అమెరికా చేయి దాటి పోయింది: వ్యాక్సిన్ ఉన్నా కరోనా నిర్మూలన అసాధ్యం: బిడెన్‌కు వార్నింగ్: ఫాసీ
వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిపై అమెరికాకు ప్రఖ్యాత ఫిజీషియన్, ఇమ్యునాలజిస్ట్ డాక్టర్ ఆంథోనీ ఫాసీ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితులు చేయి దాటి పోయాయని చెప్పారు. కరోనా వైరస్ మహమ్మారిని అదుపు చేయడం అసాధ్యమని తేల్చి చెప్పారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా దాన్ని నిర్మూలించడం కష్టసాధ్యమేనని అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు.

వెబినార్‌లో కీలక అంశాలు..
దాని తరువాత కూడా పరిస్థితుల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అన్నారు. ఛాత్తమ్ హౌస్ నిర్వహించిన ఓ వెబినార్‌లో ఫాసీ మాట్లాడారు. అమెరికా ప్రభుత్వానికి ఆయన కరోనా వైరస్ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కరోనా స్థితిగతులు, కరోనా పరిస్థితుల్లో అమెరికా గమనం ఎలా ఉంటుందనే అంశాలపై మాట్లాడారు. కరోనా వైరస్‌ను రూపుమాపడానికి కొత్త అధ్యక్షుడు జో బిడెన్ ఎలాంటి ముందస్తు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటారనే విషయాలను ప్రస్తావించారు.

రెండున్నర లక్షలకు చేరువగా
ప్రస్తుతం అమెరికాలో కోటికి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1,08,73,936 కేసులు అమెరికాలో ఉన్నాయి. వైరస్ బారిన పడి ఇప్పటిదాకా 2,48,585 మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచంలోనే అత్యధిక మరణాలు, పాజిటివ్ కేసులను నమోదు చేసింది అమెరికా. అమెరికాలో కరోనా వైరస్ పూర్తిగా కట్టుతప్పిందని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో అధ్యక్ష స్థానంలో ఎవ్వరు ఉన్నా ఏమీ చేయలేరని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఫాసీ అన్నారు. `హెల్ప్ ఈజ్ ఆన్ ద వే` లో ఉందని ఆయన కరోనా వైరస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

పోరాటాన్ని కొనసాగించాల్సిందే..
వ్యాక్సిన్ వచ్చిందని ఊపిరి పీల్చుకోవద్దని హెచ్చరించారు. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ.. కొంత వరకు మాత్రమే దాని ప్రభావం ఉంటుందని, వైరస్‌ను ఏ మాత్రం తుడిచి పెట్టేయలేదని కుండబద్దలు కొట్టారు. వ్యాక్సిన్ వచ్చిన తరువాత కూడా కరోనాపై ప్రతి ఒక్కరూ తమ పోరాటాన్ని యధాతథంగా కొనసాగించాల్సి ఉంటుందని, అస్త్రసన్యానం చేయొద్దని సూచించారు. కరోనా ఇన్‌ఫెక్షన్‌పై తాము రూపొందించిన వ్యాక్సిన్ 90 శాతం ఫలితాలను ఇచ్చిందంటూ అమెరికాకు చెందిన ఫైజర్, బయో ఎన్ టెక్ ప్రకటించిన మూడు రోజుల తరువాత ఫాసీ.. ఈ కామెంట్స్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఏప్రిల్ నాటికి వ్యాక్సిన్..
వ్యాక్సిన్ వస్తోందనే సంకేతాలను ఆయన సమర్థించారు. ఏప్రిల్ నాటికి వస్తుందని చెప్పారు. వాటి పనితీరు 60 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వైరస్ ప్రతి ఒక్కరినీ సోకే ప్రమాదం ఉందని, దాన్ని నిర్మూలించడం సాధ్యం కాకపోవచ్చని చెప్పారు. భవిష్యత్తును గడ్డు పరిస్థితుల మధ్యే కొనసాగించాల్సిన రోజులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు డాక్టర్ ఆంథోనీ ఫాసీ అన్నారు. సాధారణ పరిస్థితులు ఎప్పుడు ఏర్పడతాయనేది ఇప్పట్లో చెప్పలేమని ఆయన స్పష్టంం చేశారు.












Click it and Unblock the Notifications