కరోనా: వైరస్ పుట్టుకపై మరో ట్విస్ట్.. చైనా ఎదురుదాడి.. తెరపైకి మిలటరీ వరల్డ్ గేమ్స్..
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాధిగ్రస్తుల సంఖ్య 25లక్షలకు చేరువైంది. మరణాలు 1.66లక్షలకు పెరిగాయి. మొత్తంగా 6.35 లక్షల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటికీ మోస్ట్ ఎఫెక్టెడ్ దేశంగా కొనసాగుతోన్న అమెరికాలో రికార్డు స్థాయిలో 7.64 లక్షల మందికి వైరస్ సోకగా, అందులో 40,565 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలో 23,660, స్పెయిన్ లో 20,852, ఫ్రాన్స్ లో 19,718, యూకేలో 16,060 మంది కన్నుమూశారు. చైనాలో కొత్త మరణాలు సంభవించకపోవడంతో సంఖ్య 4,632 దగ్గరే నిలిచింది. భూగోళాన్ని అతలాకుతలం చేస్తోన్న ఈ వైరస్ పుట్టుకపై మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.

పుట్టింది చైనాలో కాదు..
కరోనా వైరస్ విషయంలో మొదటి నుంచి నిజాలు దాస్తూ, ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టింది చైనానే అని అమెరికా సహా పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా సంస్థలు కొన్ని.. చైనాలోని వూహాన్ వైరాలజీ ల్యాబ్ లో వైరస్ తయారైందని చెబుతుంటే, మరికొన్ని మాత్రం అదే ల్యాబ్ ద్వారా పొరపాటున వైరస్ విస్తరించిందని పేర్కొన్నాయి. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో ఇప్పుడు చైనా ఎదురుదాడి మొదలుపెట్టింది. అసలు కరోనా వైరస్ చైనాలో పుట్టనేలేదని, దాని జస్మస్థలం అమెరికానే అనే కొత్త వాదన తెరపైకి తెచ్చింది.

అధికారిక టీవీలో..
చైనా ప్రభుత్వ ఆధీనంలోని చైనా సెంట్రల్ టెలివిజన్(సీసీటీవీ)కి అనుబంధంగా పనిచేసే చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్ వర్క్(సీజీటీఎన్) లో ఈ మేరకు ప్రసారమైన వార్త కథనమొకటి సంచలనం రేపుతున్నది. మిడిల్ ఈస్ట్ మీడియా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎంఈఎంఆర్ఐ) వెల్లడించిన వివరాల ప్రకారం.. సీజీటీఎన్ అరబిక్ న్యూస్ బులిటెన్ లో.. కరోనా వైరస్ పుట్టింది చైనాలో కాదు, అమెరికాలోనే అని, ఇందుకు తగిన ఆధారాలు చాలా లభ్యమయ్యాయ్యాయని చెప్పుకొచ్చారు. పుట్టింది అమెరికాలోనైనా, విస్తరించించి వూహాన్ లో కాబట్టి మొత్తం నేరాన్ని చైనాపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అందుకు సాక్ష్యంగా..

మిలటరీ వరల్డ్ గేమ్స్..
ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమచారం ప్రకారం వూహాన్ సిటీలో 2019 డిసెంబర్ లో కరోనా తొలికేసు నమోదైంది. కానీ అంతకంటే కొన్ని నెలల ముందే అమెరికాలో ఈ తరహా కేసులు నమోదైనప్పటికీ, వాటిని ‘ఫ్లూ' ఖాతాలో వేశారని, ఒకప్పుడు బయోవెపన్స్(జీవాయుధాల) కర్మాగారంగా ఉండిన ‘ఫోర్ట్ డెట్రిక్'(మేరీల్యాండ్) నుంచే కరోనా వైరస్ పుట్టిందని చైనీస్ కథనంలో పేర్కొన్నారు. గతేడాది అక్టోబర్ లో వూహాన్ సిటీలో జరిగి ‘మిలటరీ వరల్డ్ గేమ్స్'కు అమెరికాతోపాటు 170 దేశాల ప్రతినిధులు పాలుపంచుకున్నారని, ఆ సందర్భంలోనే అమెరికన్ సైనికుల ద్వారా వూహాన్ సిటీలోకి వైరస్ కొనితేబడిందని, అక్కడ జనసాంద్రత ఎక్కువగా ఉండటంతో అది వేగంగా వ్యాప్తి చెందిందని తెలిపారు.

అమెరికా ఆగ్రహం...
జపాన్ కు చెందిన అసాహి కార్పొరేషన్ కూడా కరోనా వైరస్ అమెరికాలోనే పుట్టిందని నిర్ధారించినట్లు సీజీటీఎన్ లో చెప్పారు. అయితే, తప్పులు కప్పిపుచ్చుకోడానికి చైనా ఆడుతోన్న నాటకంలో భాగంగానే ఈ తరహా కథనాలు వెలుగులోకి తెస్తున్నారని ప్రఖ్యాత ప్రఖ్యాత వాషింగ్టన్ పోస్ట్ లో కౌంటర్ కథనాలు వచ్చాయి. కరోనా విషయంలో చైనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న ప్రెసిడెంట్ ట్రంప్.. మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వూహాన్ లోని వైరాలజీ ల్యాబ్ ను పరిశీలించేందుకు అమెరికా బృందాల్ని అనుమతించాలని, ఈ మేరకు రిక్వెస్ట్ చేసినా జిన్ పింగ్ స్పందించడంలేదని ఆయన ఫైరయ్యారు.












Click it and Unblock the Notifications