ఇరాన్ పై ట్రంప్ బిగ్ యూటర్న్...! సంచలన నిర్ణయం..!
ఇరాన్ పై రెండు నెలల క్రితం ఏకపక్షంగా యుద్దం ప్రారంభించి, ఆ తర్వాత దాన్ని ఎలా ముగించాలో తెలియక ఇబ్బందులు పడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇప్పటికీ రోజుకో ప్రకటనతో గందరగోళం కొనసాగిస్తున్నారు. ఇరాన్ యుద్దం కొనసాగిస్తే ఓ సమస్య, అక్కడి నుంచి తప్పుకుంటే మరో సమస్య అన్నట్లుగా పరిస్ధితి తయారవడంతో తాజాగా రెండు వారాల పాటు సీజ్ ఫైర్ (కాల్పుల విరమణ) ప్రకటించిన ట్రంప్.. ఇవాళ దానిపైనా యూటర్న్ తీసుకున్నారు.
ఇరాన్ తమతో సానుకూల ఒప్పందం చేసుకోవాల్సిందేనని, సీజ్ ఫైర్ ఎట్టి పరిస్ధితుల్లోనూ పొడిగించబోమని, ఒప్పందం కుదరకపోతే ఆ దేశంపై తిరిగి భారీ యుద్దం తప్పదని హెచ్చరికలు చేస్తున్న ట్రంప్.. ఇవాళ సడన్ గా వెనక్కి తగ్గారు. ఇరాన్ తో సీజ్ ఫైర్ పొడిగిస్తున్నట్లు అనూహ్య ప్రకటన చేశారు. ఇవాళ రాత్రికి పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో అమెరికా-ఇరాన్ చర్చలు జరగనున్న వేళ ట్రంప్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే హార్ముజ్ జలసంధిపై దిగ్బంధం మాత్రం కొనసాగిస్తామన్నారు.

మధ్యవర్తి అయిన పాకిస్తాన్ చేసిన అభ్యర్థనను కారణంగా చూపుతూ.. ఇరాన్ తో రెండు వారాల కాల్పుల విరమణ గడువును ట్రంప్ నిరవధికంగా పొడిగించారు. అయితే టెహ్రాన్‌కు ప్రధాన సమస్యగా ఉన్న ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనం మాత్రం కొనసాగించాలని నిర్ణయించారు. ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా విచ్ఛిన్నమైందనే వాస్తవం ఆధారంగా, ఇది ఊహించినదే అని ట్రంప్ తెలిపారు. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌ల అభ్యర్థన మేరకు, వారి నాయకులు ,ప్రతినిధులు ఒక ఏకీకృత ప్రతిపాదనతో ముందుకు వచ్చేంత వరకు ఇరాన్ దేశంపై దాడిని నిలిపివేయమని తమను కోరినట్లు ట్రంప్ సోషల్ మీడియాలో తెలిపారు.

దిగ్బంధనాన్ని కొనసాగించాలని, అన్ని ఇతర విషయాలలోనూ సిద్ధంగా, సమర్థవంతంగా ఉండాలని సైన్యాన్ని ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు. అందువల్ల, ఇరాన్ ప్రతిపాదన సమర్పించేంత వరకు కాల్పుల విరమణను పొడిగిస్తానన్నారు. ట్రంప్ చివరి నిమిషంలో జోక్యం చేసుకోవడానికి ముందు, అసలు కాల్పుల విరమణ ఎప్పుడు ముగుస్తుందనే దానిపై స్పష్టత లేదు. మంగళవారం రాత్రికి ఇది ముగుస్తుందని పాకిస్తాన్ చెబుతోంది.












Click it and Unblock the Notifications