కాబూల్ అప్ డేట్-మళ్లీ విమానాల రాకపోకలు ప్రారంభం-తరలింపులకు అడ్డంకులు
ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల దురాక్రమణ తర్వాత మారిన పరిస్దితుల్లో కాబూల్ ఎయిర్ పోర్టు రణరంగంగా మారింది. నిన్న జరిగిన రెండు ఆత్మాహుతి బాంబు దాడుల్లో దాదాపు 100కి పైగా మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో కాబూల్ ఎయిర్ పోర్టుకు తమ పౌరుల్ని తీసుకొచ్చేందుకు భారత్ సహా చాలా దేశాలు వెనుకాడుతున్నాయి.
నిన్న వరుస బాంబుదాడులతో అట్టుడికిన కాబూల్ ఎయిర్ పోర్టులో ఇప్పుడిప్పుడే పరిస్దితులు కుదుట పడుతున్నాయి. బాంబుదాడులతో భయాందోళనకు గురైన పౌరులు, అధికారులు, విమానాశ్రయ సిబ్బంది క్రమంగా కోలుకుంటున్నారు. ఇదే క్రమంలో బాంబుదాడులతో నిలిచిపోయిన తరలింపుల ప్రక్రియను వివిధ దేశాలు పునరుద్ధరించాయి. కాబూల్ ఎయిర్ పోర్టులో విదేశీ విమానాలు ల్యాండ్ అవుతున్నాయి. అయితే మరికొన్ని దేశాలు మాత్రం తరలింపులకు బ్రేకే వేసేశాయి.

కాబూల్ ఎయిర్ పోర్టులో దాడులపై ముందే హెచ్చరించిన అమెరికా.. అనుకున్నంత పనీ జరగడంతో ఇప్పుడు ఆగస్టు 31 డెడ్ లైన్ పై దృష్టిసారించింది. డెడ్ లైన్ ముగింపులోపు కాబూల్ ఎయిర్ పోర్టులో మరిన్ని దాడులు జరగవచ్చని అమెరికా బలగాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దీంతో పలు దేశాలు తమ పౌరుల్ని సాధ్యమైనంత త్వరగా అక్కడి నుంచి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. మరోవైపు కాబూల్ నుంచి తరలింపుల ప్రక్రియ ముగిసిందని స్పెయిల్ ప్రకటించింది. ఇప్పటికే తమ దేశానికి చెందిన పౌరులు, అధికారులు, దౌత్య సిబ్బంది కలిపి 81 మందిని దుబాయ్ తరలించిన స్పెయిన్.. అక్కడి నుంచి స్వదేశానికి వారిని తరలించే ప్రయత్నాల్లో ఉంది.
అటు పాకిస్తాన్ కూడా తరలింపు చేపడుతున్న దేశాలకు సాయం చేసేందుకు ముందుకొస్తోంది. ఆప్ఘనిస్తాన్ నుంచి తరలింపుల్లో భాగంగా కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరే వారికి తమ దేశంలోని హోటళ్లలో తాత్కాలిక బస కల్పించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం హోటళ్లలో ఉన్న గెస్టుల్ని అలాగే కొనసాగించేందుకు వీలు కల్పిస్తూనే.. విదేశీయులు మినహా ఇతరులకు రూమ్ లు ఇవ్వొద్దని హోటళ్లకు ఆదేశాలు ఇచ్చింది. ఆప్ఘనిస్తాన్ నుంచి ఇస్లామాబాద్ మీదుగా స్వదేశాలకు వెళ్లే విదేశీయులకు మాత్రమే హోటళ్లలో బసకు అవకాశమిస్తోంది.












Click it and Unblock the Notifications