షాక్: ఆ టీకాతో రక్తం గడ్డకడుతోంది -ఎనిమిది దేశాల్లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ నిలిపివేత, కలకలం
కరోనా మహమ్మారిపై పోరులో అగ్రభాగాన నిలిచిందనుకున్న వ్యాక్సిన్ కాస్తా ప్రమాదకారి అనే భయాలు వ్యాపించడంతో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. టీకాల తయారీలో ఫ్రంట్ రన్నర్ గా ఉండి, ప్రస్తుతం అత్యధికంగా అమ్ముడవుతోన్న వ్యాక్సిన్ గానూ ఉన్న 'ఆస్ట్రాజెనెకా కొవిడ్-19 వ్యాక్సిన్' సమర్థతపై అనుమానాలు తలెత్తాయి. స్విడిష్-బ్రిటిష్ సంస్థ అయిన ఆస్ట్రాజెనికా.. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, సీరం సంస్థతో కలిసి రూపొందించిన 'కొవిషీల్డ్' వ్యాక్సిన్ ను భారత్ లో విరివిగా వాడుతోన్న సమయంలోనే ఇతర దేశాల్లో ఈ తరహా పరిణామాలు చోటుచేసుకోవడం కలకలం రేపుతున్నది.
Recommended Video

రక్తం గడ్డకట్టుకుపోతోంది..
ఆస్ట్రాజెనెకా కొవిడ్-19 వ్యాక్సిన్ పై యూరప్ దేశాల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. రక్తం గడ్డకడుతున్నదన్న భయం కారణంగా ఆస్ట్రాజెనెకా కొవిడ్-19 వ్యాక్సిన్ ఇవ్వడాన్ని ఎనిమిది దేశాలు నిలిపివేశాయి. ఈ వ్యాక్సిన్ తీసుకున్న కొంతమంది తమ శరీరంలో రక్తం గడ్డకట్టిన ఆనవాళ్లు ఉన్నాయని ఫిర్యాదు చేయడంతో తాజాగా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డెన్మార్క్ ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది.

ఎనిమిది దేశాల్లో నిలిపివేత..
డెన్మార్క్ ఈ ప్రకటన చేసిన తర్వాత నార్వే, ఐస్ లాండ్ దేశాలూ ఆస్ట్రాజెనికా టీకాను తాత్కాలికంగా నిలిపేయగా, ఎస్టోనియా, లాత్వియా, లిథువేనియా, లక్సెంబర్గ్ దేశాలు కూడా తదుపరి బ్యాచ్ నుంచి వ్యాక్సిన్ల వాడకాన్ని నిలిపివేశాయి. ఆస్ట్రాజెనెకా కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టినట్లు నివేదికలు వచ్చినట్లు డానిష్ హెల్త్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. కానీ ఇది టీకా తీసుకోవడం వల్లనే జరిగి ఉండొచ్చన్న ఆధారాలేవీ లేవని పేర్కొన్నారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ 17 యూరోపియన్ దేశాలకు మిలియన్ డోసులకు పైగా పంపిణీ జరిగింది.

ఆ నర్సు మరణంతో కలకలం..
యాంటీ-కోవిడ్ డోసు అందుకున్న 49 రోజుల తర్వాత ఆస్ట్రియాలో ఒక నర్సు 'తీవ్రమైన రక్తం గడ్డకట్టిన సమస్యతో' మరణించిన తరువాత ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల వాడకంపై అనుమానాలు పెరిగాయి. ఆస్ట్రియాలో ఉపయోగించిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల బ్యాచ్.. నర్సు మరణానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని యూరప్ యొక్క ఔషధాల వాచ్‌డాగ్ ఈఎంఏ బుధవారం వెల్లడించింది. మార్చి 9 నాటికి యూరోపియన్ ఎకనామిక్ ఏరియాలో మూడు మిలియన్ల మందికి పైగా టీకాలు వేసిన వారిలో 22 రక్తం గడ్డకట్టినట్లు కేసులు వచ్చాయని ఈఎంఏ తెలిపింది. అయితే,

నిలిపివేత తాత్కాలికమే..
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వాడకాన్ని పూర్తిగా రద్దు చేయలేదని, కొన్నిరోజులపాటు ఈ వ్యాక్సిన్ వాడకాన్ని నిలిపివేస్తున్నట్లు డానిష్ హెల్త్ అథారిటీ డైరెక్టర్ సోరెన్ బ్రోస్ట్రోమ్ ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఇప్పటివరకు ఒకరు మరణించారని డెన్మార్క్ స్పష్టం చేసింది. ఈ మరణంపై ఈఎంఏ దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పుడు మొత్తం వయోజనులకు జూలై ఆరంభానికి బదులుగా ఆగస్టు మధ్య నాటికి టీకాలు వేయాలని ఆశిస్తున్నట్లు ఆరోగ్య అధికారులు పేర్కొంటున్నారు. కాగా, యూరప్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆస్ట్రాజెనెకా సంస్థ భారత్ లో తన భాగస్వామి సీరంతో కలిసి అభివృద్ది చేసిన కొవిషీల్డ్ విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చింది. కొవిషీల్డ్ పై ఇప్పటిదాకా ఎలాంటి ఫిర్యాదులు నమోదుకాలేదు.












Click it and Unblock the Notifications