జాతిని ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ ప్రసంగం- మ్యాసివ్ స్టేట్ మెంట్..!!
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రతరమైంది. ఈ రెండు దేశాల మధ్య భీకర పోరు రోజురోజుకూ ముదురుతోంది.. కనివినీ ఎరుగని విధంగా ఉధృతమౌతోంది. వరుసగా 10 రోజూ దాడులు- ప్రతిదాడులతో అక్కడి నగరాలన్నీ కూడా అట్టుడికిపోతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ యుద్ధంలో అమెరికా అడుగు పెట్టింది. ఇరాన్ లోని మూడు అణ్వాయుధ కేంద్రాలపై వైమానిక దాడులు సాగించింది. ఇరాన్ అణు స్థావరాలు- ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ పై అమెరికన్ దళాలు దాడులు చేశాయి. ఇరాన్ అణు సామర్థ్యాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ దాడులు చేపట్టింది.

ఈ పరిస్థితుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈస్టర్న్ టైమ్ జోన్ ప్రకారం.. రాత్రి 10 గంటలకు ఆయన తెర మీదికి రానున్నారు. రాజధాని వాషింగ్టన్ లో గల తన అధికారిక నివాసం వైట్ హౌస్ నుంచి టీవీ ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఇరాన్ లో చేపట్టిన సైనిక చర్య గురించి దేశ ప్రజలకు వివరించనున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇజ్రాయెల్ కు మద్దతుగా ఇరాన్ పై అమెరికా ప్రత్యక్ష యుద్ధానికి సంబంధించిన అంశాలపై మాట్లాడనున్నారు. ఇరాన్ పై దాడులకు గల కారణాలను వివరించనున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్ పై దాడులను ఓ చారిత్రక ఘట్టంగా అభివర్ణించారాయన.
ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా వైమానిక దళం దాడులు సాగించిన కొద్ది సేపటికే డొనాల్డ్ ట్రంప్ నుంచి ఈ ప్రకటన వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగంలో ఇంకా ఎలాంటి నిర్ణయాలు, సైనిక చర్యలు ఉంటాయనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఈ దాడుల కోసం 2బీ2 బాంబర్ క్రాఫ్ట్ లను అమెరికా ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ తరహా వార్ ఎయిర్ క్రాఫ్ట్ లను అమెరికా ఉపయోగించడం ఇదే మొదటిసారి. 30,000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబుతో కూడిన అమెరికన్ స్టెల్త్ బాంబర్లు మాత్రమే ఫోర్డో వంటి అణు కేంద్రాలను ధ్వంసం చేయగలవని చెబుతున్నారు.
ఈ దాడుల పట్ల ఇరాన్ ఘాటుగా స్పందించింది. అణు కేంద్రాలపై దాడులకు తాము తీర్చుకునే ప్రతీకారం అత్యంత దారుణంగా ఉంటుందని హెచ్చరిస్తోంది. ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో అమెరికా జోక్యం చేసుకోవడం చాలా ప్రమాదకరమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications