెన్‌లో రెడ్ జోన్లుగా పిలిచే ఈ ప్రాంతాల్లో ప్రభుత్వం లాక్‌డౌన్ అమలు చేస్తోంది.

సోమల్ రతానక్ క్యాషియర్‌గా పనిచేస్తుంటారు. రాజధానిలో ఆయన నివసించే ప్రాంతంలో ఏప్రిల్ 12న లాక్‌డౌన్ విధించారు. ఆయన జీతంలో చాలా వరకు అప్పటికే ఖర్చయిపోయింది. లాక్‌డౌన్ తర్వాత ఈ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. దీంతో ఉద్యోగం చేసుకోవడానికి కూడా ఆయన ఇల్లు విడిచి బయటకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఆయనకు పూట గడవడం కష్టంగా ఉంది.

ఈ నెల్లోనే ఇంతకుముందు బియ్యం, నూడిల్స్, సోయా సాస్, చేపమాంసంతో కూడిన ఒక సహాయ ప్యాకేజీని ప్రభుత్వం ఆయనకు అందించింది.

ఇలాంటి సహాయ ప్యాకేజీలు క్రమం తప్పకుండా రావడం లేదని, వీటిపై ఆధారపడలేకపోతున్నామని సోమల్ వాపోయారు. గతంలో తీసుకొనేదాని కన్నా చాలా తక్కువ ఆహారంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోందని విచారం వ్యక్తంచేశారు.

ఈ సమస్య సోమల్ ఒక్కరిదే కాదు. నగరంలో ఎంతో మంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. కఠినమైన ఆంక్షల అమలుతో లక్ష మందికి పైగా ప్రజలు ఇళ్లలోనే ఉండిపోవాల్సి వస్తోంది. వీళ్లకు ఆహార కొరత పెద్ద సమస్యగా మారింది. ఫిబ్రవరి చివరి నుంచి కరోనావైరస్ వ్యాప్తి తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వం ఈ ఆంక్షలను తీసుకొచ్చింది.

నిరుడు కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణకు కఠినమైన ఆంక్షలు అమలు చేయడం, కేసులు చాలా తక్కువగా నమోదు కావడంపై కంబోడియా ప్రశంసలు అందుకుంది. కానీ ఈసారి వ్యాప్తి తీవ్రంగానే ఉంది. రోజూ ఇంచుమించు 400 కొత్త కేసులు వస్తున్నాయి. మొత్తం కేసుల సంఖ్య దాదాపు 20 వేలుగా ఉంది. మరణాలు 131గా నమోదయ్యాయి.

కొంత మంది మాత్రం ఆహారం, ఔషధాల కోసం బయటకు రాగలిగారు. చాలా మంది గడప దాటలేకపోయారు.

ఆస్పత్రుల సామర్థ్యానికి మించి కేసులు వస్తుండటంతో ప్రభుత్వం స్టేడియాల్లో తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటు చేసింది. వైద్యసేవలు అవసరమైన కొందరిని ఇళ్లలోనే క్వారంటీన్‌లో ఉండాలని చెప్పింది.

దేశంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు ప్రజల కదలికలు, ప్రయాణాలపై ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించింది. జిల్లాస్థాయిలో లాక్‌డౌన్‌ అమలు చేస్తోంది.

రాజధానిలోని రెడ్ జోన్లలో లక్షా 20 వేల మంది ప్రజలు ఉన్నారని 'సెంటర్ ఫర్ అలయన్స్ ఆఫ్ లేబర్ అండ్ హ్యూమన్ రైట్స్(సెంట్రల్)’ అంచనా వేసింది. ఈ రెడ్ జోన్ల చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. సైనికులు కాపలా కాస్తున్నారు. ఇక్కడ ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాకూడదు. వస్తే అరెస్టు, జరిమానా తప్పవు. బయటకొస్తే హింసతో కూడిన చర్యలు కూడా తమపై ఉండొచ్చనే ఆందోళన స్థానికుల్లో ఉంది.

ఈ తీవ్రస్థాయి చర్యలను సహాయ సంస్థలు తప్పు బడుతున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.

ఒక్కో ఆఫీసర్ ఒక్కో రకమైన నిబంధనలు, క్రమశిక్షణా చర్యలు అమలు చేస్తున్నారు. స్థానికులకు స్పష్టమైన అవగాహన ఉండటం లేదు. కొంత మంది మాత్రం ఆహారం, ఔషధాల కోసం బయటకు రాగలిగారు. చాలా మంది గడప దాటలేకపోయారు.

ఈ రెడ్ జోన్లలో ఒకవైపు ధరలు 20 శాతం పెరిగాయని, మరోవైపు స్థానిక ప్రజల ఆదాయాలు తగ్గుతున్నాయని 'సెంట్రల్’ తెలిపింది.

రెడ్ జోన్లలోకి స్వచ్ఛంద సంస్థలను కూడా అనుమతించడం లేదు. దీంతో అవసరంలో ఉన్నవారికి అవి కూడా సాయం అందించే అవకాశం లేకుండా పోయింది.

ప్రభుత్వ స్పందన సరిగా లేదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిప్యూటీ రీజనల్ డైరెక్టర్ ఫర్ కాంపైన్స్ మింగ్ యు హాహ్ విమర్శించారు. ఉదాహరణకు రెడ్ జోన్లలోని జనాభాలో అతి కొద్ది మందికే ప్రభుత్వ సహాయ ప్యాకేజీ అందుతోంది.

రెడ్ జోన్లలో ధరలు 20 శాతం పెరిగాయి.

ఒక్కో కుటుంబానికి మూడు లక్షల రియల్స్ (5,400 రూపాయలు) సహాయం కింద చెల్లిస్తామని ప్రభుత్వం మొదట్లో ప్రచారం చేసింది. ఓ రెండు వారాలపాటు ఆహార అవసరాలకు ఇది సరిపోతుందని చెప్పింది. తర్వాత ప్రభుత్వం ఆర్థిక సహాయం కాకుండా నిత్యావసరాల ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ప్యాకేజీ విలువ మూడు లక్షల రియల్స్ కన్నా చాలా తక్కువనే విమర్శలు ఉన్నాయి.

ఇప్పటివరకు 20 వేల మందికి పైగా కుటుంబాలకు ఈ సహాయం అందించామని ప్రభుత్వం చెబుతోంది. కానీ సాయం కోసం వాళ్లు ఇంకా చాలా మంది ఉన్నారు.

తమ కుటుంబానికి ప్రభుత్వం నుంచి సాయం ఇంకా అందలేదని జూదశాల ఉద్యోగి అయిన ఛాయ్ బొరామీ ఆవేదన వ్యక్తంచేశారు. రెడ్ జోన్ ఆంక్షల వల్ల తమ కుటుంబంలో ముగ్గురు ఉపాధి కోల్పోయారని ఆమె తెలిపారు. అద్దె, విద్యుత్ చార్జీలు, రుణభారం మాత్రం తగ్గలేదని, పైగా ఆహార ధరలు పెరిగాయని గోడు వెళ్లబోసుకున్నారు.

ఛాయ్ బొరామీ కుటుంబంలో ఎనిమిది మంది ఉన్నారు.

ఏప్రిల్ ద్వితీయార్ధంలో స్టంగ్ మీంచీ జిల్లాలోని రెండు ప్రాంతాల్లో వందల మంది స్థానికులు తమ గ్రామాల్లో ఆహార కొరతను నిరసిస్తూ ఆందోళన ప్రారంభించారు. అయితే స్థానిక మీడియా, అధికారుల నుంచి వీరు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది ప్రతిపక్షాల పని అని కొట్టిపారేశారు.

ప్రభుత్వ సహాయ చర్యల్లో ఉదాసీనతకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్న లేదా క్షేత్రస్థాయిలో నిరసనలు చేపడుతున్న స్థానికులకు సాయం నిలిపేస్తామనే హెచ్చరికలు చేస్తున్నారనే సమాచారం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, స్వచ్ఛందంగా సేవలు అందించే ఇతర సంస్థలకు అందింది.

అయితే ప్రభుత్వం తీరు వల్ల వాళ్లలో భయం కంటే ఆకలి బాధే ఎక్కువగా ఉంది.

“నాకూ మాట్లాడాలంటే భయమేస్తోంది. కానీ నాకు తిండి లేదు, నేను నిరసన తెలపాల్సిందే” అని ఛాయ్ బొరామీ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Corona: 'We don't even have food' - this is the situation in the red zones of the Cambodian capital
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X