Coronavirus : కరోనాకు విరుగుడు.. అమెరికా క్లినికల్ ట్రయల్స్ ఏం చెబుతున్నాయి..
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌కు ఇప్పటివరకు విరుగుడు కనిపెట్టకపోవడంతో..రోజురోజుకు అది వ్యాప్తి చెందుతూనే ఉంది. 80కి పైగా దేశాల్లో కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కరోనాను ఎదుర్కొనేందుకు రోగ నిరోధక శక్తిని పెంచే వ్యాక్సిన్ తయారీ కోసం అమెరికా ప్రయోగాత్మకంగా క్లినికల్ ట్రయల్స్ మొదలుపెట్టనుంది. ఇందుకోసం స్వచ్చందంగా ముందుకు వచ్చే ఆరోగ్యవంతులైన వ్యక్తులపై క్లినికల్ ట్రయల్స్ చేయనుంది. బయోటెక్నాలజీ సంస్థ మోడెర్నా థెరప్యూటిక్స్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను మొదట ఫిబ్రవరి 24 న మేరీల్యాండ్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (NIAID)కు పంపినట్లు 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' వెల్లడించింది.

ఏప్రిల్ చివరి నాటికి క్లినికల్ ట్రయల్స్
ఏప్రిల్ చివరి నాటికి క్లినికల్ ట్రయల్ ప్రారంభించాలని భావిస్తున్నారు. కైజర్ పర్మనెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ క్లినికల్ ట్రయల్స్‌కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తోందని ఎన్ఐఏఐడీ డైరెక్టర్ ఆంటోనీ ఫౌసీ ది వాల్ స్ట్రీట్ జర్నల్‌కు చెప్పారు. మొదటి దశలో 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్కులైన స్వచ్చంద వలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ చేయనున్నట్టు తెలిపారు. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందా లేదా.. అలాగే దానివల్ల ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అన్నది పరీక్షించనున్నట్టు చెప్పారు.

విరుగుడు కాదు రోగ నిరోధక శక్తిని పెంచేందుకే..
మీజిల్స్ వంటి ఇతర వైరస్ల కోసం అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ల మాదిరిగా.. ఈ వ్యాక్సిన్‌తో కరోనా వైరస్‌ను నియంత్రించడం లేదా నిరోధించడం సాధ్యపడదని కైజర్ పర్మెనెంటే తెలిపింది. వైరస్ శరీరంలోని ఆయా భాగాల్లోకి చేరకుండా కణజాలం చుట్టూ ప్రోటీన్‌ను నిర్మించడానికి ఉపయోగపడుతుందని వెల్లడించింది. ఇది కృత్రిమంగా నిర్మించే ఆర్ఎన్ఏ,ఎంఆర్ఎన్ఏ ప్రోటీన్లు వైరస్‌ను దరిచేరకుండా అడ్డుకుంటాయని తెలిపింది. ఈ కృత్రిమ కణజాలం వల్ల శరీరంలోని రోగ నిరోధక శక్తి కూడా ఉత్తేజితం అవుతుందని పేర్కొంది.

ఒక్కో వలంటీర్‌పై 11సార్లు పరిశోధన..
ఎంపిక చేసే వలంటీర్లను మూడు వేర్వేరు గ్రూపులుగా విభజించి.. ఒక్కో గ్రూపుకు ఒక్కో రకమైన డోస్ ఇచ్చి వ్యాక్సిన్‌ను పరీక్షిస్తారు. భుజం వద్ద ఇంజెక్ట్ చేసే ఈ వ్యాక్సిన్‌ను.. 28 రోజుల గ్యాప్‌లో రెండుసార్లు ఇస్తారు. దాదాపు 14 నెలల పాటు సాగే వ్యాక్సిన్ ప్రయోగాల కోసం ఒక్కో వలంటీరన్‌ను 11 సార్లు పరీక్షలకు రమ్మని చెబుతారు. ఇందుకు గాను వారికి ఒక్కో అపాయింట్‌మెంట్‌కు 100 డాలర్లు ఇవ్వనున్నారు. మొత్తంగా 1100 డాలర్లు ఇవ్వనున్నారు.

వ్యాక్సిన్ ధరపై ఏమంటున్నారు..
అందరికీ అందుబాటులో తక్కువ ధరకే వ్యాక్సిన్‌ను తయారుచేసేందుకు ప్రయత్నిస్తున్నామని.. కానీ తమ ప్రయోగాల కోసం ప్రైవేట్ పెట్టుబడుల భాగస్వామ్యం కూడా అవసరం కాబట్టి.. ధరల నియంత్రణ తమ చేతిలో లేదని హెల్త్ & హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ అలెక్స్ అజర్ తెలిపారు. వ్యాక్సిన్ తయారీ, చికిత్సా విధానాలను రూపొందించడమే తమ ప్రాధాన్యత అని, ధరల నియంత్రణపై తామేమీ చేయలేమని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications