కరోనా వైరస్.. అమెరికాపై చైనా సంచలన ఆరోపణలు.. అందులో నిజమెంత..?
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మూలాలపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రపంచం దృష్టిలో అది చైనాలోని వుహాన్ నగరం నుంచి పుట్టుకొచ్చిన వైరస్. మొదట అది చైనా మొదలుపెట్టిన బయో వార్ అన్న ప్రచారమూ జరిగింది. పలు కుట్ర కోణాలతో సంచలనాత్మక కథనాలు కూడ వచ్చాయి. ఇప్పటికైతే కరోనా వైరస్.. పుట్టు మూలం ఏంటన్నది ఎక్కడా నిర్దారణ కాలేదు. ఈ నేపథ్యంలో చైనా చేసిన సంచలన ఆరోపణలు షాక్‌కి గురిచేస్తున్నాయి. ఇంతకీ చైనా ఏమంటోంది...

అమెరికా కుట్ర దాగుందన్న చైనా
చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి వెనుక అమెరికన్ ఆర్మీ కుట్ర దాగుందని చైనా విదేశాంగ ప్రతినిధి జావో లిజియన్ ఆరోపించారు. దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు బయటపెట్టనప్పటికీ.. ట్విట్టర్‌లో వరుస ట్వీట్లతో ఆయన అమెరికాపై కుట్ర ఆరోపణలు చేశారు. గతేడాది అక్టోబర్‌లో అమెరికన్ ఆర్మీ చైనాలో వైరస్ వ్యాపింపజేసిందని.. దీనంతటికీ వారిదే బాధ్యత అని ఆరోపించారు. కరోనా వైరస్ వ్యవహారంలో చైనా విదేశాంగ ప్రతినిధి చేసిన ఈ ఆరోపణలు ప్రపంచాన్ని మరింత ఆందోళనపరిచేవిగా మారాయి. ప్రపంచ దేశాలన్నీ సమన్వయంతో కరోనాపై యుద్దం చేయాల్సిన సమయంలో రెండు అగ్ర దేశాలు పరస్పర ఆరోపణలు చేసుకోవడం కలవరపెట్టేదిగా మారింది.

వుహాన్ వైరస్‌గా పిలుస్తోన్న అమెరికా.. ఎందుకంటే..
కరోనా వైరస్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కోవిడ్-19 అనే అధికారిక పేరును ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దాదాపుగా ప్రపంచ మీడియా అంతా ఇదే పేరుతో కథనాలు రాస్తోంది. కానీ అమెరికన్లు మాత్రం ఇప్పటికీ దాన్ని వుహాన్ వైరస్ లేదా చైనీస్ వైరస్ అని వ్యవహరిస్తున్నారు. ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,ఆ దేశ విదేశాంగ ప్రతినిధి మైక్ పాంపియో సైతం కోవిడ్-19ని వుహాన్ వైరస్‌గా పేర్కొంటున్నారు. అయితే ఇందుకు అమెరికన్లు చెబుతున్న కారణమేంటంటే.. తమ దేశంపై చైనా నిరాధార ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో.. ఆ వైరస్ చైనా నుంచే పుట్టుకొచ్చిందని చెప్పడానికి అలాంటి పేర్లను వాడుతున్నట్టు చెబుతున్నారు.

గతేడాది వుహాన్ వెళ్లిన అమెరికన్ మిలటరీ
కరోనా వైరస్ విషయంలో చైనా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే అమెరికాపై ఆరోపణలు చేస్తోందన్న వాదన కూడా వినిపిస్తోంది. వైరస్ నియంత్రణలో అక్కడి ప్రభుత్వం విఫలమైందని ప్రజలు భావిస్తుండటంతో.. దాని నుంచి దృష్టి మళ్లించేందుకే అమెరికాను అడ్డుపెట్టుకునే ప్రయత్నం చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. గతేడాది అక్టోబర్‌లో వరల్డ్ మిలటరీ గేమ్స్‌లో భాగంగా అమెరికన్ మిలటరీకి చెందిన ఉన్నతాధికారులు,17 బృందాలు,280 మంది ఆటగాళ్లు చైనాలోని వుహాన్ పట్టణాన్ని సందర్శించారు. అయితే ఆ సమయంలో వారు వైరస్‌ను వెంటపెట్టుకొచ్చారనేది చైనా ఆరోపణ. కానీ ఇప్పటివరకు దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు బయటపడలేదు.
Recommended Video


చైనా తీరును తప్పు పడుతున్న అమెరికా
అమెరికా లాంటి పశ్చిమ దేశాలను నిందించడానికి, సిఐఏపై బురద జల్లడానికి చైనీస్ సోషల్ మీడియా 'వి చాట్' సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో దుష్ప్రచారం జరుగుతోందని అమెరికా అధికారులు ఆరోపించారు. వైరస్ పట్ల చైనా స్పందిస్తున్న తీరు.. పశ్చిమ దేశాల కంటే తమ ప్రభుత్వం గొప్పదని చెప్పుకునే రీతిలో సాగుతోందని ఆరోపించారు. సమస్యకు మూలాలు,నియంత్రణ మార్గాలు వెతకడం మానేసి ఇలా కుట్ర కోణాలతో ఆరోపణలు చేసుకోవడం అత్యంత ప్రమాదకరమని అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications