ఐక్యరాజ్య సమితికి ట్రంప్ గుడ్‌బై: నెక్స్ట్ టార్గెట్ అదే
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు కొనసాగుతూనే వస్తోంది. ఆ దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ వివిధ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్నారు. తన దైన శైలిలో పాలన సాగిస్తోన్నారు. అంతర్జాతీయ వేదికలనూ వదలట్లేదు.
ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే- ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి బయటికొచ్చారు. ఈ అత్యుత్తమ అంతర్జాతీయ వేదిక నుంచి అమెరికా వైదొలగడానికి ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేయడం కలకలం రేపింది. డబ్ల్యూహెచ్‌ఓకు నిధుల పంపిణీనీ నిలిపివేశారు.

ఫలితంగా- కోవిడ్ లాంటి ప్రాణాంతక మహమ్మారి వ్యాప్తి చెందినప్పుడు గానీ లేదా ఇతర అంటువ్యాధులు ప్రబలినపుడు అమెరికా నుంచి రావాల్సిన ప్రత్యేక నిధులు డబ్ల్యూహెచ్ఓకు అందవు. ఇంటర్నేషనల్ ఎయిడ్ అండ్ డిసీజ్ రెస్పాన్స్ గ్రూప్‌లో అమెరికా కీలక భాగస్వామిగా ఉంటోంది.
ఇప్పుడు తాజాగా ఐక్యరాజ్యసమితికీ డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు. ఐరాస మానవ హక్కుల సంఘం నుంచి బయటికి వచ్చారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఈ నిర్ణయం వల్ల మానవ హక్కుల సంఘానికి అమెరికా తరఫు నుంచి నిధుల కేటాయింపులు స్తంభించిపోతాయి.
ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉన్న రెండు సంఘాల నుంచి అమెరికా వైదొలగినట్టయింది. ఇందులో ఒకటి- మానవ హక్కుల సంఘం కాగా రెండోది- పాలస్తీనా శరణార్థుల కోసం ప్రత్యేకంగా యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ. ఈ రెండింట్లోనూ సుదీర్ఘకాలంగా సభ్యదేశంగా కొనసాగుతూ వస్తోంది అమెరికా. ఇప్పుడు వీటి నుంచి తప్పుకొంది.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో భేటీ సందర్భంగా ట్రంప్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. వీటితో పాటు ఐరాస ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) నుంచి కూడా వైదొలగే అవకాశాన్ని డొనాల్డ్ ట్రంప్ పరిశీలిస్తోన్నారని, దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ త్వరలో వెలువడొచ్చని వైట్ హౌస్ స్టాఫ్ సెక్రెటరీ విల్ ష్కార్ఫ్ చెప్పారు.












Click it and Unblock the Notifications