
ముదిరిన రాజకీయ సంక్షోభం - బోరిస్ కు వ్యతిరేకంగా : పదవి వీడేదే లేదు - ప్రధాని..!!
బ్రిటన్ లో రాజకీయ సంక్షోభం గంట గంటకు తీవ్ర రూపం దాల్చుతోంది. జాన్సన్ ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకుంది. మొత్తం 15 మంది మంత్రులు రాజీనామా చేసారు. ప్రధాని పదవి నుంచి బోరిస్ జాన్సన్ వైదొలగాలనే డిమాండ్ కు మద్దతు పెరుగుతోది. అయితే, రాజీనామా డిమాండ్ కు ప్రధాని ససేమిరా అంటున్నారు. తాను ప్రదాని పదవిని వీడేది లేదని ప్రధాని స్పష్టం చేసారు. ఇద్దరు కేబినెట్ మంత్రుల రాజీనామాతో మొదలై ఇప్పుడు మరో 15 మంది మంత్రులు వారితో జత కలిశారు. దౌత్యాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా వరుస పెట్టి రాజీనామాలు చేస్తున్నారు.
ప్రభుత్వాన్ని వీడిన వారందరి సంఖ్య 40కి చేరింది. దుష్ప్రవర్తన ఆరోపణలున్న క్రిస్ పించర్ వ్యవహారం తెలిసినా కీలక పదవిలో నియమించడంతో వివారదం మొదలైంది. ప్రధాని బోరిస్ జాన్సన్ పార్లమెంటులోని ప్రతినిధుల సభలో జరిగిన ప్రశ్నావళి కార్యక్రమంలో మాట్లాడారు. ప్రధాని పదవి నుంచి వైదొలగాలన్న మంత్రులు, స్వపక్ష, విపక్ష ఎంపీల డిమాండ్ ను తోసిపుచ్చారు. దేశాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు. కరోనా తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో ప్రధాని తన అధికార నివాసంలో విందులో పాల్గొనటం పెద్ద ఎత్తున విమర్శలకు కారణమైంది.

దీంతో..ఆయన పలు సందర్భాల్లో ప్రజలకు - పార్లమెంట్ కు క్షమాపణలు చెప్పారు. గతంలో అవిశ్వాస పరీక్ష నుంచి బయటపడ్డారు. కన్జర్వేటివ్ ఎంపీలు వ్యతిరేకంగా ఓటేసినప్పటికీ పదవీ గండం నుంచి గట్టెక్కారు. పించర్ నడవడిక గురించి తెలిసినా ప్రాధాన్యం గల ప్రభుత్వ పదవిలో నియమించారన్నది బోరిస్ పైన ప్రధాన ఆరోపణ. ప్రస్తతు పరిస్థితుల్లో ప్రధానిగా బోరిస్ కొనసాగుతారా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. గత నెలలోనే ప్రధాని అవిశ్వాస తీర్మానం ఎదుర్కొని ఉండటంతో.. మరో ఏడాది కాలం వరకూ ఆయన పైన అవిశ్వాసం ప్రతిపాదించే అవకాశాలు లేవని చెబుతున్నారు.
ఈ నిబంధనలకు సవరణ చేస్తేనే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు అవకాశం ఏర్పడుతుంది. నెల రోజుల క్రితం జరిగిన పార్లమెంటరీ స్థానాల ఉప ఎన్నికల్లో కన్జర్వేటివ్ అభ్యర్ధులు ఓడిపోయారు. బోరిస్ ప్రభుత్వం మునిగిపోయే ఓడగా విశ్లేషణలు మొదలయ్యాయి. దీంతో.. బోరిస్ ఏ రకంగా ఈ సంక్షోభం నుంచి బయట పడతారనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది.