ఇజ్రాయెల్-ఇరాన్ సీజ్ ఫైర్ పై ట్రంప్ యూటర్న్-ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ కు షాక్..!
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దం మొదలై ఐదు రోజులు గడిచిపోయింది. రోజురోజుకూ యుద్దం తీవ్రమవుతోంది. ఇరాన్ లోని అణు స్థావరాలు, శాస్త్రవేత్తలే లక్ష్యంగా ఇజ్రాయెల్ మొదలుపెట్టిన ఈ పోరు అంతకంతకూ విస్తరిస్తోంది. దీంతో ఇరాన్ కూడా దీటుగా బదులిస్తోంది. అయితే ఇజ్రాయెల్ కోరుకున్న విధంగా ఇరాన్ లోని భూగర్భ అణుస్ధావరాల్ని ధ్వంసం చేసే పరిస్ధితి లేకపోవడంతో ఈ యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో అన్న టెన్షన్ పెరిగిపోతోంది.
ఈ నేపథ్యంలో కెనడాలో జీ7 సదస్సుకు హాజరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హఠాత్తుగా స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య సయోధ్య కుదిర్చేందుకే ట్రంప్ అలా హఠాత్తుగా తిరిగి వెళ్లిపోయారంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మన్యుయేల్ మ్యాక్రాన్ క్లారిటీ ఇచ్చారు. అంతకు ముందే ట్రంప్ గతంలో తాను భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పించానని, యుద్దం ఆపానని, ఇప్పుడు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కూడా అలాంటి అంగీకారం కుదురుస్తానని చెప్పడంతో ఫ్రాన్స్ అధినేత వ్యాఖ్యలు నిజమేనన్న చర్చ సాగింది.

అయితే స్వదేశానికి వెళ్లగానే ట్రంప్ రూటు మార్చేశారు. కెనడా నుంచి వాషింగ్టన్ డీసీకి చేరుకున్న ఆయన వెంటనే ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణపై చేసిన వ్యాఖ్యలపై తన సోషల్ మీడియా యాప్ ట్రూత్ సోషల్ లో స్పందించారు. మ్యాక్రాన్ తనను అపార్థం చేసుకున్నారని, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కాల్పుల విరమణకూ జీ7 సదస్సు నుంచి తాను అర్ధాంతరంగా వెళ్లిపోవడానికీ సంబంధం లేదని తేల్చిచెప్పేశారు. అంతే కాదు ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో అంతకు మించి పెద్దదే జరగబోతోదంటూ వెల్లడించారు. దీంతో టెహ్రాన్ పై దాడికి అమెరికా కూడా సిద్దమవుతోందన్న చర్చ సాగుతోంది.

ఇప్పటికే తమతో అణు ఒప్పందానికి రాకపోతే ఇరాన్ లో ఏమీ మిగలదంటూ హెచ్చరికలు చేస్తున్న ట్రంప్.. ఇప్పుడు ఇజ్రాయెల్ తో కలిసి ఆ దేశంలో అణు స్థావరాలపై దాడికి ప్లాన్ చేస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఎందకంటే ఇరాన్ లోని భూగర్భ బంకర్లను ధ్వంసం చేసే స్థాయి బాంబులు అమెరికా వద్దే ఉన్నాయి. దీంతో ఇజ్రాయెల్ కూడా అమెరికాను వాటిని వాడాలని కోరుతోంది.












Click it and Unblock the Notifications