డెన్వర్ జూలో హైనాలకు కరోనా .. ప్రపంచంలోనే తొలిసారి హైనాలకు సోకిన మహమ్మారి
కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచం మొత్తం అతలాకుతలమైన విషయం తెలిసిందే. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేశాయి. ఇదిలా ఉంటే ప్రపంచంలోనే తొలిసారిగా డెన్వర్ జంతుప్రదర్శనశాలలో ఉన్న హైనాలు కరోనా బారిన పడినట్టు తెలుస్తుంది. ఇప్పటికే అనేక చోట్ల పులులు, సింహాలకు కరోనా సోకినట్టు నిర్ధారణ కాగా , తాజాగా తొలిసారి హైనాలకు కరోనా వైరస్ సోకింది. డెన్వర్ జూ పార్క్ లోని రెండు హైనా లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. డెన్వర్ జూలో కరోనా సోకిన 2 హైనాలలో ఒక దాని పేరు కిబో కాగా మరొకటి ఎన్గోజీ, అని నేషనల్ వెటర్నరీ సర్వీసెస్ లాబొరేటరీస్ ప్రకటించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా హైనా జంతువులలో మొదట ధృవీకరించబడిన కేసులుగా పేర్కొంది.

డెన్వర్ జూలో కరోనా కలకలం
నేషనల్ వెటర్నరీ సర్వీసెస్ లాబొరేటరీస్ ప్రకారం, జంతుప్రదర్శనశాలలోని అనేక సింహాలు అనారోగ్యానికి గురయ్యాయి. దీంతో, జంతుప్రదర్శనశాలలోని వివిధ రకాల జంతువుల నమూనాలను, మచ్చల హైనాలతో సహా పరీక్షించబడ్డాయి. కొలరాడో స్టేట్ యూనివర్శిటీలోని ల్యాబ్‌లో హైనా నమూనాలు అనుమానాస్పదంగా ఉండటంతో వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక ఆ నమూనాలు కరోనా పాజిటివ్‌గా పరీక్షించబడ్డాయి . డెన్వర్ జూలో కరోనా కేసులను జాతీయ ల్యాబ్ ధృవీకరించింది. జంతుప్రదర్శనశాలలోని రెండు హైనాలతో పాటు 11 సింహాలు, రెండు పులులకు కూడా కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది.

హైనాలలో తొలిసారి కరోనా ..నిర్ధారించిన జూ వర్గాలు
హైనాలు ప్రసిద్ధి చెందిన కఠినమైన, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగల జంతువులు, ఇవి ఆంత్రాక్స్, రాబిస్ మరియు డిస్టెంపర్‌లను కూడా బాగా తట్టుకోగలవు. కానీ అవి కరోనా బారిన పడ్డాయని, ప్రస్తుతం అవి ఆరోగ్యంగా ఉన్నాయని, పూర్తిగా కోలుకుంటాయని ఆశిస్తున్నాము అని జూ ఒక ప్రకటనలో తెలిపింది. హైనాలు - 22 ఏళ్ల న్గోజీ మరియు 23 ఏళ్ల కిబో కొంత ముక్కు సమస్యతో, అప్పుడప్పుడు దగ్గుతో సహా తేలికపాటి లక్షణాలను అనుభవిస్తున్నాయని జూ అధికారులు తెలిపారు.

కరోనా బారిన పడిన జంతువులు కోలుకుంటున్నాయన్న జూపార్క్ వర్గాలు
ఇటీవలి వారాల్లో పాజిటివ్‌గా పరీక్షించిన ఇతర జంతువులు పూర్తిగా కోలుకున్నాయని, మరి కొన్ని జంతువులు కొన్ని కోలుకుంటున్నాయని వెల్లడించారు. నివేదికల ఆధారంగా అనేక ఇతర జాతులు కోవిడ్-19కి గురయ్యే అవకాశం ఉందని, 450 విభిన్న జాతులతో 3,000 జంతువులను రక్షించడం కోసం తాము అత్యధిక స్థాయి సంరక్షణ జాగ్రత్తలను ఉపయోగిస్తామని జూ పార్క్ వర్గాలు ప్రకటనలో పేర్కొన్నాయి. ఎన్వీఎస్ఎల్ పర్యవేక్షిస్తున్న యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా బహుళ జాతులలో అంటువ్యాధులు నివేదించబడ్డాయని పేర్కొంది.

జంతువుల నుండి మనుషులకు కరోనా వ్యాప్తి చాలా తక్కువ
ఎక్కువగా కోవిడ్-19 ఉన్న వ్యక్తితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న జంతువులలో కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ల గురించి శాస్త్రవేత్తలు ఇంకా అధ్యయనం చేస్తున్నారని, అయితే అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, జంతువుల నుండి, ప్రజలకు వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం తక్కువగా ఉందని జూ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే ఎన్వీఎస్ఎల్ అంతర్జాతీయ రిఫరెన్స్ ల్యాబ్‌గా పనిచేస్తుంది, విదేశీ మరియు అభివృద్ధి చెందుతున్న జంతు వ్యాధుల కోసం పరీక్షలను చెయ్యటమే కాకుండా రోగనిర్ధారణ పద్ధతులపై మార్గదర్శకత్వం అందిస్తుంది.












Click it and Unblock the Notifications