కరోనా దెబ్బకు ఏకంగా పెళ్లిని రద్దు చేసుకున్న ప్రధానమంత్రి
వెల్లింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలియజేసే ఉదంతం ఇది. ఈ మహమ్మారి వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అన్ని దేశాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తోన్నాయి. నైట్ కర్ఫ్యూలను విధించాయి. భౌతిక దూరాన్ని పాటించడానికి సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, మల్టీ ప్లెక్స్‌లల్లో 50 శాతం సీట్ల సామర్థ్యానికి మాత్రమే అనుమతించాయి. పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు హాజరయ్యే వారి సంఖ్యను కూడా పరిమితం చేశాయి.
ఇవే ఆంక్షలు- స్వయంగా ఓ దేశ ప్రధానమంత్రి పెళ్లిని అడ్డుకున్నాయి. కఠిన ఆంక్షలను అమలు చేస్తోన్నందున వాటిని కాదని ఆ ప్రధాని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. ఏకంగా వివాహ మహోత్సవాన్ని రద్దు చేసుకున్నారు. ఆమె- న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్. కరోనా, ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు న్యజిలాండ్‌ను వణికిస్తోన్నాయి. దీన్ని నివారించడానికి ఇవ్వాళ్టి నుంచి న్యూజిలాండ్‌లో కఠిన ఆంక్షలను విధించింది ఆ దేశ ప్రభుత్వం. ఇవ్వాళ్లి అర్ధరాత్రి నుంచి అవి అమల్లోకి వచ్చాయి.

ఈ విషయాన్ని ప్రకటించడానికి జసిండా ఆర్డెర్న్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి కరోనా ఆంక్షలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు 100 మంది మాత్రమే హాజరు కావాల్సి ఉంటుందని, వారు కూడా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని ఉండాలని పేర్కొన్నారు. ఆంక్షల నడుమ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడని వారు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాను అదే పని చేశానని వెల్లడించారు.
తన పెళ్లిని తాత్కాలికంగా రద్దు చేసుకున్నానని జసిండా తెలిపారు. కోట్లాదిమంది న్యూజిలాండర్లతో పాటు తానూ ఓ సామాన్యురాలినేనని, వారికంటే తానేమీ భిన్నం కాదని స్పష్టం చేశారు. అందుకే- తన పెళ్లిని రద్దు చేసుకున్నానని చెప్పారు. చాలాకాలంగా జసిండా.. క్లార్గ్ గేఫోర్డ్‌తో సహజీవనం చేస్తోన్నారు. త్వరలోనే తాను ఆయనను పెళ్లి చేసుకోబోతున్నానంటూ ఇటీవలే ప్రకటించారు. వివాహ తేదీని వెల్లడించలేదు. కరోనా ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని పెళ్లిని రద్దు చేసుకున్నానని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications