ట్రంప్‌కు ఎదురుదెబ్బ, చైనా ముందు జాగ్రత్త, అక్కడ నో ట్విట్టర్.. మరెలా?

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: ఆసియా దేశాల పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వర్జీనియా రాష్ట్ర గవర్నర్ పదవి కోసం జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమిని చవిచూసింది.

మరోవైపు పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ దేశంలో కూడా కాలుమోపనుండడంతో చైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఉత్తరకొరియాకు తనకు మధ్య ఉన్న సంబంధాలు తెగిపోయాయని కలరింగ్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది.

ఫలించని ట్వీట్లు, రికార్డింగ్ సందేశాలు...

ఫలించని ట్వీట్లు, రికార్డింగ్ సందేశాలు...

అమెరికాలోని వర్జీనియా రాష్ట్ర గవర్నర్ పదవి కోసం జరిగిన ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీకి చెందిన లెఫ్టినెంట్ గవర్నర్ రాల్ఫ్ నార్తమ్ ఘనవిజయం సాధించడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు రిపబ్లికన్ల ఎత్తుగడలు, వ్యూహాలు ఫలించలేదు. రిపబ్లికన్ అభ్యర్థి గిలెస్పీకి ట్రంప్ మద్ధతు ప్రకటించారు. కానీ ప్రచారానికి వెళ్లలేదు. ఆసియా పర్యటనలో ఉన్న ఆయన గిలెస్పీకి మద్ధతుగా ట్వీట్లు, రికార్డింగ్ సందేశాలు పంపించారు. కానీ ఫలితం దక్కలేదు. ట్రంప్ కొనసాగిస్తున్న ఇమ్మిగ్రేషన్, గ్యాంగ్ క్రైమ్, స్వార్థపూరితమైన చర్యలనే ప్రచారంగా మార్చుకున్న నార్తమ్ ఈ ఎన్నికల్లో గెలుపొందారు.

ఆ పనులు ఆపేస్తే.. ఇప్పటికీ చర్చలకు సిద్ధం...

ఆ పనులు ఆపేస్తే.. ఇప్పటికీ చర్చలకు సిద్ధం...

తన పర్యటనలో భాగంగా దక్షిణకొరియా జాతీయ అసెంబ్లీలో ఆ దేశ చట్టసభ్యులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తూ.. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌కు సంచలన హెచ్చరిక జారీ చేశారు. అణ్వాయుధాల అభివృద్ధిని నిలిపివేయకపోతే కచ్చితంగా ముప్పును ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. కిమ్ జాంగ్ ఉన్ ఎన్ని నేరాలకు పాల్పడినా.. ఆయుధాల తయారీని పక్కనపెడితే దౌత్యపరమైన చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, మంచి భవిష్యత్తు ఉంటుందని ట్రంప్ హితవు పలికారు. అమెరికాను తక్కువ అంచనా వేయవద్దని, దాడి చెయ్యాలనే ఆలోచనను విరమించుకోవాలని ఘాటుగా స్పందించారు. ఉత్తరకొరియాపై సైనికచర్య తీసుకోవడం అమెరికాకు పెద్ద పనేమీ కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు.

చైనాకు బయలుదేరిన ట్రంప్...

చైనాకు బయలుదేరిన ట్రంప్...

మరోవైపు ఉత్తరకొరియా అణ్వాయుధాలను భూగర్భంలోనే ధ్వంసం చేయాలని అమెరికా భద్రతా దళాలు ప్రణాళికలు రచిస్తున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. కానీ ట్రంప్ మాత్రం దౌత్యపరమైన విధానం ద్వారానే సమస్యకు పరిష్కారం కనుగొనాలని భావిస్తున్నానని దక్షిణ కొరియా పర్యటనలో పునరుద్ఘాటించడం విశేషం. ఉత్తరకొరియాతో అణుదాడి సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడమే లక్ష్యంగా ఆసియా పర్యటనకు బయలుదేరిన ట్రంప్.. జపాన్, దక్షిణకొరియాల్లో తన పర్యటన ముగించుకుని ఇక చైనాలో అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు ట్రంప్ ఓ ట్వీట్ కూడా చేశారు. ‘దక్షిణకొరియా నుంచి చైనా బయలుదేరాను. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిసేందుకు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాను..' అని ఆ ట్వీట్ లో ఆయన పేర్కొన్నారు.

చైనా ముందు జాగ్రత్త చర్యలు...

చైనా ముందు జాగ్రత్త చర్యలు...

ఆసియాలో దేశాల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు చైనాలో కూడా పర్యటించనున్నారు. ఈ మేరకు వైట్‌హౌస్ ప్రకటించగానే చైనా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టిందని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. ముందుగా డాన్‌డాంగ్ అనే పట్టణం సరిహద్దులను చైనా మూసేసింది. ఎందుకంటే ఈ డాన్‌డాంగ్ అనేది ఉత్తరకొరియా సరిహద్దుల్లో ఉన్న చైనా పట్టణం. ఉత్తరకొరియాకు చెందిన కార్మికులు ఎక్కువ మంది పని కోసం ఈ పట్టణానికే వస్తుంటారు. అలాగే చైనా పర్యాటకులు, ఉత్తరకొరియా పర్యాటకులు ఈ పట్టణం ద్వారానే ఇరు దేశాల్లో పర్యటిస్తుంటారు. అటువంటి కీలక మార్గాన్ని చైనా టక్కున మూసేసింది. ఉత్తరకొరియాకు ఇంకా సాయం చేస్తూనే ఉన్నారని ట్రంప్ ఎక్కడ అనుకుంటారో అనేది చైనా భయం. ఉత్తరకొరియా విషయంలో తాము కూడా అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నామనే కలరింగ్ ట్రంప్ ముందు ఇచ్చేందుకే చైనా ఈ పని చేసిందని చెప్పుకుంటున్నారు.

చైనాలో నో ట్విట్టర్.. మరెలా?

చైనాలో నో ట్విట్టర్.. మరెలా?

చైనా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక విషయం మర్చిపోయినట్లున్నారు. ఎప్పటికప్పుడు తాను చేసే పనులను, తన ఆలోచనలను ట్విట్టర్ వేదికగా పంచుకోవడం అమెరికా అధ్యక్షుడికి అలవాటు. కానీ ఇప్పుడు ఆసియా పర్యటనలో దానికి బ్రేక్ పడనుంది. ఎందుకంటే, చైనా లో ట్విట్టర్ పనిచేయదు. ఫేస్‌బుక్, ట్వీట్టర్, వాట్సాప్ మొదలైన సామాజిక మాధ్యమలను చైనా ప్రభుత్వం 2009లోనే బ్యాన్ చేసింది. దక్షిణ కొరియా పర్యటన అనంతరం చైనాలో అడుగుపెట్టనున్న ట్రంప్.. చైనాలో ఉన్నంతకాలం ట్విట్టర్ గురించి మర్చిపోవలసిందే అని నిపుణులు అంటున్నారు. ఫలితంగా అమెరికా అధ్యక్షుడిని ట్వీట్టర్‌లో ఫాలో అవుతున్న 42 లక్షల మందికి ఆయన గురించి తాజా వార్తలు తెలియకుండా పోతాయని స్వయంగా అమెరికా మీడియానే చెబుతోంది. మరి ట్రంప్ కోసమైనా చైనా అధినేతలు ట్విట్టర్ పై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తేస్తారేమో చూడాలి.

అదే ధీమాలో ఉత్తరకొరియా...

అదే ధీమాలో ఉత్తరకొరియా...

అమెరికా, ఉత్తరకొరియాల మధ్య యుద్ధ వాతావరణం స్పష్టంగా కనపడుతోందని, ట్రంప్ ఆసియా పర్యటనలోనే ఈ విషయంపై స్పష్టమైన సంకేతాలు ప్రపంచానికి అందుతాయని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఈ వాదనకు బలం చేకూర్చుతూ ఉత్తరకొరియా ప్రొఫెసర్ డాక్టర్ లియోనిడ్ పెట్రోవ్ మాట్లాడారు. చైనా తప్పకుండా మూడో ప్రపంచ యుద్ధంలో పాల్గొంటుందని ఆయన వ్యాఖ్యానించారు. నిజానికి అమెరికా, చైనాల మధ్య బంధం బలపడుతోందని, అయినా సరే యుద్ధ సమయానికి తప్పకుండా చైనా ఉత్తరకొరియాకే మద్దతు పలుకుతుందనేది ఆయన భావన. అంతేకాదు, అమెరికా వద్ద అత్యాధునిక ఆయుధాలు, సైనిక బలం ఎంత ఎక్కువగా ఉన్నా యుద్ధంలో విజయం మాత్రం తమదేనని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ చైనా, అమెరికాకు మద్దతు పలికితే తప్పకుండా మూడో ప్రపంచ యుద్ధంలో ప్రాంతీయ అశాంతి రేగుతుందని చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా చైనా, ఉత్తరకొరియా ప్రజల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయని, పశ్చిమ దేశాలతో స్నేహన్ని చైనా ప్రజలు ఎంతమాత్రం ఇష్టపడారని కూడా ఆయన అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The race for Virginia governor on Tuesday night wasn't very close. And Republicans have Donald Trump to blame for it. In key areas of Virginia Republicanism - the suburbs of Richmond and the exurbs of Washington, DC - Republican Ed Gillespie ran far behind recent past GOP gubernatorial nominees and even behind Trump himself.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి