సిరియాలో మరోసారి నరమేధం.. 37 మంది సజీవ దహనం
డమాస్కస్: సిరియాలో నరమేధానికి అడ్డుకట్ట పడడం లేదు. ఉగ్రవాద శక్తుల అణచివేత చర్యల్లో భాగంగా సిరియాలోని తూర్పు ఘౌటాలో రష్యన్ దళాలు చేసిన బాంబు దాడిలో బంకర్ పేలి 37 మంది సాధారణ పౌరులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో వందలాది మంది గాయపడ్డారు.
చెల్లాచెదురైన మృతదేహాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటనాస్థలిలోని దృశ్యాలు హృదయ విదారకరంగా ఉన్నాయి. ఈ బాంబు దాడికి సంబంధించిన ఘటనకు సంబంధించిన ఫోటోలను 'సిరియా పౌర రక్షణ దళం' మీడియాకు విడుదల చేసింది.

కొంత మంది సాధారణ పౌరులు కలసి ఈ రక్షణ దళాన్ని ఏర్పాటు చేసుకున్నారు. బాంబు దాడి వార్త తెలిసిన వెంటనే పౌర రక్షణ దళం సభ్యులు హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఈ దాడిలో నిషేధిత వైట్ ఫాస్పరస్ బాంబును ఉపయోగించినట్లు తెలుస్తోంది. దీంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. పూర్తిగా తగలబడిపోయిన శరీరాలు, ముక్కలుగా ఎగిరిపడ్డ శరీర భాగాలతో కనిపిస్తున్న ఫొటోలు చూస్తే గుండె తరుక్కుపోతుంది. అయితే.. తూర్పు ఘౌటా బాంబు దాడి ఘటనలో తమ భద్రతా దళాల ప్రమేయం లేదని రష్యా ప్రకటించింది.
సిరియాలో నరమేధం ఏ స్థాయిలో సాగుతోందో ఈ విషాద దృశ్యాలు ప్రపంచానికి మరోసారి చాటిచెబుతున్నాయి. 2011లో సిరియా అంతర్యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ 3,50,000 మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి అంతకంటే అధిక సంఖ్యలోనే ప్రజలు మరణించారని పౌర హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి.












Click it and Unblock the Notifications